ETV Bharat / state

23 ఏళ్లకే లస్సీ డే కేఫ్ వ్యాపారం- యశ్వంత్ సక్సెస్ జర్నీ సాగిందిలా

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 3, 2024, 2:47 PM IST

Lassi Day Cafe Success Story : చిన్నతనంలో తన తండ్రి చెప్పిన మాటలు ఆ యువకుడిలో ఎంతో ప్రేరణ కలిగించాయి. పది మందికి ఉపాధి కల్పించాలన్న మాటలు ఆలోచింపజేశాయి. ఎనాటికైనా గొప్ప వ్యాపారవేత్త కావాలని నిర్ణయించుకున్నాడు. తన ద్వారా పలువురికి ఉద్యోగ కల్పన జరగాలన్న ఆశయంతో పెరిగాడు. 23 సంవత్సరాల వయసులోనే ఆహార పానీయాల రంగంలో ఆడుగుపెట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన పదార్థాలు ఉత్పత్తి చేస్తున్నాడు. అందరూ బావుండాలి అందులో నేను ఉండాలనే సద్గుణంతో వందల మందికి ఉపాధి కల్పిస్తున్న ఆ యువ వ్యాపారవేత్త గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Inspirational Story of Lassi Day Cafe Yashwanth
Lassi Day Cafe Success Story

23 ఏళ్లకే లస్సీ డే కేఫ్ వ్యాపారం- యశ్వంత్ సక్సెస్ జర్నీ సాగిందిలా

Lassi Day Cafe Success Story : సాధారణ రైతు కుటుంబం వారిది ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల్ని మాత్రం ఉన్నత చదువులు చదివించారు ఆ తల్లిదండ్రులు. వారి కష్టానికి తగిన ప్రతిఫలంగా ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ ఈ యువకుడికి మాత్రం వ్యాపారం పైనే ఆసక్తి. ఉద్యోగంతో కుటుంబం మాత్రమే సంతోషంగా ఉంటుందని ఇతరులూ జీవనోపాధి పొందడానికి ఏదైనా చేయాలని కంకణం కట్టుకున్నాడు. వ్యాపారం లాభాపేక్షతో చేసేది కాదని ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగాడు.ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రం గ్రామానికి చెందిన యశ్వంత్‌.

ఇంజినీరింగ్‌, ఎంబీఏ పూర్తి చేశాడు. పలు సంస్థల్లో ఉద్యోగావకాశాలు వచ్చినా వాటివైపు మొగ్గు చూపలేదు. చివరికి వ్యాపారం పైనే దృష్టి సారించి 2018లో లస్సీ డే, బర్గర్‌ పావ్‌ కేంద్రం ప్రారంభించాడు. రెండేళ్లకు వ్యాపారం పుంజుకున్నా కరోనా తాకిడితో ఇక్కట్లు తప్పలేదు. అలా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ నష్టాల బాటలో ఉన్న సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నాడు.

'ఇంజినీర్లు, డాక్టర్లు చాలా ఉన్నారులే నాన్న - నేను కళారంగం వైపు అడుగేస్తా'

Inspirational Story of Lassi Day Cafe Yashwanth : మనం నష్టపోయినా పర్వాలేదు పది మందికి ఉపాధి దొరికితే చాలు జీవితం సార్ధకమైనట్లేనని తండ్రి చెప్పిన మాటలు తన మెదడులో నాటుకుపోయాయి. నిరుద్యోగులైన వాళ్లకు ఉద్యోగం, ఉపాధి కల్పించాలనే రతన్‌ టాటా వ్యాఖ్యలు ఆలోచింపజేశాయి. తండ్రి మాటలు, రతన్‌టాటా సూక్తులు ఒంటబట్టించుకున్న యశ్వంత్‌ తన అడుగులు కూడా అటువైపే వేయాలని భావించాడు. పట్టణంలో కొత్త బ్రాండ్‌తో లస్సీ స్టాల్ పెడితే నష్టపోతావని స్నేహితులు సూచించినా యశ్వంత్ మాత్రం మొండి ధైర్యంతో ముందుకు సాగాడు.

సామాన్యులకి అందుబాటులో ఉండేలా రూ. 25 నుంచి రూ.100 రూపాయల మధ్యలో ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చాడు. 2018లో వ్యాపారాన్ని ప్రారంభించి అనతికాలంలోనే లస్సీతో పాటు అమెరికా, భారత్‌లో తయారైన పదార్థాలతో బర్గర్‌ పావ్‌ ప్రారంభించాడు. చక్కగా చదివి ఉద్యోగం చేయాల్సిన వ్యక్తి ఇలా మజ్జిగ, పెరుగు, పాలు విక్రయిస్తున్నాడేంటని అందరూ నవ్వుకున్నావారే నేడు యశ్వంత్‌ కృషి, పట్టుదలను చూసి ఆశ్చర్యపోతున్నారు. దేశంలో 18 రాష్ట్రాల్లో 150కిపైగా లస్సీ డే, బర్గర్‌ పావ్‌ కేంద్రాలను తెరిచి ఏడాదికి సుమారు రూ. 3 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్‌ చేస్తున్నాడు. వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

22ఏళ్ల వయసులోనే లస్సీ డే కేఫ్ ప్రారంభించి కస్టమర్లను ఆకట్టుకుంటుకోవడంలో విజయంతమయ్యాడు యశ్వంత్‌. తోటి వ్యాపారులు యశ్వంత్‌ను దెబ్బతీయాలని ఎన్నో కూయుక్తులు పన్నారు. నెగిటివ్ ప్రచారం చేస్తూ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేసినా అవేమీ ఈ యువకుడి కసి, పట్టుదలను ఆపలేకపోయాయి. తన వ్యాపారం గురించి క్రమంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటూ వ్యాపారాన్ని ఇంత వరకు తీసుకురాగలిగానని చెబుతున్నాడు యశ్వంత్‌.

కేవలం లస్సీ మాత్రమే కాకుండా బర్గర్‌ పావ్ పేరుతోనూ స్నాక్స్‌ విక్రయించేలా ఏర్పాట్లు చేశాడు యశ్వంత్‌. ఇతర కేఫ్‌లతో పోలిస్తే ధరలు తక్కువగా ఉండటంతో పాటు రుచి, నాణ్యత ఉండటంతో కస్టమర్లను ఆకట్టుకోగలిగాడు. బయటి రేట్ల కంటే ఇక్కడ సరసమైన ధరలతో క్వాలిటీ ఫుడ్‌ దొరుకుతుందని చెబుతున్నారు వినియోగదారులు. వ్యాపారంలోకి రావాలనుకునే యువత ఎలాంటి వెనకడుగు వేయొద్దని యశ్వంత్ సూచిస్తున్నాడు. మన ఎదుగుదలని చూసి ఓర్వలేని వారు ఎప్పుడు మనల్ని వెనక్కి లాగేడానికే చూస్తారని యువత అక్కడే ఆగిపోవద్దంటున్నాడు యశ్వంత్‌.

ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికై అమ్మనాన్నల కలను నిజం చేసిన సూర్యాపేట యువకుడు

4 ప్రభుత్వ ఉద్యోగాలను ఒడిసిపట్టిన వరంగల్​ కుర్రాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.