ETV Bharat / bharat

CBI Counter Petition: వివేకా హత్య కేసులో ఏ8గా అవినాష్.. సీబీఐ కౌంటర్​లో పలు కీలక విషయాలు

author img

By

Published : Jun 8, 2023, 4:07 PM IST

Updated : Jun 9, 2023, 7:40 AM IST

CBI Counter Petition
భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్‌

16:04 June 08

భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్‌లో పలు అంశాలు ప్రస్తావించిన సీబీఐ

వివేకా హత్య కేసులో ఏ8గా అవినాష్.. సీబీఐ కౌంటర్​లో పలు కీలక విషయాలు

CBI Counter Petition: వైఎస్​ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి సూచనలతోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కుట్రను నిందితులు అమలు చేశారని సీబీఐ పేర్కొంది. హత్యకేసులో అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ.. తండ్రీకుమారులు దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. వివేకా హత్య జరిగినట్లు ఆ రోజు ఉదయం ఆరున్నర గంటలకు ముందే జగన్‌కు తెలుసని.. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటరులో పునరుద్ఘాటించింది. వీటితోపాటు పలు కీలక విషయాలను కౌంటర్‌లో పొందుపరిచింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ 8వ నిందితుడిగా చేర్చింది. ఇప్పటికే అరెస్ట్‌ చేసిన భాస్కరరెడ్డిని 7వ నిందితుడిగా పేర్కొంది. భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్‌పై సీబీఐ దాఖలు చేసిన కౌంటరులో ఈ మేరకు వెల్లడించింది. మౌఖిక, పత్ర సహిత, శాస్త్రీయ, వైద్యపరమైన ఆధారాల ప్రకారం.. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి హత్య పథకాన్ని అమలు చేసినట్లు వెల్లడించింది. సాక్ష్యాలను ధ్వంసం చేసి, గుండెపోటుతో వివేకా మృతి చెందారని నమ్మించడంలో ప్రతిపాదిత నిందితులు భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి, నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి కలిసి కుట్రను ముందుకు తీసుకెళ్లారని కోర్టుకు నివేదించింది.

వివేకా హత్య వెనుక భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు అవినాష్‌రెడ్డి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. వివేకా మరణ వార్తను ఆయన వ్యక్తిగత సహాయకుడు ఎంవీ కృష్ణారెడ్డి ఉదయం 6గంటల 15 నిమిషాలకు వెల్లడించకముందే.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలుసని మరోసారి స్పష్టం చేసింది. సహ నిందితులతో కలిసి కుట్రలో, సాక్ష్యాల ధ్వంసంలో భాస్కరరెడ్డి పాల్గొన్నారని వెల్లడించింది. ఆయన కడప జిల్లాలో, ప్రత్యేకించి పులివెందులలో సాక్షులను ప్రభావితం చేయగలరని పేర్కొంది. ఇతర నిందితులతో కలిసి దర్యాప్తును పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేయడం, సాక్షులను బెదిరించారనడానికి ఎన్నో ఉదంతాలున్నాయని వివరించింది.

భాస్కర రెడ్డికి బెయిల్ వద్దన్న సీబీఐ:​ అరెస్ట్‌ సమయంలో కడప ప్రాంతంలో జరిగిన నిరసన ప్రదర్శనలే.. ఆయనకు ఉన్న పలుకుబడి గురించి చెబుతున్నాయని తెలిపింది. ఆయన ఉనికి సాక్షులపై ప్రభావం చూపగలదని, ఈ దశలో బెయిలు ఇస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని సీబీఐ ఆందోళన వ్యక్తంచేసింది. ఇవే ఆరోపణలున్న శివశంకర్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిలును సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపింది. షరతులతో బెయిలు మంజూరు చేసినా ఫలితం లేదని.. సాక్షులను ప్రభావితం చేసినా, ఆధారాలను తారుమారు చేసినా దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొంది. విచారణలో భాస్కరరెడ్డి సహకరించలేదని, ఏప్రిల్‌ 16 నుంచి జైల్లో ఉన్నంత మాత్రాన ఆయనకు బెయిలు మంజూరు చేయాలనడం సరికాదని కోర్టుకు తెలిపింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది.

