ETV Bharat / bharat

CBI Charge Sheet on Avinash: రాజకీయ వైరుధ్యాలతోనే వివేకా హత్యకు కుట్ర.. కానీ గుండెపోటు అని కట్టుకథ..

author img

By

Published : Jul 22, 2023, 8:10 AM IST

వివేకా హత్యకు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కుట్ర సహా సాక్షాలను చెరిపేసి నేరానికి పాల్పడ్డారని.. రెండో అనుబంధ అభియోగపత్రంలో సీబీఐ పేర్కొంది. గూగుల్ టేకవుట్, ఫోన్ కాల్స్ విశ్లేషణ డేటా ఆధారాలుగా ఉన్నాయని సీబీఐ తెలిపింది. అవినాష్ రెడ్డి.. తన ఫోన్లను ఇవ్వలేదని కోర్టుకు నివేదించిన సీబీఐ.. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంది. ఈ కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని.. పలు విశ్లేషణల నివేదికలు అందాల్సి ఉందని సీబీఐ స్పష్టం చేసింది.

avinash reddy
avinash reddy

అవినాష్‌పై హత్యానేరం.. రాజకీయ వైరుధ్యాలతోనే కుట్ర.. కానీ గుండెపోటు అని కట్టుకథ..

CBI Charge Sheet Against MP Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నడమే కాక.. హత్య అనంతరం సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ వైఎస్సార్​సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై సీబీఐ అభియోగాలు మోపింది. అవినాష్‌రెడ్డితో పాటు వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇతర నిందితులతో కలిసి వివేకా హత్యకుట్రలో భాగస్వాములయ్యారని పేర్కొంది. వివేకాతో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిలకు రాజకీయ విభేదాలు ఉండటంతో ... కుట్రకు తెర తీశారని తెలిపింది.

వివేకా పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి, పనిమనిషి కుమారుడు వై.ప్రకాష్, వైఎస్‌ మనోహర్‌రెడ్డిలపై ఆరోపణలున్నా.. ప్రాసిక్యూషన్‌కు ఆధారాల్లేవని పేర్కొంది. అంతేగాక ఆస్తి వివాదాల్లో భాగంగా కుటుంబసభ్యులైన వైఎస్‌ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అల్లుడి సోదరుడు శివప్రకాష్‌రెడ్డిలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కొన్ని అంశాల్లో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పూర్తి సమాచారం అందిన వెంటనే కోర్టు ముందుంచుతామని సీబీఐ పేర్కొంది.

వివేకా ఇంటిలో ఏర్పాటు చేసిన వై-ఫై రూటర్‌ నుంచి కొంతమంది ఐఎంఓ వినియోగదారులు ఉన్నారని.. వీరి సమాచారం తెలుసుకోవడానికి కేంద్రం ద్వారా అమెరికా అధికారులకు పంపినట్లు తెలిపింది. అమెరికా అధికారులు అడిగిన సమాచారాన్ని గత నెల కూడా పంపామంది. వివేకాతో బలవంతంగా రాయించిన లేఖను నిన్‌హైడ్రిన్‌ పరీక్ష కోసం సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు, దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న కొన్ని ఫోన్లను ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం త్రివేండ్రంలోని సీడాక్‌కు పంపామని వెల్లడించింది. ఆయా ప్రాంతాల నుంచి సమాచారం అందిన వెంటనే కోర్టుకు సమర్పిస్తామని చెప్పింది.

సంఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో గంగిరెడ్డితో పాటు ఉదయ్‌కుమార్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపింది. వివేకా భార్య, కుమార్తె రాక ముందే రక్తపు మరకలను తుడిచి గుండెపోటుతో మరణించినట్లు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంది. వైఎస్‌ భాస్కరరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిల పాత్రపై దర్యాప్తు చేసిన సీబీఐ 2వ అనుబంధ అభియోగపత్రాన్ని ఇటీవల సీబీఐ కోర్టుకు సమర్పించింది..

