ETV Bharat / bharat

తవాంగ్‌పై చైనాకు ఎందుకింత ఆరాటం.. అసలు కారణం ఇదే!

author img

By

Published : Dec 13, 2022, 7:22 AM IST

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వద్ద చైనా పదే పదే ఘర్షణలకు దిగుతుంది. ఆ ప్రాంతాన్ని దాని ఆధీనంలోకి తీసుకోవాలని దుస్సాహసానికి పాల్పడుతోంది. తవాంగ్​ భారత భూభాగమని ప్రపంచం గుర్తించిన డ్రాగన్‌ దీన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ ఆరాటం అంతా చైనా వ్యూహాత్మక ప్రయోజనాల కోసమే. చైనా ఎందుకు ఇలా చేస్తోంది. దానికి వెనుక గల కారణాలు, తవాంగ్ వల్ల చైనాకు చేకూరే లాభాలు తెలుసుకుందాం.

tawang at arunachal pradhesh
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో చైనా సైనికుల దుస్సాహసానికి కారణం ఆ ప్రాంతాన్ని మింగేయాలన్న దశాబ్దాల నాటి వారి దుర్బుద్ధే! అరుణాచల్‌పై భారత సార్వభౌమాధికారాన్ని ప్రపంచం మొత్తం గుర్తించినా.. డ్రాగన్‌ దీన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఏకంగా ఆ రాష్ట్రం మొత్తాన్నీ తనదిగా చెబుతోంది. అది దక్షిణ టిబెట్‌లో భాగమని వాదిస్తోంది. ప్రధానంగా తవాంగ్‌ జిల్లాను తన వశం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనికి వ్యూహాత్మక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి.

ఎందుకు?
1972 వరకూ అరుణాచల్‌ ప్రదేశ్‌ను నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ఏజెన్సీ (ఎన్‌ఈఎఫ్‌ఏ)గా పిలిచేవారు. ఇది ఈశాన్య భారత్‌లో అతిపెద్ద రాష్ట్రం. టిబెట్‌, భూటాన్‌, మయన్మార్‌లతో సరిహద్దులను కలిగి ఉంది. ఒక విధంగా భారత ఈశాన్య ప్రాంతానికి ఇది రక్షణ కవచం. అరుణాచల్‌లోని వాయవ్య ప్రాంతంలో తవాంగ్‌ ఉంది. ఈ జిల్లాకు భూటాన్‌, టిబెట్‌లతో సరిహద్దులు ఉన్నాయి.

తవాంగ్‌పై పట్టు బిగిస్తే తనకు వ్యూహాత్మక ప్రయోజనాలుంటాయని చైనా భావిస్తోంది. భారత ఈశాన్య ప్రాంతంలోకి చొరబడటానికి ఇది తనకు ఉపయోగపడుతుందని అంచనావేస్తోంది. టిబెట్‌, బ్రహ్మపుత్ర లోయ మధ్య ఉన్న నడవాలో తవాంగ్‌ భౌగోళికంగా చాలా కీలక ప్రదేశంలో ఉంది.

సాంస్కృతిక కారణాలు..
టిబెటన్‌ బౌద్ధంతో తవాంగ్‌కు గట్టి సంబంధాలు ఉన్నాయి. ఆ జిల్లాలో గాండెన్‌ నంగ్యాల్‌ లాత్సే బౌద్ధారామం ఉంది. దీన్ని తవాంగ్‌ బౌద్ధారామం అని కూడా పిలుస్తారు. టిబెటన్‌ బౌద్ధానికి సంబంధించి ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం. ఇది 350 ఏళ్ల నాటిది. ఐదో దలైలామా ఆకాంక్షలకు అనుగుణంగా దీన్ని మేరాగ్‌ లోడ్రో గ్యామత్సో అనే బౌద్ధ సన్యాసి 1680-81 సంవత్సరంలో స్థాపించారు.

