ETV Bharat / health

పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివేనా? - అందులో ఏవి తినాలి? - ఏవి తినకూడదు?

- పచ్చి కూరగాయలు Vs ఉడికించిన కూరగాయలు - ఆరోగ్యానికి ఏ పద్ధతి బెస్ట్?

Vegetables
Vegetables (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : March 26, 2026 at 3:03 PM IST

2 Min Read
Choose ETV Bharat

Raw vs Cooked Vegetables : ఇటీవల ఉత్తరప్రదేశ్​కు చెందిన ఓ యువతి మెదడులో సూక్ష్మక్రిములున్న నీటితిత్తులు ఏర్పడి చనిపోయింది. ఆమె ఎక్కువగా ఫాస్ట్​ఫుడ్ తినేదని, సరిగ్గా శుభ్రం చేయని, పూర్తిస్థాయిలో ఉడకని క్యాబేజీ తినడం వల్ల అలా జరిగిందని డాక్టర్లు వెల్లడించారు. ఈ క్రమంలో కూరగాయలను పచ్చిగా లేదా సగం ఉడికీ, ఉడకనివి తింటే ఆరోగ్యం దెబ్బతింటుందా? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

సలాడ్స్, ఫాస్ట్​ఫుడ్ పేరు ఏదైనా అందులో కూరగాయలు ఉండాల్సిందే. ఈ క్రమంలో పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివేనా? అందులో ఏవి తినాలి? ఏవి తినకూడదు? అనేదానిపై చాలామందికి సందేహాలుంటాయి. కొందరు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తే.. ఇంకొందరు అలాగే తినేస్తుంటారు. అయితే, ఇలా తినడం వల్ల కొన్ని పోషకాలు అందే మాట నిజమే అయినా కొద్ది సందర్భాల్లో ప్రాణాపాయం జరగొచ్చంటున్నారు నిపుణులు. దీనిపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.

ప్రశాంతమైన నిద్ర కావాలా? - ఈ అపోహలు వీడాలంటున్న నిపుణులు!

పచ్చి కూరగాయలు తినడం వల్ల నష్టాలు :

జీర్ణ సమస్యలు : ముడి కూరగాయలలో గట్టి ఫైబర్ ఉంటుందట. ఎక్కువగా తినడం వల్ల కడుపునొప్పి, ఎసిడిటీ, ఉబ్బరానికి దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

సహజ విషపదార్థాలు : కొన్ని కూరగాయల్లో సోలనిన్ వంటి సహజ విషపదార్థాలు ఉంటాయి. వీటిని వండడం ద్వారా తొలగించొచ్చట.

బ్యాక్టీరియా, పరాన్న జీవులు : సరిగ్గా శుభ్రం చేయని పచ్చి కూరగాయల్లో ఈకోలి వంటి హానికర బ్యాక్టీరియా, నులిపురుగుల గుడ్లు ఉండొచ్చు. ఇవి ఇన్​ఫెక్షన్లకు దారితీస్తాయంటున్నారు నిపుణులు.

పచ్చి కూరగాయలు, పండ్లు తినే ముందు వాటిని ఉప్పు నీటిలో 20 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేస్తే వాటిపై ఉన్న రసాయనాలు తొలగిపోతాయి. తర్వాత మంచి నీటితో శుభ్రం చేసి తినాలి. సాధారణంగా కూరగాయలు వండుకుని తినడమే మేలు. పచ్చివి తినాలంటే వైద్యుల పర్యవేక్షణలో వారి సూచనల మేరకే చేయాలి. అలాగే, సరిగా ఉడికించని మాంసం, చేపలు తింటే మెదడులో తిత్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కూరగాయల్లో పురుగుమందు అవశేషాలు ఉంటాయి. కాబట్టి, పచ్చివి తినకపోవడమే మంచిది - డా. చైతన్య, జీర్ణకోశ వ్యాధి నిపుణులు

తినకూడనివి : బంగాళాదుంపలు, వంకాయలు, క్యాప్సికం, బ్రోకలి, క్యాలీప్లవర్, పాలకూర, కొన్ని చిక్కుడు జాతి కూరగాయలను పచ్చిగా తినడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

  • పచ్చి బంగాళాదుంపలో ఉండే సోలనిన్ తలనొప్పి, వికారం, ఉబ్బరాన్ని కలిగిస్తుందట.
  • వంకాయలో చేదు రుచి అజీర్ణ సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు.
  • పచ్చి టమాటాలో ఉండే టొమాటిన్ సమ్మేళనం జీర్ణసమస్యలతోపాటు పోషక శోషణానికి ఆటంకంగా మారుతుందని తెలియజేస్తున్నారు.
  • పచ్చి బచ్చలకూరలో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ వల్ల క్యాల్షియం, ఐరన్​ శోషణకు ఆటంకం కలుగుతుందట.
  • క్యాబేజీలో నులిపురుగులు, వాటి గుడ్లు ఉంటాయి. ఇవి కంటికి కనిపించవని అంటున్నారు నిపుణులు. వండే ముందు వేడినీటిలో బాగా శుభ్రం చేసి పూర్తిగా ఉడికించి తినాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో పచ్చి క్యాబేజీలో ఉండే అధిక ఫైబర్ జీర్ణశక్తి తక్కువ ఉన్నవారిలో తిమ్మిరి, విరేచనాలకు దారితీస్తుందని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'టీబీ'కి మందులు ఎంత కాలం వాడాలి? - ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

"PCOS" వల్ల మూడ్ స్వింగ్స్ - తగ్గేందుకు ఏం చేయాలో తెలుసా?