ETV Bharat / bharat

'UPA పాలనలో ఒక దశాబ్దం వృథా.. భారత్​ పరువు గంగపాలు'.. మోదీ తీవ్ర విమర్శలు

author img

By

Published : Feb 8, 2023, 4:40 PM IST

Updated : Feb 8, 2023, 6:50 PM IST

కాంగ్రెస్ పాలనలో దేశం దశాబ్ద కాలాన్ని కోల్పోయిందని.. ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు సాగిన UPA పాలనలో.. అంతర్జాతీయంగా భారత్​ పరువు పోయిందని ఆరోపించారు. లోక్​సభలో ప్రసగించిన ప్రధాని.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో గత తొమ్మిదేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి చూసి కొందరు బాధ పడుతున్నారని.. నిరాశలో కూరుకుపోతున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కోట్లాది మంది ప్రజల విశ్వాసం తన రక్షణ కవచమన్న ప్రధాని.. ప్రతిపక్షాల ఆరోపణలు దీన్ని ఛేదించలేవని అన్నారు.

narendra modi parliament speech today
narendra modi parliament speech today

లోక్​సభలో రాష్ట్రపతి ప్రసంగం కోట్లాది మంది భారతీయులకు.. మార్గనిర్దేశం చేసిందని ప్రధాని మోదీ వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్​సభలో మాట్లాడిన ప్రధాని.. ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేశారు. ఓ పెద్ద నేత రాష్ట్రపతిని కూడా అవమానించారన్న మోదీ.. గిరిజనులపై ఉన్న ద్వేషాన్ని వారు బయటపెట్టారని మండిపడ్డారు.

"దూరదృష్టితో కూడిన ప్రసంగంతో రాష్ట్రపతి మా అందరికీ, దేశంలోని కోట్లాది మంది ప్రజలకు మార్గనిర్దేశం చేశారు. గణతంత్ర దేశానికి అధిపతిగా ఆమె ఉనికి చారిత్రకం. దేశంలోని కుమార్తెలకు, సోదరీమణులకు రాష్ట్రపతి స్ఫూర్తిదాయకం. రాష్ట్రపతి ఆదివాసుల గౌరవాన్ని పెంచారు. లోక్​సభలో మంగళవారం కొంతమంది వ్యక్తుల ప్రసంగం తర్వాత ఇక్కడి వాతావరణం చూస్తే చాలా మందిలో ఉత్సాహం తొణికిసలాడింది. రాష్ట్రపతి ప్రసంగం కొనసాగుతున్నప్పుడు కొందరి కళ్లు కుట్టాయి. ఒక పెద్ద నాయకుడు రాష్ట్రపతిని కూడా అవమానించారు. గిరిజనులపై ఉన్న ద్వేషాన్ని వారు ప్రదర్శించారు. ఇలాంటి అంశాలను టీవీల్లో చూసిన తర్వాత వారి లోపల ఉన్న ద్వేషం బయటపడింది. తర్వాత ఆ నేతలు లేఖ రాసి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు."

--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమవుతున్న వేళ.. అంతర్జాతీయంగా భారత్ స్థిరమైన సమృద్ధి సాధిస్తోందని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో బలమైన, స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.

"భయంకరమైన మహమ్మారితో ప్రపంచం కకావికలమైంది. యుద్ధం కారణంగా విధ్వంసం జరిగింది. అనేక దేశాల్లో అస్థిరమైన వాతావరణం నెలకొంది. కొన్ని దేశాల్లో భయంకరమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహారం, తాగునీటికి సంకట స్థితి నెలకొంది. మన ఇరుగుపొరుగు దేశాల్లోనూ అదే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలోనూ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదోస్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే సమృద్ధ దేశంగా ఉన్న భారత్​ నేడు జీ-20 సదస్సుకు అధ్యక్షత వహిస్తోంది. ఇది దేశం గర్వించదగ్గ విషయం. కానీ ఇది కొందరికి దుఃఖం కలిగిస్తుందని నాకు అనిపిస్తోంది. ఇందులో ఎవరికి దుఃఖం కలుగుతుందో వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. భారత్​లో 2,3 దశాబ్దాలుగా అస్థిరత నెలకొంది. నేడు స్థిరత్వం ఉంది. రాజకీయంగా స్థిరత్వం ఉంది. స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉంది" అని అన్నారు మోదీ.