వైఎస్‌ కుటుంబంలో రాజారెడ్డి కాలం నుంచే విభేదాలున్నాయని కోర్టుకు సమర్పించిన రెండో అభియోగపత్రంలో సీబీఐ పేర్కొంది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ కావాలన్న భాస్కరరెడ్డి కుటుంబం కోరిక తీరలేదని.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి తర్వాత జగన్‌ రాజకీయాలను శాసిస్తూ వచ్చారని పేర్కొంది. వైఎస్‌ మరణం తరువాత కాంగ్రెస్‌ తరఫున వివేకా, వైసీపీ తరఫున విజయమ్మ పులివెందులలో పోటీపడ్డారని.. తమ పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేయాలన్న జగన్‌ అభ్యర్థనను వివేకా అంగీకరించలేదంది. భాస్కరరెడ్డికి వివేకాతో సరైన సంబంధాలు లేవని అభియోగపత్రంలో స్పష్టం చేసింది.

2017లో వివేకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారని... భాస్కరరెడ్డికి, అవినాష్‌లకు సన్నిహితుడైన శివంకర్‌రెడ్డే దీనికి కారణమని వివేకా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపింది. 2019 ఎన్నికల్లో షర్మిల, విజయమ్మలకు టికెట్‌ ఇవ్వాలని వివేకా పట్టుబట్టారని.. అవినాష్‌రెడ్డికి జమ్మలమడుగు లేదా కమలాపురం ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని సూచించారని అభియోగపత్రంలో పేర్కొంది. షర్మిలను ఆయన పోటీకి ఒప్పించారని స్పష్టం చేసింది. తన ఎంపీ టికెట్‌కు వివేకా అడ్డుపడుతున్నారని ఆయన్ను అడ్డు తొలగించుకోవాలని అవినాష్‌రెడ్డి.. శివశంకర్‌రెడ్డి సాయంతో పథకం వేశారని స్పష్టం చేసింది.

బెంగళూరు సెటిల్‌మెంట్‌లో వివేకా డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు లభించలేదంది. అయితే బెంగళూరు గెస్ట్‌హౌస్‌లో మద్యం తాగాక సెటిల్‌మెంట్‌ కమీషన్‌లో 50 శాతం ఇవ్వాలంటూ వివేకాతో గంగిరెడ్డి వాగ్వాదానికి దిగాడంది. దీంతో వివేకా గంగిరెడ్డిని తిట్టడమే కాకుండా నన్ను కమీషన్‌ అడిగేంత పెద్దవాడివయ్యావా అని కేకలేసి దస్తగిరితో కలిసి పులివెందులకు వెళ్లిపోయారని పేర్కొంది. భారీగా కమీషన్‌ తీసుకుని ఇవ్వలేదనుకుని గంగిరెడ్డి ఆయనపై కోపం పెంచుకున్నారంది. గజ్జల ఉమాశంకరరెడ్డి, షేక్‌ దస్తగిరిలకు కూడా వివేకాపై ఇతర సందర్భాల్లో కోపం ఉన్నట్లు అభియోగపత్రంలో స్పష్టం చేసింది.

గూగుల్‌ టేక్ అవుట్​ ప్రకారం సునీల్‌యాదవ్‌ మార్చి 15 తెల్లవారుజామున 2 గంటల 42 నిమిషాల సమయంలో వివేకా ఇంటిలో ఉన్నారని.. 2 గంటల 34 నిమిషాలకు వివేకా సమీపంలో ఉన్నారంది. యూటీసీ కాలమానం కన్నా భారత కాలమానం ఐదున్నర గంటలు ముందు ఉంటుందని పేర్కొంది. అందువల్ల 2021 అక్టోబరు 26న దాఖలు చేసిన ఛార్జ్​షీట్​లో పేర్కొన్న సమయాన్ని సవరించినట్లు తెలిపింది. వివేకా ఇంట్లో సునీల్‌ యాదవ్‌ మొదటిదానిలో పేర్కొన్నట్లు మార్చి 15న 2 గంటల 42నిమిషాలకు బదులు ఉదయం 8 గంటల 12 నిమిషాలకు ఉన్నట్లు చదవాలని పేర్కొంది. వైఎస్‌ భాస్కరరెడ్డి, అవినాష్‌ ఇంటిలో మార్చి 15న ఒంటిగంట 58 నిమిషాలకు సునీల్‌యాదవ్‌ ఉన్నట్లు పేర్కొంది.

