రూ. 2.79 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్..!

author img

By

Published : Mar 16, 2023, 9:39 AM IST

AP BUDGET 2023-24

AP BUDGET 2023-24 : 2 లక్షల 79 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. జగన్‌ పాదయాత్రతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు బడ్జెట్‌లో తగినంతగా నిధుల కేటాయింపు ఉంటుందా అన్నది కీలకాంశం కానుంది. ఆర్థిక శాఖ ఆంక్షలతో కీలక ప్రాజెక్టులు, రంగాలకు ఏ మేరకు నిధులు ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

AP BUDGET 2023-24 : ఆంధ్రప్రదేశ్​లో వైసీపీ ప్రభుత్వం చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ను నేడు శాసనసభకు సమర్పించనుంది. దాదాపు 2 లక్షల 79 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉదయం 10 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యవసాయ బడ్జెట్‌ సమర్పిస్తారు. శాసన మండలిలో బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెడతారు.

జగన్‌ పాదయాత్రలో, ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చేలా ఈ బడ్జెట్‌లో తగినంత నిధుల కేటాయింపు, వెసులుబాటు ఉంటుందా అన్నది ప్రధానాంశం కానుంది. నవరత్నాలు కాకుండా పాదయాత్ర హామీల మేరకు ఇతరత్రా అనేక ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. అందులో అనేకం ముందడుగు పడనివే ఉన్నాయి. ఇప్పటికే నాలుగు సంవత్సరాలుగా మూల ధన వ్యయం రూపంలో చేస్తున్న ఖర్చు చాలా తక్కువగా ఉంది. కేటాయింపులకు, అభివృద్ధిపై నిధుల ఖర్చుకూ పొంతన లేని పరిస్థితులు ఉన్నాయి. కొత్త బడ్జెట్‌ రూపకల్పన సమయంలోనూ ఆర్థిక శాఖ అనేక ఆంక్షలను విధించింది. ఈ పరిస్థితుల్లో కీలక ప్రాజెక్టులు, రంగాలకు నిధుల కేటాయింపు ఆశించిన స్థాయిలో ఉంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రభుత్వ శాఖలు అడిగినంత మాత్రాన ప్రస్తుత బడ్జెట్‌లో నిధులు ఇవ్వబోమని స్పష్టం చేసిన ఆర్థికశాఖ.. అందుకు తగ్గట్టే ప్రతిపాదనలు స్వీకరించింది. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపై అనేక ఆంక్షలు విధించింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని నిధులు ఖర్చు చేయగలరు అనే వాస్తవ దృక్పథంతో లెక్కలు వేసి మరీ ప్రతిపాదనలు సమర్పించాలని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వ అనుమతి ఉన్న వాటికి తప్ప.. మరే కొత్త పనులకు నిధులు ఇవ్వబోమని తేల్చేశారు.

ఒప్పంద గడువు ప్రకారం అవసరమైనన్ని నిధులు కేటాయించేది లేదని చెప్పారు. ఒక ప్రాజెక్టుకు భూమితో పాటు అన్ని అనుమతులూ ఉండీ, పనులు చేయడానికి అవకాశం ఉంటేనే నిధులు ఇస్తామని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో కీలక ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో నిధులు దక్కుతాయా అనే చర్చ సాగుతోంది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 56వేల 256.56 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మొత్తం లక్షా 91వేల 225 కోట్ల రెవెన్యూ రాబడులు వస్తాయని అంచనా వేశారు. జనవరి వరకు తొలి పది నెలల కాలంలో లక్షా 24వేల 109 కోట్లే రాబడి వచ్చింది. మిగిలిన రెండు నెలల రాబడి కూడా కలిపితే.. సంవత్సరానికి లక్షా 50 వేల కోట్ల రూపాయల మేర సమకూరి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

బడ్జెట్‌ పూర్తిగా సాకారం కావాలంటే మిగిలిన మొత్తం రుణాల రూపంలోనే తెచ్చుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బడ్జెట్‌ అంచనాలు ఏ మేరకు సాకారం అయ్యాయన్నది గురువారం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తేలుతుంది. పెద్ద మొత్తంలో బడ్జెట్‌ ప్రతిపాదనలున్నా, నిధులు రాబట్టడమే ముఖ్యం. బడ్జెట్‌ ఎంతనే దానికంటే, రాబడులు ఎలా సమీకరించగలరన్నదే కీలకం. అయితే ప్రస్తుతం ఉన్న కొన్ని పథకాలను పరిమితం చేసే యోచనలో ఉంది. ఒకే లాంటి పథకాలు ఒకటికి మించి ఉంటే వాటిని కలపాలని నిర్ణయించారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తరహా పథకాలు రాష్ట్రంలో కొత్తగా ఏవీ ప్రారంభించకూడదనేది బడ్జెట్‌ మార్గదర్శకాల్లో ఒకటి. కొత్త వాహనాలు కొనడానికి అనుమతులు లేవని, అనేక నిర్వహణ ఖర్చులకు పెద్దఎత్తున కోత పెట్టనున్నారని సమాచారం. ఈసారి కూడా జెండర్, చిన్న పిల్లల పేరుతో కేటాయింపులు ప్రత్యేకంగా చూపనున్నారు.

రూ. 2.79 లక్షల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర బడ్జెట్..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.