ETV Bharat / state

ఏపీలో బంగారు నిల్వలు - ఏ ప్రాంతంలో ఉన్నాయో తెలుసా? - Gold Production in Andhra Pradesh

author img

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 10:04 AM IST

Gold Production in Andhra Pradesh : రాష్ట్ర ప్రజలకు బంగారంలాంటి కబురు అందింది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ ఏడాది చివరినాటికి తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్లాంట్​లో కార్యకలాపాలు మొదలైతే ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారం వెలికి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Gold Production in Andhra Pradesh
Gold Production in Andhra Pradesh (ETV Bharat)

Gold Mines at Kurnool in Andhra Pradesh : ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, జొన్నగిరి ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. చాలా ఏళ్ల అన్వేషణ తర్వాత ఈ ప్రాంతంలోని 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. దక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ (డీజీఎంఎల్‌) అనే కంపెనీకి అనుబంధ సంస్థ అయిన జెమైసోర్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ తవ్వకాలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. బంగారం గనిలో ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ఉత్పత్తి మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

మన దేశంలో ప్రైవేటు రంగంలో తొలి బంగారం గని ఇదే కావడం ప్రత్యేకత. దీని కోసం ఇప్పటికే 250 ఎకరాలకు పైగా భూమిని సేకరించడంతో పాటు ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ పనులు దాదాపు 60% పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రయోగాత్మక కార్యకలాపాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ ప్లాంట్‌ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగితే ఏటా 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు ఈ గనిపై రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు దక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ గతంలో వెల్లడించింది.

ఇతర జిల్లాల్లోనూ : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ కొన్ని బంగారం గనులను గుర్తించి, అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ ఆసక్తిగా ఉంది. కొంతకాలం క్రితం ఈ గనులను తమకు అప్పగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్‌ఎండీసీ కోరింది. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. జొన్నగిరి గనులతో పాటు, ఈ గనులు కూడా అభివృద్ధి చేసిన పక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు బంగారం గనులు రాష్ట్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది.

బంగారంపై ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-3 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి! - Gold Investment Tips For Women

ఆఫ్రికాలో లిథియమ్‌ గనులు : దక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ మన దేశంలో వివిధ ప్రాంతాల్లో గనులు నిర్వహిస్తోంది. ఈ సంస్థ తాజాగా ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో లిథియమ్‌ గనులు కొనుగోలు చేసింది. దీని కోసం మాగ్నిఫికా గ్రూప్‌ ఆఫ్‌ మొజాంబిక్‌తో కలిసి దక్కన్‌ గోల్డ్‌ మొజాంబిక్‌ ఎల్‌డీఏ అనే జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేసింది. ఇందులో దక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌కు 51% వాటా ఉంటుంది. భవిష్యత్తులో ఈ వాటాను 70 శాతానికి పెంచుకునే అవకాశం ఉంది. రోజుకు 100 టన్నుల లిథియమ్‌, టాంటలమ్‌, ఇతర ఖనిజాలను ప్రాసెస్‌ చేసే సామర్థ్యం కల ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు.

బంగారం గనుల కోసం పోటీ: రాజస్థాన్‌లో 2 బంగారం గనుల కోసం అగ్రశ్రేణి సంస్థలు పోటీ పడుతున్నాయి. వేదాంతా గ్రూపు సంస్థ అయిన హిందూస్థాన్‌ జింక్‌, జిందాల్‌ పవర్‌, జేకే సిమెంట్‌ ఇందులో ఉన్నాయి. రాజస్థాన్‌లోని కంక్రియా గారా గోల్డ్‌ బ్లాక్‌, భూకియా-జగ్‌పురా గోల్డ్‌ బ్లాక్‌లను రాజస్థాన్‌ ప్రభుత్వ గనుల శాఖ వేలం వేస్తోంది.

వామ్మో బంగారం ధర మరీ ఇంతనా? - ఇలా అయితే కొనడం గగనమే సుమీ!! - Gold Rates High In Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.