మార్చి 14, 15 తేదీల్లో అందుబాటులోని నిందితుల ఐపీడీఆర్‌ను పరిశీలిస్తే గంగిరెడ్డి, అవినాష్‌రెడ్డి మధ్య వాట్సప్‌ సందేశాలు జరిగినట్లు తేలిందని.. ఇద్దరి వాట్సప్‌ ఖాతాలు ఒకే సమయంలో యాక్టివ్‌గా ఉన్నాయని అభియోగపత్రంలో తెలిపింది. తెల్లవారుజామున ఒంటిగంట 37 నిమిషాల నుంచి ఉదయం 5 గంటల 18నిమిషాల దాకా వారిద్దరి నంబర్ల నుంచి పలు వాట్సప్‌ సందేశాలు అటు ఇటూ వెళ్లాయంది. అయితే వాట్సప్‌ డేటా మాత్రం లభ్యం కాలేదని.. వాట్సప్‌ సమాచారం రికవరీ కోసం గంగిరెడ్డి ఫోన్‌ను తిరువనంతపురం సీడాక్‌ సెంటర్‌కు పంపినా ఫలితం లేకపోయిందని తెలిపింది. 2019 ఆగస్టులో గంగిరెడ్డి వాట్సప్‌ను రీఇన్‌స్టాల్‌ చేయడంతో పాత డేటా తుడిచిపెట్టుకుపోయిందని ...ఉద్దేశపూర్వకంగా వాట్సప్‌ డేటాను తొలగించారని స్పష్టం చేసింది. తనవద్ద ఆ ఫోన్లు లేవని, వాటిని ఇవ్వలేనని అవినాష్‌రెడ్డి చెప్పడంతో వాట్సప్‌ డేటా రికవరీ కాలేదని సీబీఐ వెల్లడించింది.

మార్చి 15న జమ్మలమడుగులో ఏర్పాటైన రాజకీయ కార్యక్రమానికి వెళుతూ.. వివేకా చనిపోయారని ఫోన్‌ సమాచారంతో వెనక్కి తిరిగి వచ్చానని అవినాష్‌ రెడ్డి చెప్పడం నిజం కాదని సీబీఐ పేర్కొంది. రాజకీయ కార్యక్రమం ఉందని కొందరిని ఇంటికి పిలిచినా అక్కడ అలాంటిదేమీ లేదని దర్యాప్తులో తేలిందంది. వైసీపీకు చెందిన రామచంద్రారెడ్డి వాంగ్మూలం ప్రకారం.. జమ్మలమడుగుకు వ్యతిరేకదిశలో ఉన్న కదిరిలో 4వేల మందికి భోజన ఏర్పాట్లు ఉన్నాయని.. ఈ కార్యక్రమానికి వివేకా, భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి, కొండారెడ్డిలకు ఆహ్వానం అందినట్లు తేలిందంది.

వివేకా తన రెండో భార్య షమీమ్‌ నంబరును ఫోన్‌లో సాంబశివారెడ్డి అనే పేరుతో సేవ్‌ చేసుకున్నారని.. ఈ నంబరు నుంచి మార్చి 15న తెల్లవారుజామున ఒంటిగంట 31 నిమిషాలకు మెసేజ్‌ వచ్చేసరికి హత్య జరగలేదంది. 4 గంటల 32నిమిషాలకు మిస్డ్‌ కాల్‌ ఉన్నట్లు తెలిపింది. మార్చి 8 నుంచి 15 వరకు షమీమ్‌ నుంచి ఫోన్‌ మెసేజ్‌లు వచ్చాయంది. వివేకా రెండో వివాహంపై ఆయన కుమార్తె సునీతారెడ్డి, ఆమె మరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి అసంతృప్తిగానే ఉన్నారంది. షమీమ్‌తో వివేకాకు సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయని.. తన కుమారుడి గురించి పట్టించుకోలేదన్న కోపంతో కొన్ని సందర్భాల్లో తప్ప ఎలాంటి విభేదాల్లేవంది.

షమీమ్‌ నగల కొనుగోలుకు, ఇతరత్రా అవసరాలకు వివేకా డబ్బులిచ్చేవారని పేర్కొంది. వివేకా ఆస్తులన్నీ కంపెనీల పేరుతో ఉండటంతో డైరెక్టర్లుగా ఉన్న కుటుంబసభ్యుల ఆమోదం లేకుండా వాటి బదలాయింపు సాధ్యం కాదంది. అందువల్ల ఆస్తులను షమీమ్‌ మైనరు కుమారుడికి బదలాయిస్తారన్న ఆరోపణలపై ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. వివేకా ఆర్థిక అవసరాలను ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చూసుకునేవారని రెండవ అనుబంధ అభియోగపత్రంలో సీబీఐ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.