ETV Bharat / bharat

GO No 1 Dismissed: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. జీవో నెంబర్​1ను కొట్టేసిన హైకోర్టు

author img

By

Published : May 12, 2023, 10:51 AM IST

Updated : May 13, 2023, 6:26 AM IST

high court on go 1
high court on go 1

10:46 May 12

ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగేలా ఉందన్న హైకోర్టు

High Court Dismissed GO No 1: జీవో 1 విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రహదారులపై అన్ని రకాల సభలు, సమావేశాలను నిషేధించే జీవో 1ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఆ జీవో చెల్లుబాటు కాదని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు 43 పేజీల సంచలన తీర్పు ఇచ్చింది. పోలీసు చట్ట నిబంధనలను నీరుగార్చేలా జీవో ఉందని స్పష్టం చేసింది. ఈ జీవో ద్వారా దిగువస్థాయి అధికారులు సమావేశాలకు అనుమతిచ్చే విషయంలో వారి విచక్షణను వినియోగించే అవకాశం లేకుండా చేశారని తేల్చిచెప్పింది.

అరుదైన, ప్రత్యేక సందర్భాలేంటో వివరించడంలో ప్రభుత్వం విఫలమైంది: జీవో నెంబర్ వన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారులపై ప్రయాణానికి అవరోధం కలిగిస్తే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి సభలు, సమావేశాలకు అనుమతులివ్వకపోవడం సబబని జీవోలో ప్రస్తావించారని... కేవలం అరుదైన, ప్రత్యేక సందర్భాల్లోనే అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని అందులో పేర్కొన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆ అరుదైన, ప్రత్యేక సందర్భాలేంటో వివరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. అనుమతులు నిరాకరించే విషయంలో అధికారులకు ఏకపక్ష అధికారాలు కల్పించారని.... ఈ ఉత్తర్వులతో.. కిందిస్థాయి అధికారులు వారి విచక్షణను వాడే అవకాశం లేకుండా చేసినట్లయిందని స్పష్టంచేసింది.

సొంత నిర్ణయానికి అవకాశం లేకుండా చేస్తోంది: ఈ ఉత్తర్వులు రహదారులు, వీధుల్లో అనుమతులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ ప్రదేశాలను సూచించాలని ఆదేశించినట్లున్నాయని వ్యాఖ్యనించింది. అధికారుల విచక్షణ మేరకు అనుమతులివ్వాలని పోలీసు చట్టంలో నిర్దేశించారని.. జీవో 1 అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉందని తీర్పులో వెల్లడించింది. జీవో 1 ద్వారా చట్ట నిబంధనలను నీరుగార్చి అధికారాలను నియంత్రణలోకి తీసుకోవడమే అవుతుందని పేర్కొంది. సమావేశాలు, ఊరేగింపుల వల్ల రహదారులపై ట్రాఫిక్‌కు అవరోధం కలుగుతుందని స్థానిక అధికారి భావించినప్పుడే పోలీసు చట్టం సెక్షన్‌ 30(2) ప్రకారం ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరాలి. ప్రతి కేసునూ స్థానిక అధికారి సొంత విశ్లేషణ చేసి నిర్ణయం తీసుకోవాలని చట్టం చెబుతోందని.... ప్రజాశాంతికి విఘాతం కలుగుతుందని నిర్ణయానికి వచ్చాకే అనుమతి తీసుకోవాలని కోరవచ్చని తెలిపింది. అధికారులు విచక్షణాధికారాన్ని వినియోగించుకునే అవకాశం లేకుండా జీవో 1 చేస్తోందని.... ఫలానా విధంగా అనుసరించండి అనేలా జీవో నిర్దేశిస్తోందని స్పష్టంచేసింది.

ప్రమాదం సాకుతో సమావేశాల హక్కును కాలరాయడం సరికాదు: ఒకచోట జరిగిన ప్రమాదాన్ని సాకుగా చూపి ప్రతిచోటా సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించే హక్కును కాలరాయడం సరికాదన్న హైకోర్టు.... జరిగిన ప్రమాదానికి కారణాలేంటో విశ్లేషించి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేగానీ రహదారులపై సమావేశాలకు అనుమతులపై స్థానిక అధికారుల విచక్షణను తీసేయడం సరికాదంది. ప్రమాదాల నివారణ పేరుతో వ్యక్తులకు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛపై ఆంక్షలు విధించేలా జీవో 1 తీసుకురావాల్సిన అవసరం లేదని.... వ్యక్తులు, పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల విషయంలో జీవోలో పేర్కొన్న ఆంక్షలు సహేతుకంగా లేవని పేర్కొంది. జీవో నెంబర్‌ వన్‌లో షరతులు చాలా తీవ్రంగా ఉన్నాయంది.

మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ కేసులో ప్రాథమిక హక్కులను సమతౌల్యం చేస్తూ.. సభలు, సమావేశాలకు అనుమతి ఇచ్చే సమయంలో సహేతుకమైన మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు చెప్పిందని హైకోర్టు గుర్తుచేసింది. దిల్లీలో పార్లమెంటు, ప్రధానమంత్రి, ఉన్నతాధికారులు వినియోగించే మార్గాలున్న ప్రాంతంలో జరిగిన నిరసనల విషయంలోనూ.. సహేతుకమైన షరతుల మేరకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపింది.

చారిత్రకంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా రహదారులపై సభలు సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో గుర్తించిందని హైకోర్టు స్పష్టంచేసింది.రహదారులపై ప్రజారవాణాకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అయినా.. దశాబ్దాలుగా ఈ దేశంలోని ఉన్నత న్యాయస్థానాలు రహదారులపై శాంతియుత వాతావరణంలో సభలు సమావేశాలు, నిరసనలు తెలియజేయడాన్ని హక్కులుగా గుర్తించాయని హైకోర్టు తెలిపింది. రాజ్యాంగం అమల్లోకి రాకముందు నుంచి రహదారులపై సభలు సమావేశాలు, నిరసనలు తెలియజేయడం హక్కుగా ఉన్న విషయాన్ని హిమ్మత్‌లాల్‌ కేసులో సుప్రీంకోర్టు గుర్తుచేసిందని స్పష్టంచేసింది. శాంతియుత సమావేశాలు నిర్వహించుకోవడం పౌరుల ప్రాథమిక హక్కుగా రాజ్యాంగ రూపకర్తలు గుర్తించారని సుప్రీం తెలిపిందని పేర్కొంది.

భారతదేశం స్వాతంత్య్రం సాధించుకునే క్రమంలో రహదారులపై నిర్వహించిన ఊరేగింపులు, ధర్నాలు, సత్యాగ్రహాలదే కీలకపాత్ర పోషించాయంది. రాష్ట్ర రాజకీయ చరిత్రను పరిశీలించినా అనేక పాదయాత్రలు, ఊరేగింపులు, సమావేశాలు రహదారులు, జాతీయ రహదారులపై నిర్వహించారని... సభలు, సమావేశాల నిర్వహణ పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని తేల్చిచెప్పింది. ఆ హక్కును తీసివేసే ఎలాంటి జీవోనైనా తీవ్రంగా పరిగణించాల్సిందేనని పేర్కొంది. సభలు, సమావేశాల నిర్వహణకు సహేతుకమైన షరతులు విధించే అధికారమే ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టంచేసింది. ఆ షరతులు సైతం సుప్రీంకోర్టు మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ కేసులో నిర్దేశించిన మేరకే ఉండాలని తేల్చిచెప్పింది.

భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది: భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది లాంటిదన్న హైకోర్టు.... రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కులలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు ముందు వరుసలో ఉంటుందని తెలిపింది. ఇంతటి విలువైన హక్కును ఏ ఒక్కరూ హరించలేరని.... జీవో 1 ద్వారా కల్పించిన అధికారాలు ఏకపక్షంగా, అపరిమితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. పౌరుల ప్రాణాలను కాపాడేందుకు జీవో తెచ్చామని ప్రభుత్వం సమర్థించుకున్నా.. ఆ జీవో అంతిమ ఫలితం రాష్ట్రంలో రహదారులపై అన్ని రకాల సమావేశాలను నిషేధించేలా ఉందని అభిప్రాయపడింది. జీవో 1 న్యాయపరీక్ష ముందు నిలవనందున దాన్ని కొట్టేస్తున్నామని.... చట్ట నిబంధనలకు లోబడి ప్రభుత్వం భవిష్యత్తులో సరైన మార్గదర్శకాలు రూపొందించవచ్చని స్పష్టం చేసింది.

అత్యవసరం అనే నిర్వచనం కిందకు రాదు: జీవో 1పై దాఖలైన పిల్‌పై సంక్రాంతి సెలవుల్లో వెకేషన్‌ బెంచ్‌ అత్యవసర విచారణ చేపట్టడంపై అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌ అభ్యంతరం లేవనెత్తారన్న హైకోర్టు.. ఆ వాదనలకు బలం ఉందని చెప్పింది. సంక్రాంతి సెలవులు ఎనిమిది రోజులే ఇచ్చినందున ఆ వ్యాజ్యం ‘అత్యవసర వ్యవహారమనే నిర్వచనం కిందకు రాదని అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated :May 13, 2023, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.