ETV Bharat / bharat

CBI Charge Sheet: వివేకా హత్యకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కుట్ర : సీబీఐ

author img

By

Published : Jul 21, 2023, 10:55 AM IST

Updated : Jul 21, 2023, 11:25 AM IST

CBI Charge Sheet
CBI Charge Sheet

10:52 July 21

వివేకా హత్య కేసు ఛార్జిషీట్‌లో పలు అంశాలు ప్రస్తావించిన సీబీఐ

CBI Charge Sheet on Viveka Case: మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్యకు కడప ఎంపీ వైఎస్​ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి కుట్ర చేశారని.. జూన్‌ 30న వేసిన ఛార్జిషీట్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) సీబీఐ స్పష్టం చేసింది. హత్య కుట్ర, హత్య జరిగిన తర్వాత సాక్ష్యాల చెరిపివేత సహా పలు వివరాలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. ఫొటోలు, గూగుల్ టేకౌట్‌, ఫోన్ల లొకేషన్ డేటా వివరాలను ఛార్జిషీట్‌లో పొందుపరిచింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందన్న సీబీఐ.. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టయిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపింది. అందుకోసం అమెరికా అధికారులను సంప్రదించామంది. పలు మొబైల్ ఫోన్లకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలు త్రివేండ్రం సీడాక్ నుంచి అందాల్సి ఉందన్న సీబీఐ.. హత్య సమయంలో వివేకా రాసిన లేఖపై "నిన్ హైడ్రిన్" పరీక్ష నివేదిక రావాల్సి ఉందని కోర్టుకు నివేదించింది. హత్య కేసులో వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలున్నా... తగిన ఆధారాలు లభించలేదని సీబీఐ పేర్కొంది. సాక్ష్యాల చెరిపివేసేటప్పుడు Y.S.మనోహర్‌రెడ్డి అక్కడే ఉన్నా.. ఆయన ప్రమేయం నిర్ధరణ కాలేదని తెలిపింది.

వివేకా హత్య కేసులో అవినాష్​ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందుస్తు బెయిల్​ ఇవ్వడాన్ని సవాల్​ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్​పై జులై 18న విచారించిన సుప్రీం ధర్మాసనం.. జూన్​30వ తేదీన సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్​షీట్​, డైరీని సీల్డ్​కవర్​లో సమర్పించాలని ఆదేశించింది. అలాగే అవినాష్‌ ముందుస్తు బెయిల్‌ వ్యవహారంపై రెండు వారాల్లోపు రిప్లై దాఖలు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దీనిపై సెప్టెంబర్​లో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఫైనల్​ ఛార్జ్​షీట్​ను సీబీఐ సిద్ధం చేసింది.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు చేసిన కుట్రలో నిందితుల పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ దాఖలుచేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. హత్యకు డబ్బు సమకూర్చిందెవరో తేలాల్సి ఉందన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ కేసులో సీబీఐ కోర్టుకు అనుబంధ అభియోగపత్రం సమర్పించింది. ఇందులో A-6గా ఉదయ్‌కుమార్‌రెడ్డి, A-7గా వై.ఎస్‌.భాస్కరరెడ్డి, A-8గా వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిలను పేర్కొంది. వివేకా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎం.వి.కృష్ణారెడ్డి, వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాష్‌లను ఇదే కేసులో అనుమానితులుగా పేర్కొంది.

ఈ కారణంతోనే హత్య: కడప జిల్లా రాజకీయాల్లో వివేకా చురుకైన పాత్ర పోషిస్తుండటంతో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి రాజకీయ విభేదాలతో కక్ష పెంచుకుని ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నడం ప్రారంభించారని సీబీఐ తెలిపింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల డివిజన్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో గెలవడం వైసీపీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొంది. గెలుస్తానన్న ధీమాతో వివేకా తన డివిజన్‌ను వదిలి ఇతర డివిజన్లపై దృష్టి సారించారని.. పులివెందుల వ్యవహారాలను అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి పర్యవేక్షిస్తూ వివేకా ఓటమికి కారకులయ్యారని తెలిపింది. వెన్నుపోటు గురించి తెలుసుకున్న వివేకా ఆగ్రహం వ్యక్తం చేసి, గంగిరెడ్డిని పలుమార్లు తిట్టారని పేర్కొంది. ఎంపీ టికెట్‌ దక్కకుండా వివేకా ప్రయత్నించారని అవినాష్‌ కక్ష పెంచుకున్నారని.. దీంతో నేరచరిత్ర ఉన్న శివశంకర్‌రెడ్డి ద్వారా హత్యకు కుట్రపన్నినట్లు ప్రాసంగిక సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయని జూన్​ 30న దాఖలు చేసిన అభియోగపత్రంలో సీబీఐ తెలిపింది.

Last Updated : Jul 21, 2023, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.