ప్రజలు మోదీని నమ్ముతున్నారన్న ప్రధాని.. కానీ ఆ నమ్మకం వార్తా పత్రికల్లో శీర్షికల వల్ల, టీవీ దృశ్యాల వల్ల వచ్చింది కాదన్నారు. అంకితభావంతో ప్రజా సేవకు కట్టుబడటం వల్లే ప్రజా విశ్వాసం పొందగలిగానని తెలిపారు. నిర్మాణాత్మక విమర్శలకు బదులు నిరాధార ఆరోపణలతో ప్రతిపక్షాలు గత తొమ్మిదేళ్లను వృథా చేశాయని ప్రధాని అన్నారు. UPA పాలనలో భారత్ ఒక దశాబ్దాన్ని కోల్పోయిందన్న మోదీ.. 2014కి ముందు దశాబ్దం ది లాస్ట్​ డికేడ్​గా గుర్తుండిపోతుందన్నారు.

"2014కు ముందు ఉన్న పదేళ్లలో 2004 నుంచి 2014 వరకు ఆర్థిక వ్యవస్థ పతనమైంది. పదేళ్లలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. అందుకే వారిలో నిరాశ బాగా పెరిగిపోతుంది. దేశ స్వాతంత్ర్యం తర్వాత 2004 నుంచి 2014 దశకంలో ఉగ్రదాడులు ఎక్కువగా జరిగాయి. యూపీఏ హయాంలోని ఆ పదేళ్లు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఆ పదేళ్ల పాలనలో జమ్ముకశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు హింస పేట్రేగిపోయింది. ఆ పదేళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ మాట వినేవారు కూడా ఎవరూ లేకుండా పోయారు."

--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

కాంగ్రెస్ పార్టీ పతనంపైనా మోదీ విమర్శలు చేశారు. ప్రతిపక్షాలను ఈడీ ఏకతాటిపైకి తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు.

"దేశ ప్రజలు, ఎన్నికల ఫలితాలు వీరిని( ప్రతిపక్షాలు) ఒకే వేదికపైకి తీసుకొస్తాయి. కానీ అది జరగలేదు. వీరందరూ ఈడీకి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈడీ కారణంగా వీరందరూ ఒకే వేదికపైకి వచ్చారు. ఇక్కడ కొంతమందికి హార్వర్డ్ అధ్యయనం అంటే చాలా ఆసక్తి. కరోనా సమయంలో భారత్​లో దారుణ పరిస్థితులపై హార్వర్డ్​ కేస్​ స్టడీ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కానీ గత కొన్నేళ్లుగా హార్వర్డ్​లో ఒక పెద్ద అధ్యయనం జరుగుతోంది. అది చాలా ముఖ్యమైన అధ్యయనం. ఆ అధ్యయనం ఏంటంటే.. ద రైస్ అండ్​ డిక్లైన్ ఆఫ్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కేవలం హార్వర్డ్ ఒక్కటే కాదు ప్రపంచంలోని పెద్దపెద్ద విశ్వవిద్యాలయాలు కూడా కాంగ్రెస్​ పతనంపై అధ్యయనం చేస్తాయన్న నమ్మకం నాకుంది."

--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ప్రపంచంలో భారత్ తయారీకి కేంద్రంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ దూసుకెళ్తోందని వెల్లడించారు. ఇప్పుడు ప్రపంచం చూపు భారత్​పై ఉందన్నారు.

నేను సంతృప్తి చెందలేదు
గౌతమ్​ అదానీని ప్రధాని మోదీ రక్షిస్తున్నారని.. అందుకే ఆయనపై విచారణకు ఆదేశించలేదని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆయనకు తాను వేసిన ప్రశ్నలపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మాట్లాడిన అనంతరం పార్లమెంట్​ ఆవరణలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"నేను సంతృప్తి చెందలేదు. కానీ నిజం బయట పడింది. అదానీ స్నేహితుడు కాకపోతే ఎందుకు విచారణకు ఆదేశించలేదు? రక్షణ రంగంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని.. ప్రధాని దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇది దేశ రక్షణకు సంబంధించిన అంశం. దీనిపై విచారణ జరుగుతుందని ప్రధాని చెప్పాలి. నేను ఏం కష్టతరమైన ప్రశ్నలు అడగలేదు. మీరు అదానీని ఎన్నిసార్లు కలిశారు. ఆయనతో కలిసి ఎన్ని సార్లు వెళ్లారు. అని మాత్రమే అడిగాను. కానీ వాటికి కూడా ఆయన సమాధానం చెప్పలేదు."

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

Last Updated :Feb 8, 2023, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.