ETV Bharat / bharat

Margadarsi: ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు.. వాటన్నింటిని కలిపి విచారించేలా కౌంటర్​కు ఆదేశం

author img

By

Published : Apr 22, 2023, 9:45 AM IST

TS HC Notices to AP Govt and CID: మార్గదర్శి సంస్థ ఛైర్మన్‌, ఎండీలపై ఒకే విధమైన ఆరోపణలతో పలు కేసులు నమోదు చేయడంపై ఏపీ ప్రభుత్వానికి, సీఐడీ, ఇతర అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అన్ని కేసులను కలిపి ఒకే కేసుగా విచారణ చేపట్టే అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

TS HC Notices to AP Govt and CID
TS HC Notices to AP Govt and CID

TS HC Notices to AP Govt and CID: మార్గదర్శి సంస్థ ఛైర్మన్‌, ఎండీలపై ఒకే విధమైన ఆరోపణలతో పలు కేసులు నమోదు చేయడంపై ఏపీ ప్రభుత్వానికి, సీఐడీ, ఇతర అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అన్ని కేసులను కలిపి ఒకే కేసుగా విచారణ చేపట్టే అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకే రకమైన ఆరోపణలతో మార్చి 10న నమోదు చేసిన ఏడు కేసులను కలిపి ఒకే కేసుగా విచారణ చేపట్టాలంటూ మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు, ఛైర్మన్‌, ఎండీలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు.

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, న్యాయవాది విమల్‌వర్మ వాసిరెడ్డిలు వాదనలు వినిపిస్తూ ఒకే రకమైన ఆరోపణలతో పలు కేసులు నమోదు చేయడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. టీటీ ఆంటోనీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోందని చెప్పారు. దర్యాప్తు పేరిట పిటిషనర్లను వేధించాలన్న లక్ష్యంతో పలు కేసులు నమోదు చేస్తోందన్నారు.

విచారణ నిమిత్తం విజయవాడ వెళ్లిన ఆడిటర్‌ కె.శ్రావణ్‌ను అరెస్ట్‌ చేశారని, ఒక కేసులో కోర్టు బెయిలు మంజూరు చేసినా మరో కేసు విచారణ పేరుతో జైలులోనే ఉంచారన్నారు. ఛైర్మన్‌, ఎండీలను వేధించాలన్న లక్ష్యంతో ఇదే రకంగా నోటీసులు జారీ చేయడం, కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయని స్పష్టమవుతోందన్నారు. సీఐడీ అధికారులు ఇప్పటికే ఛైర్మన్‌, ఎండీలకు నోటీసులు జారీ చేసి విచారించారన్నారు.

అనారోగ్యంతో మంచంపై ఉన్న ఛైర్మన్‌ ఫొటోను ఏపీ ముఖ్యమంత్రికి చెందిన సాక్షి పత్రికకు లీక్‌ చేశారన్నారు. వారికి తిరిగి నోటీసులివ్వనున్నట్లు మీడియాతో చెప్పారని, పలు కేసుల పేరుతో పిటిషనర్లను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. అందువల్ల ప్రస్తుతమున్న 7 కేసులతోపాటు భవిష్యత్తులో నమోదు చేసే కేసులను కలిపి ఒకే కేసుగా విచారించేలా ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఏపీ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, స్టాంపుల శాఖ ఐజీ, సీఐడీ, సీఐడీ డీఎస్పీ, విజయవాడ, గుంటూరు, అనంతపురం, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల సహాయ రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.

మచ్చలేని మార్గదర్శి..: 1962లో ప్రారంభమైన మార్గదర్శి 4 రాష్ట్రాల్లో 108 బ్రాంచ్‌ల్లో 2.71 లక్షల మంది చందాదారులతో రూ.9,677 కోట్ల వార్షిక టర్నోవర్‌తో చిట్‌ఫండ్‌ కంపెనీల్లో దేశంలోనే అతి పెద్ద కంపెనీగా వ్యాపారం నిర్వహిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలుగా ఏ రకంగానూ ఒక చిన్న ఫిర్యాదు కూడా లేకుండా వ్యాపారం నిర్వహిస్తోందని తెలిపారు. 2019 ఎన్నికల్లో వైకాపా గెలుపొందాక బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి.. మార్గదర్శి ఛైర్మన్‌, కంపెనీలకు వ్యతిరేకంగా బహిరంగంగా ఆరోపణలు చేశారని తెలిపారు.

ప్రస్తుత కక్షసాధింపు చర్యలకు ఆ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. మార్గదర్శి వ్యాపారాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న ఏకైక లక్ష్యంతో గత ఏడాది నవంబరులో పలు బ్రాంచిల్లోని రికార్డుల తనిఖీ చేపట్టారని తెలిపారు. ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయకపోయినా రిజిస్ట్రార్లు తనిఖీలు చేపట్టారన్నారు. ప్రజలను చైతన్యపరచడం అనే పేరుతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ నవంబరు 28న నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కూడా ఎలాంటి ఫిర్యాదునూ ప్రస్తావించలేదన్నారు.

