ETV Bharat / bharat

cbi investigation: 'హత్యకు నెలకు ముందే కుట్ర'.. 'మొదటి మూడు గంటల్లో ఏం జరిగింది' సీబీఐ ప్రశ్నల పరంపర

author img

By

Published : Apr 19, 2023, 8:29 PM IST

cbi investigation : వైఎస్ వివేకా హత్యకు సంబంధించి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని కస్టడీకి తీసుకున్న సీబీఐ ఇవాళ ఇద్దరినీ విచారించింది. చంచల్ గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించింది. ఇద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించి సమాధానాలు రాబట్టింది. మరోవైపు అవినాష్​ రెడ్డి తన న్యాయవాదితో కలిసి సీబీఐ కార్యాలయానికి వెళ్లగా.. పలు ప్రశ్నలు ఆయన ముందుంచిన సీబీఐ అధికారులు.. సమాధానం కోరారు. కోర్టు ఆదేశాల మేరకు ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు.

Etv Bharat
Etv Bharat

cbi investigation : వైఎస్ వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి తొలి రోజు సీబీఐ కస్టడీ ముగిసింది. ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు దాదాపు ఐదున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం 10.40 నిమిషాల సమయంలో ఇద్దరు నిందితులను చంచల్ గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. 11గంటల సమయంలో విచారణ ప్రారంభించారు. ఉదయ్ కుమార్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని వేర్వేరుగా ఉంచి న్యాయవాదికి కనిపించే విధంగా ప్రశ్నించారు.

ప్రశ్నల పరంపర.. వైఎస్ వివేకా హత్య కేసులో ఆధారాలు చేరివేయడంతో పాటు... రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా తలకు బ్యాండేజ్ చుట్టిన విషయాన్ని ఉదయ్ కుమార్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. దీనికి అతను చెప్పిన సమాధానాలను సీబీఐ అధికారులు రికార్డు చేసుకున్నారు. హత్య జరిగిన రోజు ఎక్కడ ఉన్నావనే విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. 2019 మార్చి 15వ తేదీన తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంట్లో ఎందుకు ఉన్నారనే విషయాలను ఉదయ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

భాస్కర్ రెడ్డిని.. వైఎస్ వివేకా హత్యకు నెల ముందే కుట్ర జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన సీబీఐ అధికారులు... దానికి సంబంధించిన వివరాలను వైఎస్ భాస్కర్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. సాయంత్రం 4.30గంటల సమయంలో ఇద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. రేపు ఉదయం 9 గంటలకు రెండో రోజు కస్టడీలో భాగంగా తిరిగి సీబీఐ కార్యాలయానికి తీసుకురానున్నారు.

8 గంటల పాటు అవినాష్​ను ప్రశ్నించిన సీబీఐ... వైఎస్ అవినాష్ రెడ్డి ఉదయం 10.15 నిమిషాల సమయంలో సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. 10.30 గంటల సమయంలో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు సాయంత్రం 6.30 గంటల వరకు ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకొని వాటిని అవినాష్ రెడ్డికి ఇచ్చి వాటికి సమాధానం చెప్పాలని సీబీఐ అధికారులు సూచించారు. ఈ మేరకు అవినాష్ రెడ్డి చెప్పే సమాధానాలను సీబీఐ అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. దాదాపు 8 గంటల పాటు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు వివేకా హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. హత్య జరిగిన తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లిన మొదటి మూడు గంటల్లో ఏం జరిగిందని అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు.

వైఎస్ వివేకా చనిపోయినట్లు సమాచారం తెలియగానే సమీప బంధువు కాబట్టి సంఘటనా స్థలానికి వెళ్లినట్లు అవినాష్ సీబీఐ అధికారులకు సమాధానమిచ్చినట్లు తెలిసింది. అక్కడున్న వాళ్లు గుండెపోటుతో చనిపోయారని చెప్పడంతోనే తాను కూడా అదే సమాచారాన్ని సీఐతో పాటు ఇతరులకు చెప్పినట్లు అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు చెప్పినట్లు సమాచారం. రేపు ఉదయం 10.30 నిమిషాలకు అవినాష్ రెడ్డిని మరోసారి విచారణకు రావాలని సీబీఐ అధికారులు సూచించారు. ఈ నెల 25వ తేదీ వరకు రోజు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.