అంతా అనుకున్నట్లే.. పట్టణాల్లో అదానీ.. గ్రామాల్లో షిర్డిసాయి.!

author img

By

Published : Mar 16, 2023, 8:48 AM IST

SMART METERS TENDRES
SMART METERS TENDRES ()

SMART METERS TENDRES ప్రభుత్వ పెద్దల సన్నిహితులకే స్మార్ట్‌ మీటర్ల టెండర్లు దక్కినట్లు తెలుస్తోంది. పట్టణాల్లో అదానీ, గ్రామాల్లో షిర్డిసాయి సంస్థ మెజార్టీ వాటా దక్కించుకోగా.. ఎన్​సీసీకి ఒక్కటి మాత్రమే లభించింది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో.. ధరల విషయమై సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.

అంతా అనుకున్నట్లే.. పట్టణాల్లో అదానీ.. గ్రామాల్లో షిర్డిసాయి!

SMART METERS TENDRES : స్మార్ట్‌ మీటర్ల టెండర్ల వ్యవహారంలో అంతా అనుకున్నట్లే జరిగింది. ప్రభుత్వ పెద్దల సన్నిహిత కంపెనీలైన అదానీ, షిర్డిసాయి సంస్థలకే టెండర్లలో మెజారిటీ వాటా కట్టబెట్టినట్లు తెలిసింది. వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటు పనులకు పిలిచిన రెండు టెండర్లను షిర్డిసాయి సంస్థ దక్కించుకుంటే, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు స్మార్ట్‌ మీటర్ల పనులను అదానీ కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఎన్​సీసీ సంస్థ ఒక టెండరు మాత్రమే దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

విద్యుత్తు పంపిణీ సంస్థల పునఃవ్యవస్థీకరణ పథకం- ఆర్డీఎస్​ఎస్​ (R.D.S.S) కింద వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు అమర్చడం.. గృహ, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు మీటర్ల ఏర్పాటు పనులను ఆరు ప్యాకేజీలుగా విభజించారు. సుమారు 15వేల 427.36 కోట్ల రూపాయల విలువైన పనులకు గత సంవత్సరం డిసెంబరులో డిస్కంలు టెండర్లు పిలిచాయి. పలు సంస్థలు దాఖలు చేసిన ఫైనాన్షియల్‌ బిడ్‌లు, సాంకేతిక బిడ్‌ల పరిశీలన పూర్తయింది. రివర్స్‌ టెండరింగ్‌ తర్వాత వచ్చిన ధరల ఆధారంగా.. ఆయా సంస్థలతో అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, బిడ్‌లు దక్కించుకున్న సంస్థల వివరాలు ప్రకటించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

గతంలో 6వేల 400 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టుల టెండర్లలోనూ మెజారిటీ వాటాను అదానీ, షిర్డిసాయి సంస్థలే వశం చేసుకున్నాయి. దీనిపై కోర్టు వివాదం నెలకొనడంతో ప్రభుత్వం అప్పట్లో రద్దు చేయాల్సి వచ్చింది. ఇటీవల నామినేషన్‌ విధానంలో కేటాయించిన పంప్డ్‌ స్టోరేజి విద్యుత్తు ప్రాజెక్టుల్లోనూ ఈ రెండు కంపెనీలకే ప్రభుత్వం మెజారిటీ వాటా అప్పగించింది. ఇటీవల విదేశీ బొగ్గు కొనుగోలుకు పిలిచిన టెండరు కూడా అదానీకే వెళ్లింది. టెండరు నిబంధనలు, పర్యవేక్షణను హైదరాబాద్‌లోని వాయంట్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు డిస్కంలు అప్పగించాయి.

డిస్కంలు మొత్తం ఆరు ప్యాకేజీలకు టెండర్లు పిలిస్తే.. ప్రతి ప్యాకేజీకి రెండు టెండర్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చిన ఆ రెండూ ఏ సంస్థలు దాఖలు చేశాయనే వివరాలను మాత్రం అధికారులు వెల్లడించడం లేదు. ఆ బిడ్‌లు కూడా డిస్కంలు ప్రతిపాదించిన ధర కంటే ఎక్కువ మొత్తానికే దాఖలైనటు సమాచారం. రివర్స్‌ టెండరింగ్‌ తర్వాత కూడా డిస్కంలు ప్రతిపాదించిన ధర కంటే ఎక్కువగా ఉండటంతో... అధికారులు సంప్రదింపుల ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

ఇళ్లకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, ఫీడర్ల విభజనకు మొత్తం 8వేల 927.36 కోట్ల రూపాయల విలువైన పనులకు డిస్కంలు టెండర్లు పిలిచాయి. ఇందులో కేంద్రం ఇచ్చే గ్రాంటు 4వేల 440.43 కోట్ల రూపాయలు పోగా, మిగిలిన 4వేల 486.93 కోట్ల రూపాయలను వినియోగదారులపై సర్దుబాటు చేయాల్సి వస్తుంది. మొదటి దశలో 27.68 లక్షల గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్తు కనెక్షన్లతో పాటు.. 25 కేవీఏ(KVA) లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న 2.92 లక్షల పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు, 11 K.V. ఫీడర్లకు 14 వేల 33స్మార్ట్‌ మీటర్లను డిస్కంలు ఏర్పాటు చేయనున్నాయి.

అడ్వాన్స్‌డ్‌ మీటరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సర్వీస్‌ ప్రొవైడ్‌ కింద స్మార్ట్‌ మీటర్ల నుంచి రీడింగ్‌ నమోదుకు.. 2వేల 201.24 కోట్ల రూపాయలతో మూడు డిస్కంలు టెండరు పిలిచాయి. C.P.D.C.L 783 కోట్లు, E.P.D.C.L 628.24 కోట్లు, S.P.D.C.L 790 కోట్ల రూపాయలతో పనులు నిర్వహించాల్సి ఉంది. వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటుకు 6వేల 725.72 కోట్ల రూపాయల పనులకు డిస్కంలు జిల్లాల వారీగా టెండర్లు ఆహ్వానించాయి. C.P.D.C.L పరిధిలో వెయ్యి 99 కోట్లు, E.P.D.C.L పరిధిలో 2వేల 53.10 కోట్లు, S.P.D.C.L పరిధిలోని 5 జిల్లాల్లో 3వేల 564 కోట్ల రూపాయలతో పనుల నిర్వహణకు టెండర్లు పిలిచాయి. 18.5 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు 2వేల 500 కోట్లు, అనుబంధ పరికరాల ఏర్పాటుకు 4 వేల కోట్లతో ప్రతిపాదించిన పనులకు వేర్వేరుగా టెండర్లు ఆహ్వానించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.