ETV Bharat / state

ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ - సీట్ల సర్దుబాటుపై కుదిరిన అవగాహన

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 8:27 AM IST

Updated : Mar 9, 2024, 12:31 PM IST

BJP- TDP- Janasena Focus on Elections
TDP Janasena BJP Alliance Confirmed

TDP Janasena BJP Alliance Confirmed : అమిత్‌షాతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ మరోసారి నేడు భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో చంద్రబాబు, పవన్‌ సమావేశమై ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని బీజేపీ ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి సైతం టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది.

TDP Janasena BJP Alliance Confirmed : రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం సహకారం అవసరమని భావిస్తున్న టీడీపీ, ఎన్టీఏలోకి చేరింది. నేడు అమిత్‌షా నివాసంలో చంద్రబాబు, పవన్ మరోసారి సమావేశం అయ్యారు. ఈ మేరకు ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని బీజేపీ పెద్దలు ఆహ్వానించారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సైతం 3 పార్టీలకు అవగాహన కుదిరింది. సీట్ల సర్దుబాటుపై ఎలాంటి ప్రతిష్టంభన లేదని తెలుస్తోంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకుగాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. గురువారం రాత్రి కూడా అమిత్‌ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు(Chandrababu Naidu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చర్చలు జరిపారు.

పొత్తుల విషయంలో ఆలస్యమైనందున మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని, విజయావకాశాల ఆధారంగా ముందుకెళ్లాలని మూడు పక్షాలు నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ, దాన్ని సాధించడానికి ఎన్డీయే పూర్వ మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశానికి ఆహ్వానం అందడంతో చంద్రబాబు ఈ అవకాశాన్ని ఏపీ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

ఎన్డీఏలోకి చంద్రబాబు - ఏపీలో టీడీపీ, జనసేన కూటమితో జట్టుకట్టిన బీజేపీ!

ముందుచూపుతో ముందడుగు : అయిదేళ్లలో మిగిలిన రాష్ట్రాలన్నీ ముందుకెళ్తుంటే ఏపీ ఒక్కటే వెనక్కుపోయే పరిస్థితి ఉందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం నెగ్గి అధికారపగ్గాలు చేపట్టినా కేంద్ర సాయం లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం సాధ్యం కాదని, ముందుచూపుతోనే కలిసి పనిచేయడానికి చంద్రబాబు అడుగు ముందుకేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తొలి అయిదేళ్లలో చంద్రబాబు చొరవ తీసుకొని విభజన చట్టంలో చెప్పిన ఐఐటీ, ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం(Tribal University), కేంద్ర విశ్వవిద్యాలయం, ట్రిపుల్‌ ఐటీ, ఎయిమ్స్‌లకు భూములు కేటాయించారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయడం వల్ల చకచకా నిర్మాణాలు జరిగినట్లు తెలుగుదేశం వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని సిమెంటు రోడ్లు నిర్మించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. పోలవరం(Polavaram Project) కూడా 70 శాతం గత ప్రభుత్వ హయాంలోనే పూర్తైందని పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకునే పాలనానుభవం చంద్రబాబుకు ఉన్నందున, ఇప్పుడూ కేంద్రంతో కలిసి పనిచేయడం వల్ల ఏపీకి మేలు జరుగుతుందనే భావనలో ఉన్నట్లు తెలుగుదేశం వర్గాలు పేర్కొన్నాయి.

అభివృద్ధి కోసం : బీజేపీ కూడా గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమైనట్లు చెబుతున్నాయి. ఇదివరకు వాజ్‌పేయీ హయాంలో కానీ గత మోదీ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తప్పితే, ఎప్పుడూ వ్యక్తిగతంగా ఏదీ కోరలేదని, ఆ విషయం బీజేపీ అగ్రనేతలకూ తెలుసు. అందుకే 2018లో ఎన్డీయే(NDA) నుంచి వైదొలిగినప్పటికీ మళ్లీ కలిసి పనిచేద్దామని ఆహ్వానించినట్లు ఉదహరిస్తున్నాయి.

