తిరుపతి కేస్‌ స్టడీగా "విచారణ చేయండి".. సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

author img

By

Published : Mar 16, 2023, 9:10 AM IST

Chandrababu Letter

Chandrababu Complaint : తిరుపతి ఎన్నికల అక్రమాలను కేస్ స్టడీగా తీసుకుని సమగ్ర విచారణ జరిపించాలంటూ... కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 2019 తర్వాత జరిగిన వివిధ ఎన్నికల్లో అక్రమాలకు బాధ్యులపైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల అక్రమాలపై వీడియోలు, డాక్యుమెంట్లు, మీడియా కథనాలను లేఖకు జత చేశారు.

తిరుపతి కేస్‌ స్టడీగా "విచారణ చేయండి".. సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

Chandrababu Complaint To Central Elections Commissioner : ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలు, బోగస్ ఓట్ల నమోదు, ఎన్నికల అధికారుల అధికార దుర్వినియోగంపై.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో నిర్వహించిన పలు ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర వివరాలతో లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని.. అధికార వైసీపీ బరితెగించి అక్రమాలకు పాల్పడిందని ఈసీకి నివేదించారు.

బోగస్ ఓట్ల నమోదు, విపక్ష అభ్యర్థుల కిడ్నాప్, బూత్ స్వాధీనం, రిగ్గింగ్‌పై గతంలోనే ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి A.E.R.Oలు, E.R.Oలు, గెజిటెడ్ అధికారులు భారీగా నకిలీ ఓట్లు చేర్చారని.. తిరుపతి నగరంలోనే ఈ సంఖ్య 7 వేలకు పైగా ఉందన్నారు. దీనిపై ఎన్నికల అధికారి వెంకట రమణారెడ్డికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని.. పెద్ద సంఖ్యలో నకిలీలు ఓటు వేశారని లేఖలో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు అక్రమంగా పోలింగ్ బూతుల్లోకి ప్రవేశించడంపై అభ్యంతరం తెలిపిన తెలుగుదేశం నేత మబ్బు దేవనారాయణరెడ్డిని అరెస్టు చేసిన విషయం ప్రస్తావించారు. పోలింగ్‌ ఏజెంట్‌ పులుగోరు మురళితోపాటు బోగస్ ఓట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నర్సింహ యాదవ్ సహా పలువురు నాయకులను అరెస్టు చేసిన పోలీసులు.. పోలింగ్ పూర్తయ్యే వరకు కస్టడీలో ఉంచారని ఫిర్యాదు చేశారు.

తిరుపతి వ్యాప్తంగా విచ్చలవిడిగా అవకతవకలు జరిగినా.. 229, 233 పోలింగ్ స్టేషన్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించారని గుర్తు చేశారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడంతో తెలుగుదేశం అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ను వైసీపీ గూండాలు బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2021లో జరిగిన తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అవకతవకలపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ZPTC, MPTC ఎన్నికల్లో అసాధారణంగా ఏకగ్రీవాలు నమోదయ్యాయని, అధికార పార్టీ యథేచ్ఛగా దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిందంటూ అప్పటి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్.. కేంద్రానికి లేఖ రాసిన విషయం ప్రస్తావించారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక, తిరుపతి టౌన్‌ బ్యాంక్ ఎన్నికల్లోనూ వైసీపీ భారీగా బోగస్ ఓట్ల నమోదు చేసిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అధికార పార్టీ అక్రమాలు పరాకాష్టకు చేరాయన్నారు. ఈ అవకతవకలపై ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారికి, భారత ఎన్నికల సంఘానికి.. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి L.V. సుబ్రమణ్యం లేఖ రాశారని గుర్తు చేశారు. ఆయన చెప్పినట్లు పోలింగ్ రోజున ఎన్నికల అధికారులు, పోలీసులు మౌన ప్రేక్షకుల్లా వ్యవహరించారని విమర్శించారు.

వైసీపీ అక్రమాలు, హింసతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో శాంతియుత వాతావరణం దెబ్బతిందని.. ఈ పరిస్థితుల్లో 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఉపాధ్యాయులను విధుల నుంచి తప్పించి, ఇతరులను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.

వివిధ సందర్భాల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేసినప్పుడే ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుని ఉంటే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ స్థాయిలో అక్రమాలు జరిగేవి కాదని చంద్రబాబు అన్నారు. ఇప్పటికైనా తిరుపతిని కేస్ స్టడీగా తీసుకుని నిశితంగా పరిశీలించాలని కోరారు. బూత్‌ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తప్పు చేసిన వారందరిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలన్నారు. ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించకుంటే.. వైసీపీ అరాచకాలతో ప్రజాస్వామ్యానికి చేటు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.