ETV Bharat / bharat

Secret Witness in Viveka case: వివేకా హత్య కేసులో ఎవరా "రహస్య సాక్షి"..!

author img

By

Published : May 28, 2023, 7:19 AM IST

Secret Witness in Viveka Murder case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రహస్య సాక్షిని సీబీఐ తెరపైకి తెచ్చింది. ఈ రహస్య సాక్షి ఎవరో గత సంఘటనల దృష్ట్యా ఇప్పుడే బయటపెట్టలేమని.. వచ్చే ఛార్జ్‌షీట్‌లో వెల్లడిస్తామని CBI స్పష్టం చేసింది. హత్య జరిగిన రోజూ వాట్సప్‌లో అవినాష్‌ యాక్టివ్‌గా ఉన్నారని తెలిపింది. అయితే ఫోన్‌ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.

Secret Witness in Viveka case
Secret Witness in Viveka case

వివేకా హత్య కేసులో ఎవరా "రహస్య సాక్షి"..!

Secret Witness in Viveka Murder case: మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి.. రాజకీయ కుట్ర కోణంలో రహస్య సాక్షిని కేంద్ర దర్యాప్తు సంస్థ తెరపైకి తీసుకువచ్చింది. అవినాష్‌ రెడ్డికి కడప ఎంపీ సీటు ఇవ్వడం వివేకానందరెడ్డికి ఇష్టం లేదని, కావాలంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారని రహస్య సాక్షి వాంగ్మూలం ఇచ్చారంది. ఏప్రిల్‌ 26న నమోదు చేసిన ఈ వాంగ్మూలాన్ని వచ్చే ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేస్తామని, సాక్షిగానూ పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.

ఇప్పుడు ఆ సాక్షి పేరును బయటపెట్టలేము: ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సాక్షి పేరును, వాంగ్మూలాన్ని బయటపెట్టలేమని స్పష్టం చేసింది. బయటపెడితే ఏమవుతుందో గతంలో జరిగిన సంఘటనలు చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించింది. వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి ఆత్మహత్య, తొలుత వాంగ్మూలం ఇచ్చిన సీఐ శంకరయ్య తర్వాత నిరాకరించడం వంటి పలు సంఘటనలు రుజువు చేశాయని గుర్తు చేసింది. కావాలంటే వాంగ్మూలాన్ని కోర్టుకు సీల్డ్‌ కవర్‌లో సమర్పిస్తామని, దాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చంది.

పిటిషనర్‌కు ఇవ్వకుండా, వారి వాదన వినకుండా CBI సమర్పించిన వాంగ్మూలం పరిశీలించి దాని ఆధారంగా ఉత్తర్వులు జారీ చేయడం సహజ న్యాయసూత్రాలకు, సాధారణ న్యాయ ప్రక్రియకు విరుద్ధమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలా పిటిషనర్‌కు వివరాలు ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేయొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పులు ఏమైనా ఉంటే సమర్పించాలని సీబీఐని ఆదేశించారు.

ఆయనకున్న ప్రత్యేక హోదా ఏంటి: సీబీఐ తరఫున న్యాయవాదులు అనిల్‌కుమార్‌, అనిల్‌ తన్వర్‌ వాదనలు వినిపిస్తూ ప్రతి దశలోనూ దర్యాప్తునకు అడ్డంకులు ఎదురయ్యాయన్నారు. పిటిషనర్‌కు నోటీసిస్తే మూడు నాలుగు రోజులు గడువు కోరి, ఆలోపు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తున్నారన్నారు. ఇలా అయితే దర్యాప్తును ఎలా కొనసాగించగలమన్నారు. ఈ కేసులో నిందితులు విచారణకు సహకరించారని, పిటిషనర్‌ సహకరించకపోవడానికి ఆయనకున్న ప్రత్యేక హోదా ఏంటని న్యాయవాదులు వాదించారు.

వివేకా హత్యకు రాజకీయ శత్రుత్వమే కారణం: ఎంపీ అయితే ఏంటని, రాజకీయ హోదాను చట్టం అనుమతించదని అన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఆయనకు మీరే అంత ప్రాధాన్యమిచ్చారన్నారు. అదే సామాన్యుల కేసు అయితే ఇంత జాప్యం చేసేవారా అంటూ సీబీఐ న్యాయవాదులను ప్రశ్నించారు. హత్య కేసులో అవినాష్‌ పాత్ర గురించి మొదటి అభియోగపత్రం దాఖలు చేసిన తర్వాత తెలిసిందా, అంతకు ముందే తెలుసా అని ప్రశ్నించారు. CBI న్యాయవాది సమాధానమిస్తూ వివేకా హత్య కుట్రలో అవినాష్‌ భాగమయ్యారన్నారు. ఘటనా స్థలంలో సాక్ష్యాల ధ్వంసానికి పాల్పడ్డారన్నారు.

