ETV Bharat / bharat

భారత్​ జోడో యాత్ర షురూ.. రాహుల్​ నేతృత్వంలో దేశమంతా..

author img

By

Published : Sep 7, 2022, 6:23 PM IST

Updated : Sep 7, 2022, 9:10 PM IST

Bharat Jodo Yatra
Bharat Jodo Yatra

Bharat Jodo Yatra : 2024 సార్వత్రిక ఎన్నికలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ 'భారత్ జోడో' యాత్ర మొదలైంది. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్ వరకు తలపెట్టిన యాత్రను ప్రారంభించారు. 12 రాష్ట్రాల నుంచి 3,570 కిలోమీటర్ల పొడవున ఈ పాదయాత్ర సాగనుంది. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం సహా దేశంలో భాజపాయేతర శక్తులను కూడగట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది.

Bharat Jodo Yatra : ఎన్నికల్లో వరుస పరాజయాలు, కీలక నేతల రాజీనామాలు, పార్టీ సారథ్యంపై అనిశ్చితి నెలకొన్న వేళ.. కాంగ్రెస్ పార్టీ విస్తృత లక్ష్యాలతో భారత్ జోడో యాత్ర చేపట్టింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు ఈ యాత్ర సాగనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌.. రాహుల్‌ గాంధీకి ఖాదీతో చేసిన త్రివర్ణ పతాకాన్ని అందించారు. ఈ జాతీయ జెండాను చేతబూని రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. రోజుకు సగటున 25 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. 5 నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3,570 కిలోమీటర్లు పొడవునా కొనసాగనుంది.

Bharat Jodo Yatra
రాహుల్​ గాంధీ

దేశాన్ని మత, ప్రాంత, భాషల పేరుతో విభజించాలన్న భాజపా, ఆర్​ఎస్​ఎస్​ కుట్రలు సాగబోవని కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఈ దేశా‌న్ని ఎప్పుడు విభజించలేరని అన్నారు. దేశ రాజ్యాంగ వ్యవస్థలపై క్రమబద్ధమైన దాడి జరుగుతోందన్న రాహుల్‌.. సీఈఐ, ఈడీలను ఉసిగొల్పి ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర సంస్థలు ఎన్ని గంటలు విచారించినా ఒక్క ప్రతిపక్ష నేత కూడా భయపడబోరని రాహుల్‌ తేల్చి చెప్పారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ జెండాను సొంత ఆస్తిలా భావిస్తోందని రాహుల్‌ విమర్శించారు. ప్రజల భాష, సంస్కృతిపై భాజపా, ఆర్​ఎస్​ఎస్​ దాడి చేస్తున్నాయని రాహుల్‌ మండిపడ్డారు.

''ఈ త్రివర్ణ పతాకం ఏ రాష్ట్రానికి చెందినది కాదు. ఇది అన్ని రాష్ట్రాలకు చెందింది. ఈ జెండా ఏ మతానికో, కులానికో.. భాషకో చెందినది కాదు. ఇది అన్ని మతాలు, కులాలు, భాషకు చెందింది. ఈ పతాకం మన గుర్తింపు. దేశంలోని ప్రతి పౌరుడికి రక్షణ కల్పిస్తానని ఈ జెండా హామీనిస్తుంది. స్వేచ్ఛాయుత.. పారదర్శక జీవితాన్ని అందిస్తామని భరోసా ఇస్తుంది. దేశంలో ఏ మతాన్ని పాటించేందుకైనా ఏ భాషను మాట్లాడటానికైనా ఈ త్రివర్ణ పతాకం మనకు అనుమతినిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ జాతీయ జెండాపై దాడి జరుగుతోంది.

దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు త్రివర్ణ పతాకాన్ని కాపాడుతున్నాయి. స్వేచ్ఛాయుత మీడియా ఈ జెండాను రక్షిస్తోంది. న్యాయవ్యవస్థ ఈ పతాకాన్ని కాపాడుతోంది. అలాంటి ప్రతీ రాజ్యాంగ వ్యవస్థపై ప్రస్తుతం భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి చేస్తున్నాయి. వాళ్లు (భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌) ఈ జెండాను వారి సొంత ఆస్తిలా చూస్తున్నారు. సీబీఐ, ఈడీ, ఐటీని ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టగలమని వారు భావిస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే వారు భారతీయులను సరిగ్గా అర్థం చేసుకోలేదు. భారతీయులు ఎప్పుడూ భయపడరు. ఎన్ని గంటలు విచారణ చేసినా వారు భయపడరు. దేశంలోని ఒక్క ప్రతిపక్ష నేత కూడా భాజపాను చూసి భయపడడం లేదు.''

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

కొన్ని బహుళ జాతీ సంస్థలే దేశాన్ని నడిపిస్తున్నాయన్న రాహుల్‌ గాంధీ అప్పటి ఈస్టిండియా కంపెనీకి ఇప్పటి ఈ కంపెనీలకు పెద్ద తేడా లేదని విమర్శించారు.