ఇదేందయ్యా ఇది!! - ఊళ్లో నిద్రపోవడం లేదని 600 మంది ఓట్లు తొలగింపు

భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా : ప్రధాని మోదీ(PM Narendra Modi) తాను మూడోసారి అధికారం చేపడతాననే ధీమాతో దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని సంకల్పించుకొని నీతీశ్‌ కుమార్ లాంటి పాతమిత్రులను కలుపుకెళ్లాలని నిర్ణయించారని, అందుకే చంద్రబాబునూ ఆహ్వానించినట్లు కనిపిస్తోందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే అయిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో మూడో స్థానానికి తీసుకెళ్లాలని నిర్ణయించినందున ప్రధానమంత్రి మోదీ మౌలిక వసతులు, సంస్కరణలకు విస్తృత ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని, వాటిపై చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉన్నందున దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా ఈ అవకాశాలను ఉపయోగించుకొని, ఏపీకి ప్రయోజనం చేకూర్చేందుకు అవకాశముందని పార్టీ నేతలు తెలిపారు.

టీడీపీ జనసేన బీజేపీ పొత్తు : మూడు పక్షాల నేతలూ ఆంధ్రప్రదేశ్ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఎవరూ సీట్ల సంఖ్యకు కాకుండా రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చేలా చర్చించినట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో అందరూ మనసు విప్పి మాట్లాడుకున్నట్లు పేర్కొంటున్నారు. అందుకే జనసేన(Jana Sena) ఇదివరకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిపి కుదిరిన 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో ఒక సీటు అటూ ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

బహుశా బీజేపీ ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీచేయొచ్చని చెబుతున్నారు. అసెంబ్లీ సీట్ల విషయంలోనూ ఆ రెండు పార్టీల మధ్య ఒకటి అటూఇటుగా సర్దుబాటు జరగవచ్చని తెలుస్తోంది. 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలపై 3 పార్టీలూ అవగాహనకు వచ్చినందున, ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

TDP- Janasena With BJP : ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి మూడు పార్టీల అగ్రనేతలు శుక్రవారం మరోసారి భేటీకావాలనుకున్నా అమిత్‌ షా (Amit Shah), జేపీ నడ్డాలకున్న (JP Nadda) ముందస్తు కార్యక్రమాల వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. శనివారం ఉదయం11 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇతర అన్ని అంశాలపై పూర్తి ఒప్పందం చేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ పొత్తులపై 3 పార్టీల వారెవ్వరూ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా నేడు జరిగిన భేటీతో ఒక క్లారిటీ వచ్చింది. దీంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ ఇమేజ్‌ను జగన్‌ దారుణంగా దెబ్బతీశారనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. అందువల్ల కేంద్ర సహకారంతోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలమని భావిస్తున్నారు. తెలుగుదేశం హయాంలో మూడు కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించి అందులో కర్నూలును పూర్తిచేసినా, అయిదేళ్లలో విశాఖపట్నం, దగదర్తి విమానాశ్రయాలను జగన్‌ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. రాష్ట్రం కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే వారు ప్రాధాన్యమివ్వడం వల్ల ఇలాంటి పనులు చేయలేకపోయారన్నది టీడీపీ భావన.

TDP JanaSena BJP Focus on Elections : ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలే తమకు అధిక ప్రాధాన్యమంటున్న తెలుగుదేశం కేంద్ర సాయంతో ఇలాంటి విమానాశ్రయాలను పూర్తిచేయడం సులభమని భావిస్తోంది. కేంద్రం ప్రస్తుతం ప్రకటించిన సెమీకండక్టర్‌ లాంటి యూనిట్లతో పాటు భవిష్యత్తులో ప్రకటించే కొత్త పథకాల ప్రయోజనాలనూ అందిపుచ్చుకోవడానికి పొత్తు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ప్రధాని మోదీ(PM Modi) ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రనేతగా గుర్తింపు పొంది, దేశంలోకి విస్తృత స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్నందున కేంద్రంతో కలిసి పనిచేయడం ద్వారా ఈ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్‌కూ తీసుకురావడం సాధ్యమవుతుందని చంద్రబాబు ఆశిస్తున్నట్లు తెలిసింది. కేంద్రం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోసం 10వేల కోట్లతో కొత్త పథకం ప్రవేశపెట్టినందున ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కేంద్ర సాయం దోహదం చేస్తుందని, దాని వల్ల రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఎంపీ టికెట్ విషయంలోనే వివేకాను సీఎం జగన్‌ చంపించారు : దస్తగిరి

బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ - 10 అంశాలతో టీడీపీ-జనసేన 'బీసీ డిక్లరేషన్'

Last Updated :Mar 9, 2024, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.