డిసెంబరులో మరోసారి విలేకర్ల సమావేశం నిర్వహించడం ద్వారా సోదాల వెనుక దురుద్దేశం అర్థమవుతోందని పేర్కొన్నారు. సోదాలకు అనుమతిస్తూ జిల్లా రిజిస్ట్రార్‌ గత డిసెంబరు 13న ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ ఇదే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. చందాదారుల వ్యక్తిగత వివరాలను అడగటం వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగమని, సోదాలు నిర్వహించడానికి చట్టబద్ధంగా కారణాలను పేర్కొనకపోవడాన్ని ఈ హైకోర్టు ఉత్తర్వుల్లో ప్రస్తావించిందన్నారు.

ఏదైనా చిట్‌, చిట్‌ గ్రూపుల్లో అక్రమాలు జరిగినట్లు కూడా సమాచారం లేదంటూ వ్యాఖ్యానించిందన్నారు. చట్టబద్ధమైన విధులను సహాయ రిజిస్ట్రార్లు నిర్వహించకపోవడంతో కంపెనీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. కఠిన చర్యలు తీసుకోరాదంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. హైకోర్టు ఉత్తర్వులున్నప్పటికీ తలాతోక లేని విచారణలతో ఒకే రకమైన ఆరోపణలతో 7 కేసులు పెట్టి వేధింపులకు ప్రయత్నిస్తోందన్నారు.

మార్గదర్శిలో మూడో రోజూ సీఐడీ తనిఖీలు: విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమహేంద్రవరం, ఏలూరు తదితర ప్రాంతాల్లోని మార్గదర్శి చిట్‌ఫండ్‌ బ్రాంచిల్లో సీఐడీ తనిఖీలు మూడో రోజైన శుక్రవారం కూడా కొనసాగాయి. విజయవాడ లబ్బీపేట మార్గదర్శి బ్రాంచిలో సీఐడీ అధికారులు ఆడిటర్లు, రెవెన్యూ సిబ్బందిని వెంట తీసుకొచ్చి మరీ దస్త్రాలను పరిశీలిస్తున్నారు. గుంటూరులోని అరండల్‌పేట మార్గదర్శి బ్రాంచి కార్యాలయంలో సీఐడీ అధికారులు శుక్రవారం రాత్రి 8.20 గంటలకు సోదాలు ముగించి, కొన్ని దస్త్రాలను తీసుకెళ్లారు. బ్రాంచి ఫోర్‌మెన్‌, అకౌంట్స్‌ అధికారులకు 26 ప్రశ్నలు వేసి, సమాధానాలు నమోదు చేశారు. తర్వాత ఫోర్‌మెన్‌, అకౌంట్స్‌ అధికారితో సంతకాలు పెట్టించుకున్నారు. సోదాలు ముగిసే సమయంలో అధికారులు సాక్షి మీడియాకు సమాచారమిచ్చి పిలిపించుకున్నారు. తాము తీసుకెళ్తున్న రికార్డులు, ఉద్యోగులు సంతకాలు పెడుతున్న దృశ్యాలను వారితో వీడియో తీయించారు.

పల్నాడు జిల్లా నరసరావుపేట బ్రాంచి కార్యాలయంలో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం సీతంపేట మార్గదర్శి బ్రాంచిలోనూ సీఐడీ అధికారుల తనిఖీలు కొనసాగాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఏఎస్పీ రఘువర్మ ఆధ్వర్యంలో సిబ్బంది రాత్రి వరకు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. సీఐడీ అధికారులతోపాటు, చిట్స్‌ రిజిస్ట్రార్‌ కామేశ్వరి పాల్గొని పలు దస్త్రాలు పరిశీలించారు. ఈ మెయిల్స్‌ను కాపీ చేసుకున్నారు. ఏలూరు మార్గదర్శి కార్యాలయంలోనూ దస్త్రాలను పరిశీలించారు. కార్యాలయానికి వచ్చిన ఖాతాదారులను విచారణ జరుగుతోందని, తర్వాత రావాలని వెనక్కి పంపించారు. సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకుని స్విచ్ఛాఫ్‌ చేశారు. వారిని వ్యక్తిగత అవసరాలకూ బయటకు పంపలేదు. తమ అనుమతి లేకుండా బయటికివెళ్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. రాజమహేంద్రవరంలోని మార్గదర్శి కార్యాలయంలో మూడో రోజైన శుక్రవారం కూడా సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఈమెయిల్స్‌ అన్నింటినీ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.