ETV Bharat / bharat

లారీతో ఢీకొట్టి డీఎస్​పీ దారుణ హత్య.. రిటైర్మెంట్​కు ముందే.. మైనింగ్ మాఫియా పనే!

author img

By

Published : Jul 19, 2022, 2:21 PM IST

Updated : Jul 19, 2022, 6:58 PM IST

అక్రమ మైనింగ్​ జరుగుతోందని విచారణకు వెళ్లిన డీఎస్​పీని దుండగులు లారీతో ఢీకొట్టి చంపేశారు. ఈ ఘటన హరియాణాలో జరిగింది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఎన్​కౌంటర్ జరిపి ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.

Haryana DSP
డీఎస్పీ హత్య

హరియాణాలో దారుణం జరిగింది. నుహ్​లో అక్రమ మైనింగ్​పై విచారణకు వెళ్లిన మేవాత్ డీఎస్​పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్​ని లారీతో ఢీకొట్టి హత్యచేశారు. పోలీసు అధికారిని ఢీకొట్టిన తర్వాత నిందితుడు పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.

ఘటన జరిగిన గంటల వ్యవధిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు జరిగిన ఎన్​కౌంటర్​లో నిందితుడికి బుల్లెట్ గాయమైంది. అతడి కాలిలో తూటా దిగిందని హరియాణా డీజీపీ పీకే అగర్వాల్ తెలిపారు. మిగిలిన నిందితులను సైతం అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. చట్టప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మైనింగ్ మాఫియాకు డీఎస్​పీ బలి

ఇదీ జరిగింది...
రాతి గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై డీఎస్​పీ సురేంద్ర సింగ్ విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా తావడూ సమీపంలోని పంచగావ్ వద్ద ఉన్న ఆరావళి కొండల వద్ద అక్రమ మైనింగ్​ను అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లారు. దారిలో వెళ్తున్న ఓ లారీని ఆపేందుకు డీఎస్​పీ ప్రయత్నించారు. అయితే, లారీ డ్రైవర్ ఇవేవీ పట్టించుకోకుండా పోలీసుపైకి వాహనాన్ని పోనిచ్చాడు.

మంగళవారం ఉదయం 11.50 గంటలకు ఈ ఘటన జరిగింది. డీఎస్​పీ వెంట ఆయన గన్​మన్, డ్రైవర్ ఉన్నారు. లారీ దూసుకొచ్చిన సమయంలో ఇరువురూ పక్కకు దూకేశారు. డీఎస్​పీ తప్పించుకోలేకపోయారు. లారీ ఢీకొట్టిన వెంటనే డీఎస్​పీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు వివరించారు.

ఏటా 50 ఫిర్యాదులు
నూహ్ జిల్లాలో మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా సాగిపోతోంది. అక్రమ మైనింగ్ జరుగుతోందన్న ఫిర్యాదులు 2015 నుంచి ఏటా కనీసం 50 వరకు అందుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు, మాఫియా మధ్య భీకర ఘర్షణలు జరుగుతున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణను సైతం ప్రారంభించారు. అయితే, పోలీసులపైనే అక్రమార్కులు దాడి చేయడం సంచలనంగా మారింది.

కొద్ది నెలల్లో రిటైర్మెంట్.. ఆలోపే..
1994లో హరియాణా పోలీసు విభాగంలో చేరారు సురేంద్ర సింగ్ బిష్ణోయ్. అసిస్టెంట్ సబ్ఇన్​స్పెక్టర్​గా విధుల్లో చేరిన ఆయన.. క్రమంగా డీఎస్​పీ స్థాయికి ఎదిగారు. హిసార్ జిల్లాలోని సారంగ్​పుర్ ఆయన సొంత ఊరు కాగా.. ప్రస్తుతం కురుక్షేత్రలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. కొద్దినెలల్లో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఆలోపే ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. డీఎస్​పీ మృతిని ధ్రువీకరించిన హరియాణా పోలీసు విభాగం.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. నిందితులను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ ఎంపీ ఫైర్
మరోవైపు, ఈ ఘటనను కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా తీవ్రంగా ఖండించారు. 'హరియాణాలో శాంతి భద్రతలు నశించాయి. నేరస్థులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మైనింగ్ మాఫియా, గ్యాంగ్​స్టర్​లు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాలు ప్రారంభమయ్యాయి. గడిచిన 10రోజుల్లో ఐదుగురు ఎమ్మెల్యేలకు హత్య బెదిరింపులు వచ్చాయి. ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. నిందితులను పట్టుకోలేకపోవడమే కాక.. ఎమ్మెల్యేలకు సురక్షిత వాతావరణాన్నీ కల్పించలేకపోతోంది. దీనికి సీఎం బాధ్యత వహించాలి. ఘటనపై శ్వేతపత్రం విడుదల చేయాలి' అని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

Last Updated :Jul 19, 2022, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.