"పాలకూర-చికెన్" ఫుడ్ పాయిజన్ - చికెన్ క్లీన్ చేస్తే బ్యాక్టీరియా విస్తరిస్తుందా?
చికెన్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా - కడగడం వల్ల విస్తరించే అవకాశం ఉందంటున్న నిపుణులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 2:55 PM IST
Food Poisoning : కొద్ది రోజుల కిందట ఒడిశాలో వెలుగుచూసిన ఫుడ్ పాయిజనింగ్ కేసు మన ఆహారపు అలవాట్లపై మరోసారి చర్చ లేవనెత్తింది. పాలకూర, చికెన్ కర్రీ కలిపి తిని ముగ్గురు మృతి చెందిన ఈ ఘటన వంటింటి పరిశుభ్రత, 'కాంబినేషన్ ఫుడ్'పై అవగాహన తప్పనిసరి అనే విషయాన్ని గుర్తు చేసింది.
కిడ్నీలో రాళ్ల సమస్య రాకూడదంటే - ఈ జాగ్రత్తలు పాటించాలట!
భారతీయ వంటకాల్లో టమోటాలు, ఉల్లిపాయలు, కోడిగుడ్డు విరివిగా వినియోగిస్తుంటారు. టమోటాలు దాదాపు ప్రతి వెజ్, నాన్‌వెజ్ కర్రీల్లో వాడుతుంటారు. ముఖ్యంగా 'పాలకూర-టమోటా', 'పొట్లకాయ-కోడిగుడ్డు', 'పెరుగు-చేపలు' ఇలా కొన్ని రకాల పదార్థాలు కలిపి వండకూడదని పెద్దవాళ్లు చెప్తుంటారు. ఆయుర్వేద నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివెన్నో ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైన్స్ పరంగా అందులో వాస్తవమెంత? పరిశోధనలు ఏం చెప్తున్నాయి? అనేది తెలుసుకుందాం.
ఏం జరిగింది?
ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో చికెన్ కర్రీ, రైస్, పాలకూర తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఫుడ్ పాయిజనింగ్ వారి మృతికి కారణమని అంగుల్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. అయితే, పాలకూర, చికెన్ ఎలా ప్రాణాంతకంగా మారాయి? అనే విషయమై పోషకాహార నిపుణులు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఫుడ్ పాయిజనింగ్ అంటే?
ఏదైనా ఆహారం తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత అనారోగ్యం బారిన పడడాన్ని ఫుడ్ పాయిజనింగ్ (ఆహారమే విషంగా మారడం) అంటారు. ఆయా పదార్థాల్లోని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా కారణంగా ఇలా జరుగుతుంది. ఆహారాన్ని తిన్న కొన్ని గంటలు లేదా రోజుల్లో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. అతి తీవ్రమైన అనారోగ్యం కలిగితే తప్ప ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోరు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఎక్కువ ఫుడ్ పాయిజనింగ్ కేసులకు కారణమని అనేక CDC పరిశోధనలు వెల్లడించాయి.
పాలకూర - చికెన్ విషపూరితం ఎలా అవుతుందనే విషయమై "క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రేణుకా మైండే" పలు విషయాలు వెల్లడించారు.
చికెన్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది కానీ, ఉడికించని, పచ్చి చికెన్‌లో ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా లేదా క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్ వంటి క్రిములు, బ్యాక్టీరియా ఉంటుంది. పచ్చి చికెన్ లేదా దానిని క్లీన్ చేసిన పాత్రల్లో ఇతర ఆహారాలు తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే చికెన్ 165 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరుకునే వరకు ఉడికించాలి. ఈ ఉష్ణోగ్రతలో బ్యాక్టీరియా నశిస్తుంది. - డాక్టర్ రేణుకా మైండే, క్లినికల్ న్యూట్రిషనిస్ట్

పాలకూర ఎలా కారణం?
పాలకూరలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయనేది వాస్తవమే. ఇందులో సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహకరిస్తుంది. పాలకూరలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. పాలకూరలో ఐరనే కూడా ఎక్కువే కానీ, సరిగ్గా శుభ్రం చేయకున్నా, సరైన ఉష్ణోగ్రతలో ఉడికించకుండా తిన్నా అది ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీస్తుంది. ఎందుకంటే పాలకూర పెంచిన నేల, నీరు, ఎరువులు, జంతువుల మలమూత్రాల విసర్జన ఫలితంగా బ్యాక్టీరియాకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లేదా ఒడిశా ఘటనలో చికెన్ శుభ్రం చేసిన నీటితో పాలకూర కూడా కడిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకా వారు ఏమన్నారంటే!
- చికెన్, పాలకూర వంటి ఆహార పదార్థాలను కలిపి వండినప్పుడు ప్రమాదం మరింత పెరుగుతుంది.
- చికెన్ కట్ చేయడానికి ఉపయోగించిన కత్తి లేదా చాపింగ్ బోర్డునే పాలకూర కట్ చేయడానికి వాడటం.
- చికెన్ శుభ్రం చేసిన నీళ్లు, పాత్రలు, సింక్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇక అవే పాత్రలు, నీళ్లు పాలకూరకు ఉపయోగించడం ప్రమాదానికి దారి తీస్తుంది.
- వండిన ఆహారం బయటి వాతావరణంలో ఎక్కువ సేపు నిల్వ చేయడం.
- రిఫ్రిజిరేటర్‌లో సరిగ్గా ఉంచకపోవడం వల్ల కూడా బ్యాక్టీరియా పెరుగుదలకు కారణం.
- చికెన్ శుభ్రం చేసిన చేతులతోనే తిరిగి ఇతర పాత్రలు ముట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా విస్తరిస్తుంది. చేతులు అంటుకున్న ప్రతి చోటా ఈ బ్యాక్టీరియా అంటుకుంటుంది. కత్తి, మసాలా పాత్రలు ముట్టుకోవడం వల్ల ఇలా వంట గది మొత్తం బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇది కళ్లు, ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉన్నందున చికెన్ కడగకుండా వండుకోవడమే బెటర్ అని పేర్కొంటున్నారు.

"ది కాన్వర్సేషన్"లో ప్రచురితమైన నివేదిక
చికెన్ నీళ్లలో శుభ్రం చేయడం ద్వారా అందులోని హానికరమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోదని "ది కాన్వర్సేషన్" నివేదిక వెల్లడిస్తోంది. చికెన్‌లో సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ ఇన్ఫెక్షన్లు, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి ఇబ్బందులతో పాటు తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతాయని వైద్యులు చెప్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఇవి మరింతగా ప్రభావం చూపిస్తాయని, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ప్రాణాంతకం కావచ్చని పేర్కొన్నారు. చికెన్ వండే సమయంలో చేతులు ముక్కు, ముఖం మీద పెట్టుకోవద్దని, సబ్బుతో చేతులు, గిన్నెలు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
"పాలకూర-టమోటా" కలిపి వండకూడదని, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయా? పాలకూరలో విటమిన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, పొటాషియంతో పాటు ఆక్జలేటు అధికంగా ఉంటుంది. టమోటాల్లోనూ దాదాపు ఇవే ఉంటాయి. రెండింటినీ కలిపి వండటం వల్ల ఐరన్, కాల్షియం లవణాలతో కలిసి ఐరన్ ఆక్జలేటు, కాల్షియం ఆక్జలేటు ఏర్పడుతుందట.
ఇక కిడ్నీల్లో రాళ్లు అనేవి కాల్షియం సిట్రెట్లు, కాల్షియం ఫాస్పేట్లు, కాల్షియం ఆక్జలేట్లు. రక్తం, మూత్రంలో నీటి శాతం తగ్గినపుడు రసాయనికంగా ఆక్జలేట్ల పరిమాణం, ఫాస్పేట్ల పరిమాణం పెరిగిపోయి రాళ్లుగా మారుతాయి. అయితే పరిమితస్థాయిలో పాలకూర టమాటాలను కలిపి తిన్నంత మాత్రాన కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవని, రోజూ నీళ్లు అధికంగా తీసుకునే వారిలో ఈ ప్రమాదం ఉండదని వైద్యులు చెప్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చలిలో 'నడక' ఆరోగ్యానికి మంచిదేనా? - నిపుణులు ఏమంటున్నారంటే!
బ్లాక్ కాఫీ 'గుండె'కు మంచిదేనా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

