ETV Bharat / state

జూన్‌ 9న గ్రూప్1 ప్రిలిమ్స్ - 1వ తేదీ నుంచి వెబ్‌సైట్​లో హాల్‌టికెట్లు - అభ్యర్థులకు సూచనలివే - TS GROUP 1 PRELIMS HALLTICKETS 2024

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 8:14 AM IST

TSPSC Group 1 Prelims Exam Arrangements : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్​ - 1 ప్రిలిమ్స్​ పరీక్షకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్​ 9న జరిగే ఈ పరీక్షకు 4.03 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్ష కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు బాధ్యతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో, టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. జూన్‌ 1 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

Officals Meeting on Group 1 Prelims Exam
TGPSC Group 1 Prelims Exam Arrangements (ETV Bharat)

TSPSC Group 1 Prelims Exam Arrangements : రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ (ఇంతకుముందు టీఎస్‌పీఎస్సీ) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్‌ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. షెడ్యూల్​ ప్రకారం వచ్చే నెల 1 నుంచి హాల్‌టికెట్లు వెబ్​సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ పరీక్ష ఒక్కరోజులోనే పూర్తి చేసేందుకు ఓఎంఆర్​ పద్దతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

TSPSC Group 1 Prelims : 2022లో ఇచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కమిషన్‌ 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త ప్రకటనను జారీ చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్లో అప్లికేషన్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పించింది. పరీక్ష కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు తదితర బాధ్యతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో, టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాలతో ప్రిలిమ్స్‌ రద్దయింది. ఈ నేపథ్యంలో ఈసారి పరీక్షలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

గ్రూప్‌-1 అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌ - ప్రిలిమ్స్ పరీక్షపై TSPSC కీలక అప్‌డేట్‌ - TS Group 1 Prelims by OMR Method

TSPSC Prelims Exam Date : ప్రిలిమ్స్‌ను ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇస్తూ వెబ్‌ నోట్‌ జారీ చేసింది. గ్రూప్‌-1 నియామకాలను షెడ్యూలు ప్రకారం పూర్తి చేసేందుకు టీజీపీఎస్సీ ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసింది. ఫిబ్రవరిలో ఉద్యోగ ప్రకటన జారీ చేసిన వెంటనే జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రధాన పరీక్షలు అక్టోబరు 21న ప్రారంభమవుతాయని తెలిపింది. దీంతో ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రధాన పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యేందుకు వీలు కలుగుతుంది. ప్రధాన పరీక్షలు మొత్తం 7 పేపర్లలో జరుగుతాయి. ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థులను జోన్లవారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు.

TGSPSC Group 1 Prelims Guidelines : ప్రిలిమ్స్‌ రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేస్తూ టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ వెబ్‌నోట్‌ జారీ చేశారు. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్‌ పత్రాలు అందజేస్తామని వెల్లడించింది. పరీక్ష సమయంలో ఫొటో బయోమెట్రిక్​, వేలిముద్ర తప్పనిసరిగా ఇవ్వాలని, అలా ఇవ్వలేని వారిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ బయోమెట్రిక్‌ను నియామక ప్రక్రియ వివిధ దశల్లో వివరాలు సేకరిస్తామని తెలిపింది.

  • అభ్యర్థులకు పరీక్ష రోజు హాల్‌టికెట్‌ నంబరు, ఫొటో, పేరు, తండ్రి, తల్లి పేర్లు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, జెండర్‌ వివరాలను ముద్రించిన ఓఎంఆర్‌ జవాబుపత్రం అందిస్తారు. ఇందులో తప్పులుంటే వెంటనే ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకెళ్లాలి.
  • పరీక్ష రాసేముందు ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ నంబరు ఓఎంఆర్‌ షీట్‌లో నమోదు చేసి, సర్కిళ్లను జాగ్రత్తగా బబుల్‌ చేయాలి. జవాబుపత్రంలో పేర్కొన్నచోట అభ్యర్థి, ఇన్విజిలేటర్‌ సంతకం చేయాలి. జవాబులు గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్‌ పెన్ను ఉపయోగించాలి.
  • పరీక్ష పూర్తయిన తరువాత జవాబు పత్రాలను స్కానింగ్‌ చేసి, అభ్యర్థుల డిజిటల్‌ కాపీలు వెబ్‌సైట్లో పొందుపరుస్తారు. ప్రశ్నపత్రంలో ఇంగ్లిష్‌ పదాలు, వ్యాక్యాల అర్థం తెలుగులో సరిగా అనువాదం కాకుంటే ఇంగ్లిష్‌ వర్షన్‌ కాపీని పరిగణనలోకి తీసుకుంటారు.
  • సమాధానాలు గుర్తించేందుకు, పొరపాట్లు జరగకుండా ప్రాక్టీస్‌ చేసేందుకు నమూనా ఓఎంఆర్‌ పత్రాన్ని కమిషన్‌ వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఓఎంఆర్‌లో అభ్యర్థి వివరాలు సరిగా బబుల్‌ చేయకుంటే ఆ జవాబు పత్రాన్ని తిరస్కరిస్తామని కమిషన్‌ తెలిపింది.
  • హాల్‌టికెట్‌తో పాటు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (పాస్‌పోర్టు, పాన్‌ కార్డు, ఓటర్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు) ఒరిజినల్‌ తీసుకురావాలి.
  • పరీక్షకేంద్రం ఎక్కడుందో ఒకరోజు ముందుగా చూసుకోవాలి. పరీక్షకేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రం గేట్లు పది గంటలకు మూసివేస్తారు. ఆ తరువాత కేంద్రంలోకి ఎవరినీ అనుమతించరు.
  • అభ్యర్థులు చేతులపై గోరింటాకు, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సంక్షిప్త పేరు టీఎస్‌పీఎస్సీ నుంచి టీజీపీఎస్సీగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయకున్నా, అభ్యర్థులకు సూచనలిస్తూ కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ జారీ చేసిన వెబ్​నోట్‌లో టీజీపీఎస్సీగా పేర్కొన్నారు.

జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్​ పరీక్ష - టీఎస్​పీఎస్సీ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.