ETV Bharat / state

ఎంపీ అవినాష్​రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం.. ఆ సమయంలో సునీల్​ యాదవ్​ మీ ఇంట్లో ఎందుకు ఉన్నాడు..?

author img

By

Published : Feb 25, 2023, 7:07 AM IST

CBI INVESTIGATED MP AVINASH REDDY
CBI INVESTIGATED MP AVINASH REDDY

CBI INVESTIGATED MP AVINASH REDDY : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని.. రెండోసారి ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. తాజా అఫిడవిట్‌లోని అంశాలపై విచారించారు. హత్య జరిగిన రోజు సునీల్‌ యాదవ్‌ మీ ఇంట్లో ఎందుకున్నారని, యాదృచ్ఛికంగానే జరిగిందా అని ప్రశ్నించినట్లు సమాచారం. మరో నిందితుడు.. గంగిరెడ్డితో సంబంధాలు సహా.., ఆయనతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అని ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.

CBI INVESTIGATED MP AVINASH REDDY: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన.. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిని సీబీఐ.. శుక్రవారం మరోసారి ప్రశ్నించింది. ఇప్పటి వరకూ.. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా రూపొందించిన ప్రశ్నలను ఆయనపై సంధించింది. కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల బృందం.. ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది.

ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు., ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో.. అరెస్టయిన సునీల్‌ యాదవ్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై దాఖలు చేసిన కౌంటర్‌లో.. ఇప్పటికే అనేక సంచలన విషయాలు పేర్కొన్న CBI, ఇందులో అవినాష్‌రెడ్డి గురించి.. అనేక సార్లు ప్రస్తావించింది. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి పాత్రను ఆది నుంచీ అనుమానిస్తున్న సీబీఐ.. గత నెల 28న మొదటిసారి విచారించింది.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 160 కింద.. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసి.. హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి పిలిపించి అవినాష్‌ వాంగ్మూలం నమోదు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నప్పటికీ, అవినాష్‌రెడ్డి.. 12గంటల 45 నిమిషాలకే వచ్చారు. వివేకా హత్య జరిగిన రోజు నిందితుడు సునీల్‌ యాదవ్‌.. ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడని.. కదిరి నుంచి దస్తగిరి గొడ్డలి కొనుక్కొని వచ్చాడని.., దాంతోనే వివేకాను హత్య చేశారని అభియోగాలు మోపిన సీబీఐ, దీనికి సంబంధించి అవినాష్‌రెడ్డిని పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే.. తాము దర్యాప్తు చేపట్టే నాటికే చాలా వరకూ ఆధారాలు నాశనమయ్యాయని.. సీబీఐ భావిస్తోంది.

కేసు దర్యాప్తు సంక్లిష్టంగా మారుతున్న క్రమంలో.. సాంకేతిక ఆధారాలపై సీబీఐ దృష్టి సారించింది. నిందితులు, అనుమానితులు.. హత్య జరిగిన నాడు ఎక్కడెక్కడ తిరిగారో వారి ఫోన్లలోని జీపీఎస్‌ లొకేషన్ల ఆధారంగా వివరాలు సేకరించింది. హత్య జరిగిన సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడున్నారనే విషయాలపై.. ఓ నివేదిక రూపొందించుకున్న సీబీఐ.. దాని ఆధారంగా కూడా అవినాష్‌ను కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే సీబీఐ విచారణాధికారి అడిగిన ప్రశ్నలకు.. తెలిసిన సమాధానాలు చెప్పానని.. విచారణ తర్వాత అవినాష్‌రెడ్డి వివరించారు.

వాస్తవాల ఆధారంగా చేసుకుని విచారణ కంటే.. వ్యక్తి లక్ష్యంగా చేసుకునే విచారణ జరుగుతోందని వ్యాఖ్యానించారు. విచారణాధికారికి వినతిపత్రం ఇచ్చానన్న ఆయన.. వాటిపై కూడా కూలంకషంగా విచారణ చేయాలని అడిగినట్లు తెలిపారు. గతంలో.. తెలుగుదేశం చేసిన విమర్శలపైనే.. సీబీఐ విచారణ జరుపుతోందని ఆరోపించారు. ఘటనా స్థలంలో దొరికిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు.

అవినాష్‌రెడ్డి విచారణ సందర్భంగా కడప నుంచి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున.. సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో కేంద్రీయ సదన్‌ గేటు మూసివేశారు. ఆఫీసు సిబ్బందిని తప్ప ఇతరులు లోనికి వెళ్లకుండా.. భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది వచ్చి.. సీబీఐ కార్యాలయం సమీపంలో ఉన్న అందరినీ బయటకు పంపారు. అవినాష్‌రెడ్డి విచారణ నేపథ్యంలో.. ఏపీ నిఘా విభాగానికి చెందిన పలువురు పోలీసులు కూడా.. సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ఎంపీ రాక ముందు నుంచే పరిసరాల్లో సంచరించిన వీరంతా.. విచారణ పూర్తైన తర్వాత తిరిగి వెళ్లారు. మఫ్టీలో ఉన్న పోలీసులు కడప నుంచి వచ్చిన కార్యకర్తలతోనూ మాట్లాడారు.

ఎంపీ అవినాష్​రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం.. ఆ సమయంలో సునీల్​ యాదవ్​ మీ ఇంట్లో ఎందుకు ఉన్నాడు..?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.