ETV Bharat / sports

డబ్ల్యూపీఎల్​ 2024 : ఒకే ఒక్క సిక్సర్​తో దూసుకొచ్చిన ఆటోవాలా కూతురు!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 7:31 AM IST

wpl 2024 mumbai indians Sajeevan sajana family background details
డబ్ల్యూపీఎల్​ 2024 : ఒకే ఒక్క సిక్సర్​తో దూసుకొచ్చిన ఆటోవాలా కూతురు!

WPL 2024 Mumbai Indians Sajeevan Sajana : సజీవన్‌ సజన ప్రస్తుతం ఈ పేరు మార్మోగిపోతుంది. డబ్ల్యూపీఎల్​ సీజన్‌ - 2 తాను ఆడిన తొలి మ్యాచ్​లో ఒకే ఒక్క సిక్సర్​తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె గురించే ఈ కథనం.

WPL 2024 Mumbai Indians Sajeevan Sajana : సజీవన్‌ సజన - మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్​) సీజన్‌-2 ప్రారంభం అయ్యే వరకు ఎవరికీ ఈ పేరు తెలీదు. అయితే ఇప్పుడు ఆడింది ఆమె ఒకే బంతి అయినా ఒకే ఒక్క సిక్సర్​తో తన పేరు మార్మోగేలా చేసింది. ముంబయి ఇండియన్స్‌ - దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన డబ్ల్యూపీఎల్‌ తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్సర్‌ బాది దిల్లీని కంగుతినిపించింది సజన. దీంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది.

నాన్న ఆటోవాలా : కేరళకు చెందిన యువతి సజన. ఈమె వయసు 29 ఏళ్లు. పేద కుటుంబం ఈమెది. నాన్న సజీవన్‌ ఆటో నడిపితేనే ఇల్లు గడిచేది. అయితే సజనకు క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌, ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ఎంట్రీ ఉంది. వాయనాడ్‌ జిల్లా ఫుట్‌బాల్‌ జట్టుకు సారథిగా వ్యవహరించింది. అయితే క్రికెట్‌ అంటే ఆమెకు ఎక్కువ ఇష్టం. ఇంటి దగ్గర పొలంలో కొబ్బరి మట్టనే బ్యాట్‌గా మలుచుకుని ఆడేది. అలా ఆమె ఆసక్తిని గుర్తించాడు ఆటోవాలా తన నాన్న. ఆమెను ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. పాఠశాల పీఈటీ ఎల్సమ్మ కూడా ఈమెను ప్రోత్సాహించింది.

మలుపు తిరిగింది : కృష్ణగిరి స్టేడియంలో ఒకరోజు భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ను కలిసే అవకాశం సజనకు వచ్చింది. ఇది ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అతడిచ్చిన స్ఫూర్తితో పట్టుదలగా ఆడడం మొదలుపెట్టింది. వాయనాడ్‌ జిల్లాకు అండర్‌-19లో ప్రాతినిథ్యం వహించి - స్థిరంగా ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. మొదట్లో రోజుకు రూ.150 జీతం వస్తేనే గొప్పగా భావించిన ఆమె ఆ తర్వాత క్రికెట్లో కేరళ అండర్‌-19 కెప్టెన్​గా ఎదిగింది. బలంగా పొడవుగా ఉండే ఈమె హిట్టర్‌గా పేరు సంపాదించుకుంది. ఆఫ్‌ స్పిన్నర్‌గానూ రాణించింది.

ఎన్నో కష్టాలు ఆపై వేలంలో రూ.15 లక్షలు : 2018 వరదల కారణంగా ఆమె కుటుంబం బాగా నష్టపోయింది. దీంతో సజన క్రికెట్‌కు చాలా కాలం దూరమైపోయింది. ఆ తర్వాత కరోనా సమయంలోనూ బ్యాట్ పట్టలేదు. అనంతరం దేశవాళీ పోటీల్లో అదరగొట్టింది. 2022 నవంబర్‌లో భారత్‌-ఏకు సెలెక్ట్ అయింది. 2023 డబ్ల్యూపీఎల్‌ మొదటి సీజన్​లో అవకాశం కోసం ప్రయత్నించినా కుదరలేదు. కానీ దేశవాళీలో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అదరగొట్టడంతో డబ్ల్యూపీఎల్‌ సీజన్‌-2 వేలంలో ముంబయి ఇండియన్స్‌ రూ.15 లక్షలు పెట్టి మరీ సొంతం చేసుకుంది. అలా సజన ఇప్పుడు తన తొలి మ్యాచ్‌లోనే ముంబయి నమ్మకాన్ని నిలబెట్టింది. ఇప్పుడు టీమ్ ఇండియాకు ఆడాలనేది ఈమె కల. ఈ ఆల్‌రౌండర్​కు ఉమెన్‌ కీరన్‌ పొలార్డ్‌ అనే పేరు పెట్టారు. ఎందుకంటే పొలార్డ్‌ లాగే బంతిని బలంగా బాదగల టాలెంట్​ సజనది. ఈమె పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ చేసింది. ఓ తమిళ చిత్రంలోనూ నటించింది.

గ్రాండ్​గా WPL ప్రారంభం- స్పెషల్ అట్రాక్షన్​గా బాలీవుడ్ స్టార్స్​ పెర్ఫార్మెన్స్​

బెంగళూరు బోణీ- 5 వికెట్లతో మెరిసిన శోభన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.