దీనికితోడు ఆరో దలైలామా తవాంగ్‌లోని ఉర్గెలింగ్‌ గొంపా ప్రాంతంలో జన్మించారు. ఈ జిల్లా ఒకప్పుడు టిబెట్‌లో అంతర్భాగంగా ఉండేదనడానికి తవాంగ్‌ బౌద్ధారామమే నిదర్శనమని చైనా వాదిస్తోంది. 1914లో కుదిరిన శిమ్లా ఒప్పందాన్ని విస్మరిస్తూ డ్రాగన్‌ తవాంగ్‌పై వితండవాదం చేస్తోంది. ఈ ఒప్పందం ద్వారానే తూర్పు సెక్టార్‌లో భారత్‌, టిబెట్‌ మధ్య సరిహద్దును సూచించే ‘మెక్‌మోహన్‌ రేఖ’ తెరపైకి వచ్చింది. అది స్పష్టంగా తవాంగ్‌ను భారత్‌లో అంతర్భాగంగా పేర్కొంది.

తిరుగుబాటు భయం..
టిబెటన్‌ బౌద్ధానికి తవాంగ్‌ ముఖ్య కేంద్రం. ఎగువ అరుణాచల్‌ ప్రాంతంలో అనేక గిరిజన జాతులకు టిబెట్‌తో సాంస్కృతిక సంబంధాలున్నాయి. మోంపా తెగవారు ఆ మతాన్ని అనుసరిస్తారు. వీరు టిబెట్‌లోనూ కనిపిస్తారు. ఇలాంటి జాతులు ఆరుణాచల్‌ ప్రాంతంలోనూ ఉండటం వల్ల భవిష్యత్‌లో తనకు వ్యతిరేకంగా టిబెట్‌లో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం రాజుకునే ముప్పు ఉందని చైనా ఆందోళన చెందుతోంది.

రాజకీయ ప్రాధాన్యం
చైనా అణచివేత నేపథ్యంలో 1959లో దలైలామా టిబెట్‌ను వీడి భారత్‌ చేరారు. తవాంగ్‌ గుండానే ఆయన మన దేశంలోకి అడుగుపెట్టారు. అంతేకాదు.. అక్కడి బౌద్ధారామంలో కొంతకాలం బస చేశారు.

భారత క్షిపణులను తప్పించుకోవడానికి..
క్షిపణులతో చైనాను లక్ష్యంగా చేసుకోవడానికి భారత్‌కు అత్యంత అనువైన ప్రాంతం అరుణాచల్‌ ప్రదేశ్‌. డ్రాగన్‌ వైమానిక దాడులను తిప్పికొట్టడానికి బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థను మోహరించడానికి కూడా ఇదే అనుకూలంగా ఉంటుంది. భారత్‌కు ఇలాంటి ప్రయోజనాలు దక్కకుండా చూడాలంటే.. అరుణాచల్‌ చేజిక్కించుకోవాలని డ్రాగన్‌ భావిస్తోంది.

భూటాన్‌పై పెత్తనం చేయొచ్చు..
అరుణాచల్‌ను కబళిస్తే.. భూటాన్‌కు ఇరువైపులా తన దేశ సరిహద్దులు ఉంటాయని చైనా భావిస్తోంది. ఇప్పటికే భూటాన్‌ పశ్చిమ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రదేశాలను అనుసంధానించడానికి రోడ్లను నిర్మిస్తోంది. వీటిని డోక్లామ్‌ నుంచి గమోచిన్‌ వరకూ విస్తరించాలని డ్రాగన్‌ భావిస్తోంది. ఆ ప్రాంతం భారత సైనిక రక్షణలో ఉంది. దీనివల్ల అంతిమంగా.. కీలకమైన శిలిగుడి నడవాకు చైనా చేరువవుతుంది. అది భారత్‌, భూటాన్‌కు భద్రతాపరంగా ముప్పు కలిగిస్తుంది.

జలమే ఆయుధంగా..
భారత ఈశాన్య ప్రాంతానికి ప్రవహించే జలాలపై చైనాకు పట్టు ఉంది. ఆ ప్రాంతంలోకి పారే నదులపై అనేక డ్యామ్‌లను నిర్మించింది. తద్వారా మన దేశానికి వ్యతిరేకంగా భౌగోళిక-వ్యూహాత్మక ఆయుధంగా నీటిని చైనా ఉపయోగించే వీలుంది. ఆ ప్రాంతంలో ఇష్టారీతిన వరదలు లేదా కరవును సృష్టించే ప్రయత్నం చేయవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.