ETV Bharat / bharat

రాహుల్​ కోసం కాంగ్రెస్ సత్యాగ్రహం.. ఎన్ని కుట్రలు చేసినా పోరాటం ఆగదన్న ఖర్గే

author img

By

Published : Mar 26, 2023, 12:42 PM IST

Updated : Mar 26, 2023, 2:32 PM IST

రాహుల్​పై తప్పుడు కేసులు పెట్టడాన్ని దేశం గమనిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రాజ్​ఘాట్ వద్ద నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఖర్గే సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు.

rahul gandhi news today
Congress Sankalp Satyagraha

బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్ మోదీని విమర్శిస్తే బీజేపీ ఎందుకు ఆందోళన చెందుతోందని కాంగ్రెస్ అధ్క్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన రాహుల్ గాంధీ గొంతును అణిచివేసేందుకే అనర్హత వేటు వేశారని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున చేసే పోరాటం ఆగదని ఖర్గే స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశారని.. ఎవరినో కించపరిచేందుకు కాదని పేర్కొన్నారు.

లోక్​సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీకి సంఘీభావంగా కాంగ్రెస్​ శ్రేణులు దేశవ్యాప్తంగా సత్యాగ్రహం చేశాయి. దిల్లీలోని రాజ్​ఘాట్ వద్ద నిర్వహించిన సంకల్ప సత్యాగ్రహ ఆందోళనల్లో పాల్గొన్న ఖర్గే.. రాహుల్‌ను రాజకీయాల్లో లేకుండా చేస్తే తమకు ఎదురులేదని బీజేపీ భావిస్తోందని ధ్వజమెత్తారు. 'రాహుల్‌పై తప్పుడు కేసులు పెట్టడాన్ని దేశమంతా చూస్తోంది. ఈ సమయంలో అందరూ మద్దతుగా నిలవాలి. కర్ణాటకలో మాట్లాడిన వ్యాఖ్యలపై సూరత్‌లో కేసు నమోదు చేశారు. విచారణకు పిలిచి రాహుల్‌ను వేధించారు. మేం చేసేది ఒకే సత్యాగ్రహం. త్వరలో దేశంలో అనేక సత్యాగ్రహాలు పుట్టుకొస్తాయి' అని ఖర్గే వ్యాఖ్యానించారు.

'రాహుల్.. దేశాన్ని ఎన్నడూ అవమానించరు'
దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రధానుల కుటుంబానికి చెందిన రాహుల్.. ఎన్నటికీ దేశాన్ని అవమానించరని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులు రక్తం చిందించి దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన తన కుటుంబాన్ని చూసి సిగ్గు పడాల్సిన అవసరం ఏముందని బీజేపీని ప్రశ్నించారు. 'చాలా మంది నా కుటుంబాన్ని అవమానించారు. నా తండ్రి, తల్లిని పార్లమెంట్​లోనే అవమానించారు. నా సోదరుడికి పేర్లు పెట్టారు. రాహుల్ గాంధీ తండ్రి ఎవరో తెలియదని మీ ముఖ్యమంత్రి అన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారిపై అనర్హత వేటు వేయలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోలేదు. మేం మాత్రం వాటిపై మౌనంగానే ఉన్నాం. నా సోదరుడు (రాహుల్) మోదీని పార్లమెంట్​లోనే కౌగిలించుకొని మీపై నాకు ఎలాంటి ద్వేషం లేదని చెప్పారు. మన మధ్య సైద్ధాంతిక భేదాలు ఉండొచ్చు. కానీ విద్వేషం ఉండకూడదు' అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

congress-sankalp-satyagraha-
రాజ్​ఘాట్ వద్ద ఖర్గే, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ నేతలు

రాజ్​ఘాట్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఖర్గే, ప్రియాంకా గాంధీ సహా సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పీ చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్ వంటి కీలక నేతలు పాల్గొన్నారు. పోలీసులు ఈ ఆందోళనకు అనుమతి ఇవ్వనప్పటికీ.. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు సత్యాగ్రహానికి హాజరయ్యారు. పెద్ద ఎత్తున రాజ్​ఘాట్​కు చేరుకున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో రాహుల్​పై అనర్హత వేటు పడింది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒకరోజు నిరసనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్ష చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

అంతకుముందు.. రాజ్​ఘాట్ వద్ద సెక్షన్ 144 అమలులో ఉన్నందున ఈ నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేమని దిల్లీ పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు సైతం ఉన్నాయని తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ నిరసనకు అనుమతి ఇవ్వనప్పటికీ.. రాజ్​ఘాట్ వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశామని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు.

అయితే, శాంతియుతంగా నిర్వహించే సత్యాగ్రహ కార్యక్రమానికి అనుమతులు ఇవ్వకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత వేణుగోపాల్ ధ్వజమెత్తారు. 'పార్లమెంట్​లో మా గళాన్ని అణచివేసిన తర్వాత.. నిరసనలు కూడా చేసుకోనివ్వడం లేదు. బాపూ సమాధి వద్ద కూడా శాంతియుతంగా సత్యాగ్రహం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వరా?' అని ప్రశ్నించారు. 'విపక్షాలు చేసే ఏ నిరసననైనా అణచివేయడం మోదీ సర్కారుకు అలవాటైపోయింది. ఇది మా సంకల్పాన్ని దెబ్బతీయదు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. సత్యం కోసం మా పోరాటం కొనసాగుతుంది' అని వేణుగోపాల్ ట్వీట్ చేశారు.

congress-sankalp-satyagraha-
ఉత్తరాఖండ్​లో కాంగ్రెస్ సంకల్ప సత్యాగ్రహం

'అనర్హతకు గురైన ఎంపీని'
అనర్హత వేటు పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ తన ట్విట్టర్ బయోను మార్చేశారు. ఇదివరకు ఆయన ట్విట్టర్ బయోలో 'పార్లమెంట్ ఎంపీ' అని ఉండేది. ఆ స్థానంలో 'అనర్హతకు గురైన ఎంపీ' అని బయోను మార్చేశారు.

Last Updated :Mar 26, 2023, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.