సాక్ష్యాలను ధ్వంసం చేయాలని ఎదురుచూశారు : వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి తదితరులు కుట్రలో పాల్గొనడంతోపాటు.. ఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేశారని దర్యాప్తులో తేలినట్లు సీబీఐ తెలిపింది. దర్యాప్తును పక్కదోవ పట్టించడమే లక్ష్యంగా.. సాక్షులను ప్రభావితం చేయడానికి నిందితులు లేదా వారి అనుచరులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని తేలినట్లు పేర్కొంది. వివేకా మరణవార్త బయటికి రాకముందే భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద ఉదయ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నారని.. మూడో వ్యక్తి నుంచి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సాక్ష్యాలను ధ్వంసం చేయాలని వారు ఎదురుచూసినట్లు వివరించింది.

సమాచారం అందిన నిమిషాల్లోనే వివేకా ఇంటికి అవినాష్​ : అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డితో మాట్లాడానని, సాక్ష్యాల ధ్వంసం గురించి వారు చూసుకుంటారని వేకువజామున ఐదున్నర గంటల ప్రాంతంలో సహనిందితులకు గంగిరెడ్డి వెల్లడించినట్లు తెలిపింది. ఉదయం 6 గంటల 26 నిమిషాలకు ఫోన్‌ ద్వారా ఎన్​.శివప్రకాశ్‌రెడ్డి సమాచారం ఇవ్వడంతో.. శివశంకర్‌ రెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డి, ఇతర అనుచరులతో కలిసి రెండు, మూడు వాహనాల్లో వివేకా ఇంటికి అవినాష్‌ రెడ్డి వెళ్లారని స్పష్టంచేసింది. కేవలం నిమిషం సమయంలోనే వివేకా ఇంటికి అవినాష్‌రెడ్డి చేరుకున్నట్లు దస్తగిరి వాంగ్మూలంలో వెల్లడైనట్లు చెప్పింది. ఇక గూగుల్‌ టేకౌట్‌ డేటా ప్రకారం ఉదయం 6 గంటలకే అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. ఆ తర్వాత 6 గంటల 25 నిమిషాలకు కూడా అవినాష్‌ ఇంట్లోనే ఉన్న ఉదయ్‌కుమార్‌రెడ్డి.. 6 గంటల 27 నిమిషాలకు వివేకా ఇంటి బయట, 6 గంటల 29 నిమిషాల నుంచి 6 గంటల 31 నిమిషాల మధ్య ఇంటి లోపల ఉన్నట్లు తేలిందని కౌంటర్‌లో నివేదించింది.

ఇతరులతో చర్చించిన తరువాత సీఐ శంకరయ్యకు ఫోన్‌ ద్వారా వివేకా మరణ వార్తను అవినాష్‌ రెడ్డి చెప్పారని.. బందోబస్తుకు పోలీసులను పంపాలని కోరారని స్పష్టం చేసింది. కేసు నమోదు చేయవద్దని, పోస్టుమార్టం కూడా అవసరం లేదని సీఐకి తొలుత చెప్పారని.. ఘటనా స్థలానికి పలువురు చేరుకున్నా లోపల గడియ వేసి కొంత మందిని మాత్రమే భాస్కర రెడ్డి అనుమతించారని వివరించింది. కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డిని ఈశ్వరయ్య గార్డెన్‌లో తనతో పాటు సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి కలిసినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చిన విషయం ప్రస్తావించింది.

కేసు సీబీఐకి అప్పగించడంతో తమ పరిస్థితి ఏంటని అడిగితే.. ఏ సమస్యా ఉండదని, అన్నీ తామే చూసుకుంటామని, ఏమైనా డబ్బు అవసరమైతే అడగాలని వారు చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలమిచ్చారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరిని సీబీఐకి, కోర్టుకు వాస్తవాలు చెప్పకుండా ప్రభావితం చేయడానికి భరత్‌యాదవ్, న్యాయవాది ఓబుల్‌రెడ్డి ద్వారా భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి ప్రయత్నించారంది. రక్తపు మడుగులో వివేకా ఉన్న విషయాన్ని దాచిపెట్టి ఫిర్యాదు ఎలా ఇవ్వాలో ఎంవీ కృష్ణారెడ్డికి చెప్పిన శివశంకర్‌రెడ్డి.. ఆ తర్వాత పోలీసుస్టేషన్‌ నుంచి వెళ్లిపోయారని కోర్టు నివేదించింది.

