తరచూ అనారోగ్యం పాలవుతున్నారా? - ఈ సమస్య ఒక్కసారి చెక్ చేయించుకోవాలంటున్న వైద్యులు!
"పొట్ట" ఆరోగ్యం అత్యంత ముఖ్యం - ఫైబర్ ఫుడ్ తీసుకోవాలని సూచన

Published : June 16, 2026 at 3:27 PM IST
Gut Health : కొంతమందికి ఎన్ని రకాల పరీక్షలు, చికిత్సలు చేసినా అనారోగ్యం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు పొట్టలో బ్యాక్టీరియాను పరిశీలించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, పొట్టలో మంచి బ్యాక్టీరియా కంటే చెడు బ్యాక్టీరియా మోతాదు పెరిగినప్పుడు చికిత్సలెన్ని చేసినా ఫలితం ఉండదంటున్నారు. ఈ క్రమంలో పొట్టను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు, మంచి బ్యాక్టీరియాను పెంచుకునేందుకు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
గట్ మైక్రోబయోమ్ పాత్ర : మన పేగుల నిండా కోటాను కోట్ల బ్యాక్టీరియా సజీవంగా తిరగాడుతుంది. వీటిలో ఎన్నో రకరకాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా పెద్ద పేగు, చిన్న పేగుల్లో నివాసం ఉంటూ అనుక్షణం రకరకాలుగా మనకు సహాయం చేస్తుంటాయి. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం దగ్గర నుంచి భారీ సైన్యంలా పనిచేస్తూ, హానికారక సూక్ష్మజీవుల నుంచి మన పేగులను రక్షిస్తూ ఉంటాయట. అలాగే విటమిన్ బి 12, బి, కె వంటి పోషకాలను ఉత్పత్తి చేస్తుంది. సహజమైన యాంటీ బయాటిక్స్, ఆమ్లాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి ఉత్పత్తి చేయడం ద్వారా పేగుల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షణగా నిలుస్తాయి. మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి రోగ కారకాలపై పోరాడే యాంటీ బాడీల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయట. విషతుల్యాలు, అలర్జీ కారకాలు హానికారకమైన సూక్ష్మ జీవలపై పోరాటానికి సిద్ధం చేస్తాయి. అయితే, ఈ బ్యాక్టీరియాలన్నీ మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. దీనిలో దాదాపు 10 శాతం చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుందట. దీని ప్రాబల్యం పెరిగితే పొట్టలో గ్యాస్ పెరగడం, అజీర్ణం, విరేచనాలు లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు ఇవి క్యాన్సర్లకు కారణం కావచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
నిద్ర లేవగానే తలనొప్పిగా ఉంటోందా? - మీకు తెలిసీ పట్టించుకోని కారణాలివే!
గట్ హెల్త్ బాగుండాలంటే సమతులాహారం తీసుకోవాలి. అందులో ఫైబర్, ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. గింజ ధాన్యాలను కూడా తీసుకోవాలి. అయితే, ఈ రోజుల్లో రెడీమేడ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. వాటిలో బాగా ఉడకడానికి లేదా ఎక్కువ సేపు నిల్వ ఉండటానికి కొన్ని రకాల రసాయన పదార్థాలను కలుపుతుంటారు. దీనివల్ల కూడా మన శరీర ఆరోగ్యం దెబ్బ తినవచ్చు. అలాగే, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినకూడదు. ఒకసారి వాడిన నూనెను మళ్లీ ఉపయోగించడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే, మనం తీసుకునే ఆహారం తాజాగా ఉండి ఎక్కువగా ఫైబర్ కలిగి ఉండాలి.
- డా. అంజలీ దేవి, పోషకాహార నిపుణురాలు
వీటిని తీసుకోవాలట : ఈ రోజుల్లో విచక్షణ రహితంగా యాంటీ బయోటిక్స్ వాడడం, శుద్ధి చేసిన రిఫైన్డ్ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన పొట్టలో మంచి బ్యాక్టీరియా బలహీనపడి చెడు బ్యాక్టీరియా బలోపేతం అవుతుంది. ఈ క్రమంలో ఆహారపు అలవాట్ల ద్వారా పొట్టలో మంచి బ్యాక్టీరియాని పెంచుకోవడం చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. పీచు పదార్థం ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు, గింజ ధాన్యాలని తరచు తీసుకోవాలని చెబుతున్నారు. ఇవి పేగులకు చాలా మంచివి. అలాగే, పాలు, పెరుగు వంటి ప్రొబయోటిక్స్ ఉన్న ఆహారాలు కూడా పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. జంక్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వేళకు తినడం, ప్రశాంతమైన నిద్ర, తగినన్ని నీళ్లు తాగడం ముఖ్యమే. పొగ, మద్యం వంటి అలవాట్లు పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట. తీవ్రమైన ఒత్తిడి కూడా పొట్ట ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరట : పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పేగుల్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో యాంటీ బయోటిక్స్, యాంటీ యాసిడ్, స్టీరాయిడ్ మందుల్ని అవసరమైతే తీసుకోవాలి కానీ, ఎక్కువగా వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, చక్కెరలు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా శుద్ధిచేసిన ఆహార పదార్థాలను తగ్గించాలంటున్నారు. ఇవి చెడు బ్యాక్టీరియా పెరగడానికి దోహదం చేస్తాయట. మాంసాహారాలు బ్యాక్టీరియాతో చర్య జరిపి పేగుల కణాల్లో మార్పు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, మాంసాహారాన్ని సాధ్యమైనంత వరకు తక్కువగా తింటూ, పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇక మద్యం అనేది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీయడంతో పాటు చెడు బ్యాక్టీరియా ప్రభావం పెరిగేలా కూడా చేస్తుంది. కాబట్టి, మద్యం తాగకుండా ఉండడం పొట్ట ఆరోగ్యానికి మంచిది. తాజా పండ్లు, పెరుగు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియాకు ఎంతో మేలు చేస్తుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వర్షాకాలంలో అనారోగ్యం ముప్పు ? - "ఆకుకూరలు, బజ్జీలు, పకోడీలతో కాస్త జాగ్రత్త"
మీ ఆరోగ్యం గుట్టు విప్పే 'గుబిలి' - తెల్లగా, గోధుమరంగు, ఆకుపచ్చగా ఉంటే అర్థాలివే!