వివేకా హత్యకు రాజకీయ శత్రుత్వమే కారణమని సీబీఐ న్యాయవాదులు తెలిపారు. ఎమ్మెల్సీ టికెట్‌ను అవినాష్‌ తన అనుచరుడైన శివశంకరరెడ్డికి ఇప్పించాలని ప్రయత్నించారని, కడప ఎంపీ టిక్కెట్‌ అవినాష్‌కి దక్కకుండా విజయమ్మ, షర్మిలకు ఇవ్వాలన్న వివేకా వాదన నచ్చక కుట్రకు తెర తీశారన్నారు. హత్యకు నెల రోజుల ముందే కుట్ర ప్రారంభమైందన్నారు. శివశంకరరెడ్డి ద్వారా వివేకా హత్యకు పథక రచన చేసినట్లుందన్నారు. శివశంకరరెడ్డికి సన్నిహితుడైన గంగిరెడ్డిని కుట్రలో భాగస్వామిని చేసి హత్య చేయించారని పేర్కొన్నారు.

వివేకా హత్య కుట్రకు డబ్బు సమకూర్చింది అవినాషేనని CBI న్యాయవాది తెలిపారు. గంగిరెడ్డి కేంద్రంగా 40 కోట్లకు కుట్ర ఒప్పందం కుదిరిందన్నారు. వివేకా హత్యను అవినాష్‌ గుండెపోటుగా చెప్పారన్నారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలు తుడిచి, వివేకా శరీరంపై ఉన్న గాయాలకు కట్టు కట్టారన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ రక్తపు మరకలు తుడిచినంత మాత్రాన హత్యను గుర్తించలేరా అని ప్రశ్నించారు.

ఆ సమయంలో వాట్సప్​లో అవినాష్​ చురుగ్గా ఉన్నారు: ప్రజలకు ఇష్టమైన నేత చనిపోయినప్పుడు భావోద్వేగాలను నియంత్రించడానికి అలా చేసి ఉండవచ్చేమో అన్నారు. పీపీ జోక్యం చేసుకుంటూ భాస్కరరెడ్డి తదితరులు దగ్గర ఉండి రక్తపు మరకలను తుడిచివేయించారని, ఇది కుట్రలో భాగమేనని చెప్పారు. హత్యకు ముందు శివశంకరరెడ్డితో అవినాష్‌ చాటింగ్‌ చేశారన్నారు. అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి తెల్లవారుజామున 5గంటల 20 నిమిషాల మధ్య అవినాష్‌ వాట్సప్‌లో చురుగ్గా ఉన్నట్లు తేలిందని చెప్పారు. అయితే ఎవరితో మాట్లారన్నది గుర్తించడానికి సాధ్యం కాదన్నారు. తెలుసుకోవాలంటే అవినాష్‌రెడ్డిని కస్టోడియల్‌ విచారణకు ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అవినాష్‌రెడ్డి ఫోన్‌ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ప్రధాన నిందితుడైన గంగిరెడ్డి ఫోన్‌ కూడా యాక్టివ్‌గా ఉందా అని ప్రశ్నించారు. ఈ నెల 12న అవినాష్‌రెడ్డికి చెందిన ఫోన్‌ వివరాలు సేకరించామని, గంగిరెడ్డి ఫోన్‌ వివరాలు సేకరించలేదని పీపీ చెప్పారు.

అవినాష్​ ఫోన్​ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు.. ఈ విషయంలో సీబీఐని అనుమానించాల్సి వస్తోంది: కుట్రలో అవినాష్‌రెడ్డి పాత్ర ఉందని చాలా కాలంగా అనుమానిస్తున్నప్పుడు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి కదా అని న్యాయమూర్తి అన్నారు. అయినా ఇంతకాలం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని, ఈ విషయంలో సీబీఐని కూడా అనుమానించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. పీపీ సమాధానమిస్తూ అవినాష్‌రెడ్డికి మూడు ఫోన్లు ఉన్నాయని చెప్పారు.

గూగుల్‌ టేకౌట్‌ ద్వారా వివరాలు సేకరించామని, సంఘటన జరిగిన తరువాత నిందితుడు సునీల్‌ యాదవ్‌ పిటిషనర్‌ ఇంట్లో ఉన్నట్లు తేలిందన్నారు. హత్య జరిగిన రోజు నిందితులంతా కలిసే ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా తేలిందన్నారు. సంఘటన గురించి ఎం.వి.కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే అవినాష్‌రెడ్డికి తెలుసని పీపీ తెలిపారు. 2019 మార్చి 15న శివశంకరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, తదితరులు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారన్నారు. అంటే నిందితులు వెళ్లి సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

తీర్పు 31కి వాయిదా: వివేకా హత్య గురించి తన కుమారుడికి తెల్లవారుజామున 4 గంటలకే తెలుసని F తల్లి పొరుగింటి మహిళకు చెప్పారన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎవరో చెప్పారంటూ ఇచ్చిన వాంగ్మూలం ఎలా చెల్లుబాటవుతుందని.. ఉదయ్‌కుమార్‌రెడ్డి తల్లి వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. విచారణలో భాగంగా తీసుకున్నట్లు సీబీఐ పీపీ తెలిపారు. దర్యాప్తును చట్టప్రకారం కొనసాగించకుండా రాజకీయ కోణంలో సీబీఐ కొనసాగిస్తోందని అవినాష్‌ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును 31కి వాయిదా వేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.