ETV Bharat / bharat

High Court on Margadarsi Raids: "మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవరకు మార్గదర్శిలో తనిఖీలు నిలిపివేయాలి".. ఏపీ హైకోర్టు సూచన

author img

By

Published : Aug 21, 2023, 4:10 PM IST

Updated : Aug 22, 2023, 7:23 AM IST

High_Court_on_Margadarsi_Raids
High_Court_on_Margadarsi_Raids

16:05 August 21

ఒకటి, రెండు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామన్న హైకోర్టు

High Court on Margadarsi Raids: "మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవరకు మార్గదర్శిలో తనిఖీలు నిలిపివేయాలి".. ఏపీ హైకోర్టు సూచన

High Court on Margadarsi Raids: మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వెల్లడించే వరకు.. మార్గదర్శి చిట్‌ఫండ్‌ బ్రాంచిల్లో సోదాలు చేయవద్దని అధికారులకు సూచించాలని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య సోమవారం ఈ మేరకు ప్రభుత్వ, సీఐడీ తరఫు న్యాయవాదులకు మౌఖికంగా సూచించారు. సోదాలు చేయాల్సి వస్తే.. పనివేళల్లో మాత్రమే చేపట్టాలని తెలంగాణ హైకోర్టు నిర్ధిష్టమైన ఆదేశాలిస్తే అందుకు భిన్నంగా రాత్రి వేళల్లో పోలీసు అధికారులు ఎలా సోదాలు నిర్వహిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఫొటోలను పరిశీలిస్తే రాత్రివేళల్లో సోదాలు చేసినట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోందన్నారు. మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై.. నిర్ణయాన్ని వాయిదా వేశారు.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థను మూసివేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా తీసుకుంటున్న నిర్ణయాలను.. ఏపీలోని 37 బ్రాంచిల్లో ఈ నెల 17 నుంచి వివిధ శాఖల అధికారులు సోదాలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ ఆథరైజ్డ్‌ సిగ్నేటరీ పి.రాజాజీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ సంస్థ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు.

MP Raghu Ramakrishna Raju lashed out at the YCP: సీఎం జగన్ నాయకత్వంలోనే... మార్గదర్శిపై దాడులు: రఘురామకృష్ణరాజు

మార్గదర్శిని దెబ్బతీయాలని ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోందని వాదించారు. అందులో భాగంగానే.. చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తూ సోదాలకు తెరతీశారని వివరించారు. చిట్‌ రిజిస్ట్రార్లు, సీఐడీ, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ ఇంటెలిజెన్స్, పోలీసులు, అనధికారిక వ్యక్తులు సోదాల పేరుతో మార్గదర్శి కార్యాలయాల్లోకి చొరబడ్డారని తలుపులు, షట్టర్లు మూసివేయించారని వివరించారు.

సొమ్ము చెల్లించేందుకు వస్తున్న చందాదారులను అడ్డుకున్నారని.. సోదాల పేరుతో రాత్రింబవళ్లు మార్గదర్శి సిబ్బంది, చందాదారులను ఇబ్బందిపెట్టారని నాగముత్తు వాదించారు. రోజువారీ కార్యకలాపాలకు అవరోధం కలిగించారని.. అందుకు ఆధారాలైన ఫొటోలను పరిశీలించాలని తెలిపారు. పూర్తి వివరాలు వీడియో రూపంలో కోర్టు ముందు ఉంచేందుకు సిద్ధమన్నారు. సోమవారం మార్గదర్శి కార్యాలయాలకు.. సాధారణ సెలవైనప్పటికీ ఓ బ్రాంచిలో తలుపులు తీసి ఉంచాలని బలవంతం చేశారని.. సీనియర్‌ న్యాయవాది పేర్కొన్నారు.

APPF Comments on Margadarsi Case: 'మార్గదర్శిపై వేధింపులు కక్షపూరితం.. వ్యాపారాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం చర్యలు'

‘చిట్స్‌ చట్టప్రకారం రిజిస్ట్రార్, డిప్యూటీ, సహాయ రిజిస్ట్రార్లకు మాత్రమే రికార్డులను పరిశీలించే, సోదాలు నిర్వహించే అధికారం ఉందని వాదించారు. అందుకు భిన్నంగా గుమస్తా సిబ్బందితో రికార్డులు తనిఖీ చేయిస్తున్నారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రికార్డుల పరిశీలన అధికారాన్ని సీనియర్‌ అసిస్టెంట్‌కు బదలాయించారని వాదించారు.