''ఈ దేశాన్ని విభజించాలని భాజపా చూస్తోంది. మతాలు, భాష ఆధారంగా విభజించాలని చూస్తోంది. కానీ ఈ దేశాన్ని ఎప్పటికీ విభజించలేరు. దేశంలోని బహుళ జాతి సంస్థలు కొన్ని ప్రస్తుతం దేశం మొత్తాన్ని నియంత్రిస్తున్నాయి. వారి మద్ధతు లేకుండా ప్రధాన మంత్రి ఒక్కరోజు కూడా ఉండలేరు. ఇప్పటి ఆ నాలుగు పెద్ద సంస్థలకు బ్రిటీష్‌ పాలనకు చాలా సారూప్యత ఉంది. దేశాన్ని విభజించడం భారతీయులను పరస్పరం దాడులు చేసుకొనేలా చేయడం ప్రజలను దోచుకోవడంలో సారూప్యత ఉంది. బ్రిటీష్‌ పాలనలో దాన్ని ఈస్టిండియా కంపెనీ అని పిలిచాం. ఆ ఒక్క కంపెనీ అప్పుడు భారత్‌ను తన నియంత్రణలో ఉంచుకుంది. ఇప్పుడు మూడు నాలుగు పెద్ద సంస్థలు భారత్‌ను తమ నియంత్రణలో ఉంచుకున్నాయి.''

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

భారత జోడో యాత్రలో ప్రతీ పౌరుడిని కలిసి దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తానని రాహుల్‌ వెల్లడించారు.
అంతకుముందు రాహుల్ గాంధీ.. తమిళనాడు 'శ్రీ పెరుంబుదూర్'లోని రాజీవ్ స్మారకాన్ని సందర్శించారు. మొక్క నాటిన అనంతరం తండ్రి రాజీవ్ గాంధీ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్ తన తండ్రి స్మారకాన్ని తొలిసారి సందర్శించారు. ఈ ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేసిన రాహుల్.. విద్వేష, విభజన రాజకీయాల కారణంగా తన తండ్రిని కోల్పోయినట్లు వాపోయారు. ఇప్పుడు దేశాన్ని కూడా కోల్పోవాలనుకోవడం లేదన్నారు. ప్రేమ, ద్వేషాన్ని జయిస్తుందని, ఆశ భయాన్ని ఓడిస్తుందన్న రాహుల్.. ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్వీట్ చేశారు.

Bharat Jodo Yatra
తండ్రి స్మారకానికి నివాళులు అర్పిస్తున్న రాహుల్​

కన్యాకుమారిలో స్వామి వివేకానంద, తిరువళ్లువర్ విగ్రహాలు, మాజీ సీఎం కామరాజ్ స్మారకాన్ని రాహుల్ సందర్శించి జోడో యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి రాహుల్ నడక ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ యాత్ర దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు, సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుందని కాంగ్రెస్ ట్వీట్ పేర్కొంది.

తమిళనాడులో 4 రోజులు కొనసాగనున్న ఈ యాత్ర.. ఈనెల 11న కేరళకు చేరుతుంది. ఎలాంటి హంగు, ఆర్బాటాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. రాహుల్ విశ్రాంతి తీసుకునేందుకు ప్రాథమిక వసతులతో కంటైనర్లు సిద్దం చేసినట్లు హస్తం శ్రేణులు తెలిపారు. రాహుల్ తో కలిసి వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన 117 మంది కాంగ్రెస్ నేతలు నడక సాగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సుంకర పద్మశ్రీ పాల్గొంటుండగా తెలంగాణ నుంచి కేతూరి వెంకటేష్ , సంతోష్, వెంకటరెడ్డి, కత్తి కార్తీకగౌడ్ , బెల్లయ్యనాయక్ , అనులేఖ బూస ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 32 మంది మహిళలకు అవకాశం కల్పించారు. రాహుల్ వెళ్లని రాష్ట్రాల్లో ఈ యాత్రకు అనుబంధంగా 'అతిథి యాత్రీస్' పేరుతో కార్యక్రమాలు చేపట్టనున్నారు.

  • కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగే ఈ సుదీర్ఘ ‘భారత్‌ జోడో యాత్ర’ 12 రాష్ట్రాల మీదుగా వెళ్తుంది
  • జోడో యాత్రలో భాగంగా ర్యాలీలు, బహిరంగ సభలు ఉంటాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు ప్రియాంకా గాంధీ వాద్రాలు పలు సభల్లో పాల్గొంటారు.
  • యాత్ర మార్గంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసే వసతుల్లోనే రాహుల్‌ గాంధీ బస చేయనున్నారు
  • రాహుల్‌తో పాటు మరో 50 మంది కాంగ్రెస్‌ నేతలు తొలుత పాదయాత్రలో పాల్గొంటారు. మార్గమధ్యలో ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ నేతలు చేరతారు
  • ఈ యాత్రను కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్నప్పటికీ పార్టీ లోగోను మాత్రం ఎక్కడా పొందుపరచలేదు.
  • ఏదో ఒక్క పార్టీకే పరిమితమైన యాత్రగా కాకుండా అన్ని వర్గాలను ఏకం చేసేందుకు ఈ యాత్రను చేపడుతున్నామని.. అందుకే కాంగ్రెస్‌ గుర్తు పెట్టలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి
  • 'ఒక అడుగు నీది, ఒక అడుగు నాది.. యాత్రలో చేరి మనమందరం భారత్‌ను ఏకం చేద్దాం' అనే నినాదంతో ఈ భారత్‌ జోడో యాత్ర కొనసాగనుంది.
.

ఇవీ చదవండి: 'దేశంలో ఎన్నో సవాళ్లు.. రాహుల్​ అధ్యక్షుడైతేనే సాధ్యం'

తండ్రి స్మారకం వద్ద రాహుల్​ ఘన నివాళులు.. నేటి నుంచే జోడో యాత్ర

Last Updated :Sep 7, 2022, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.