భాస్కర రెడ్డిపై గతంలో నమోదైన పలు కేసులు: కడప ఎస్పీ సమాచారం మేరకు భాస్కర రెడ్డిపై గతంలో పేలుడు పదార్థాల చట్టం సహా మూడు వేర్వేరు పోలీసు కేసులు ఉండగా.. రెండింట్లో ఆయన నిర్దోషిగా బయటపడ్డారని, మరొకటి తప్పుడు కేసుగా తేలినట్లు సీబీఐ పేర్కొంది. అనుమానాస్పద పూర్వాపరాలున్న భాస్కర రెడ్డితో పాటు అవినాష్‌ రెడ్డికి ఇతర నిందితులతో కలిసి వివేకా హత్య కుట్రలో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని పునరుద్ఘాటించింది. ఎంపీ టికెట్‌ను తనకు కాకుండా షర్మిల, విజయమ్మకు ఇవ్వాలని వివేకా కోరడం వల్లే అనుచరుల ద్వారా అవినాష్‌రెడ్డి హత్య చేయించారని అనుమానం ఉన్నట్లు మొదటి అభియోగపత్రంలోనే వెల్లడించిన విషయం గుర్తుచేసింది. ఈ దిశగా ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. శివశంకర్‌ రెడ్డి పాత్ర వెల్లడయ్యాక హత్య, సాక్ష్యాల ధ్వంసం వెనుక కుట్రను రెండో అభియోగపత్రంలో పేర్కొన్నట్లు తెలిపింది.

దగ్గరుండి మృతదేహానికి బ్యాండేజ్​ : కంప్యూటర్‌ నిపుణురాలు దీప్తివశిష్ఠ వాంగ్మూలం ప్రకారం గూగుల్‌ టేకౌట్‌ ద్వారా సేకరించిన సమాచారం మేరకు 2019 మార్చి 15వ తేదీ తెల్లవారుజామున 1.58కి భాస్కర రెడ్డి ఇంట్లో సునీల్‌ యాదవ్‌ ఉన్నట్లు తేలిందని తెలియజేసింది. కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడం, తర్వాత ముందస్తు బెయిలు మంజూరు చేయడంతో దస్తగిరిని అరెస్ట్‌ చేసినా పూచీకత్తులతో విడుదల చేశామని సీబీఐ వెల్లడించింది. ఇంటి హాల్లోకి వచ్చిన శివశంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి.. గుండెపోటుతో వివేకా చనిపోయినట్లు చర్చించడం, ఆయన మృతదేహానికి బ్యాండేజ్‌ కట్టడం దగ్గరుండి చేసినట్లు పనిమనిషి రాగిరి లక్ష్మీదేవి వాంగ్మూలం ద్వారా వెల్లడైందని వివరించింది. తాను గదిలో నుంచి వస్తుండగా సీఐ శంకరయ్యతో కలిసి అవినాష్‌రెడ్డి లోపలికి వెళ్లారని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నారు. వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి సూచనల మేరకు ఘటనా స్థలాన్ని ఇనయతుల్లా వీడియో తీశారని చెప్పింది. అంతమాత్రాన ఘటనా స్థలాన్ని అవినాష్‌రెడ్డి తదితరులు ధ్వంసం చేయలేదనడం కోర్టును తప్పుదోవ పట్టించడమేనని సీబీఐ స్పష్టంచేసింది.

సీబీఐ కోర్టుకు వైఎస్​ సునీత వాంగ్ములం : వైఎస్ భాస్కరరెడ్డికి బెయిలు మంజూరు చేయవద్దని వివేకా కుమార్తె సునీత సీబీఐ కోర్టును కోరారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంకా జరుగుతోందని, ఈ దశలో బెయిలు ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. కుట్రలో భాస్కరరెడ్డి ప్రమేయం ఉందని పలువురు ఇచ్చిన వాంగ్మూలాలను.. రాతపూర్వక వాదనల్లో పేర్కొన్నారు. ఇక వివేకా హత్య కేసులో నిందితులైన భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని గురువారం కోర్టులో హాజరుపరచగా.. వారి రిమాండ్‌ను ఈ నెల 16 వరకు పొడిగించింది. భాస్కరరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది.

Last Updated :Jun 9, 2023, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.