చిట్‌ రిజిస్ట్రార్లతో పాటు ఫలానా అధికారులు తనిఖీలు చేయవచ్చంటూ ఇప్పటి వరకు.. ప్రభుత్వం ఎలాంటి గెజిట్‌ ప్రకటన ఇవ్వలేదన్నారు. అలాంటప్పుడు చిట్‌ రిజిస్ట్రార్లు తప్ప.. మరెవరికీ రికార్డులను పరిశీలించే అధికారం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రిజిస్ట్రేషన్‌ చట్టం, చిట్‌ఫండ్‌ చట్టం వేర్వేరని చిట్‌ఫండ్‌ చట్ట నిబంధనలను అనుసరించి సోదాల నిర్వహణకు ఉత్తర్వులు జారీచేసే అధికారం రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీకి లేదన్నారు. ఆయన ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవన్నారు.

Second Day Raids in Margadarsi మార్గదర్శిపై రెండోరోజు కొనసాగిన కక్షసాధింపు పర్వం..!

చిట్స్‌ సంస్థల్లో తనిఖీలు చేసేందుకు చిట్‌ రిజిస్ట్రార్‌కు మాత్రమే అధికారాలున్నాయని, సీఐడీకి సైతం ఆ అధికారం లేదని.. మార్గదర్శి న్యాయవాది చెప్పారు. నిబంధనల ప్రకారం పనివేళల్లోనే రికార్డుల పరిశీలన, సోదాలు చేయాలని.. దీనిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించారని వాదించారు. ఈ నెల 17 నుంచి బ్రాంచి కార్యాలయాల్లో కొన్ని చోట్ల షట్టర్లను మూసివేసి.. వ్యాపార కార్యకలాపాలు జరగకుండా అడ్డుకున్నారని చెప్పారు.

శని, ఆదివారాల్లో చిట్టీల వేలం పాటలు నిర్వహించేందుకు అడ్డంకులు కల్పించారని వాదించారు. రోజుకో ఎత్తుగడతో వ్యవహరిస్తున్నారని.. 60 ఏళ్లుగా ఎలాంటి మచ్చగానీ ఒక్క ఫిర్యాదుగానీ లేకుండా మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని వాదించారు.

AP Government Once Again Actions on Margadarsi: మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపు చర్యలు.. కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా

ఈ ప్రభుత్వ విధానాల్లోని నిర్ణయాలను ఎత్తిచూపుతున్న ‘ఈనాడు, ఈటీవీలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని. ‘ఈనాడు’ భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోందన్నారు. యాజమాన్యాన్ని లొంగదీసుకునేందుకు మార్గదర్శిపై నిరంతరాయంగా దాడులు చేయిస్తోందని న్యాయవాది వాదించారు. చిట్‌ గ్రూపుల నిలిపివేత విషయంలో ప్రభుత్వం జారీచేసిన బహిరంగ నోటీసుపై హైకోర్టు స్టే విధించిందని ఆయన గుర్తుచేశారు.

అప్పటి నుంచి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోయినా, దురుద్దేశంతోనే తాజాగా సోదాలు చేస్తున్నారని వాదించారు. ఇందుకు కోర్టు నుంచి అనుమతైనా తీసుకోలేదన్నారు. 2022 నవంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు సుమారు ఐదు నెలలపాటు అన్ని బ్రాంచిల్లో సోదాలు చేశారని చెప్పారు. సోదాలు పూర్తయ్యాయని అప్పట్లో అడ్వకేట్‌ జనరల్‌.. కోర్టుకు నివేదించారని గుర్తుచేశారు.

Bonda Uma on Jagan: మార్గదర్శిపై కక్షసాధింపులో భాగంగానే జగన్‌ దాడులు చేయిస్తున్నాడు: బొండా ఉమా

సోదాల నిమిత్తం జారీచేసిన నోటీసుపై ఈ ఏడాది మార్చిలో హైకోర్టు స్టే ఇచ్చిందని ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సోదాలు చేయాల్సిన అవసరం ఏముందని న్యాయవాది నాగముత్తు కోర్టు దృష్టికి తెచ్చారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామన్నారు. పనివేళల్లో తనిఖీలు చేస్తే కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నందున రాత్రివేళల్లోనూ కొనసాగించామన్నారు.

సీఐడీ తరఫున న్యాయవాది శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ మార్గదర్శిపై నమోదు చేసిన ఏడు కేసుల్లో.. రెండింటిలో ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేశామన్నారు. మిగిలిన కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం బ్రాంచిల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు.

న్యాయమూర్తి స్పందిస్తూ ఫొటోలను పరిశీలిస్తే పనిగంటలు ముగిశాక కూడా పోలీసు అధికారులు బ్రాంచిల్లో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అధికారులు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని సీఐడీ తరఫు న్యాయవాది కోరారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వెల్లడించే వరకు మార్గదర్శి బ్రాంచిల్లో సోదాలు చేయకుండా అధికారులను నిలువరించాలని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదులకు సూచించారు.

Margadarsi: మార్గదర్శిపై ప్రతీకారాత్మక దాడి.. ఏపీ సీఐడీ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించిన సంస్థ

Last Updated :Aug 22, 2023, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.