ETV Bharat / politics

కాంగ్రెస్‌కు కలిసి రానున్న ఎన్నికల పరిణామాలు - హస్తం పార్టీలో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా తనయుడు - Gutta Amith Reddy In Congress

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 8:37 PM IST

Gutta Amith In Congress
Gutta Amith Joined in Congress

Gutta Amith Joined in Congress : లోక్‌సభ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు అధికార కాంగ్రెస్‌కు పెద్దలసభలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు మార్గం సుగమమం చేశాయని చెప్పుకోవచ్చు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి హస్తం పార్టీలో చేరడమే కారణం. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ తరపున పోటీచేసేందుకు సిద్ధమైన అమిత్‌, మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయనున్నారు. ఆ పరిణామాలతో తక్కువ మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్‌కు, మండలిలో బీఆర్​ఎస్​ను ఎదుర్కోవడం కొంత సులువు కానుంది.

కాంగ్రెస్‌కు కలిసి రానున్న ఎన్నికల పరిణామాలు - హస్తం పార్టీలో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు

Gutta Amith In Congress : అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్‌కు, పెద్దల సభ సవాల్‌గా మారింది. మండలిలో బీఆర్​ఎస్​కు మెజార్టీ సభ్యులు ఉండటంతో కాంగ్రెస్‌కు కేవలం అత్తెసరు మంది ఉన్నారు. ఉప ఎన్నికల ద్వారా వచ్చిన ఇద్దరు ఎమ్మెల్సీలను కలిపితే, మండలిలో ఆ పార్టీ బలం మూడు మాత్రమే. బీఆర్​ఎస్​కు చెందిన దామోదర్‌రెడ్డి, మహేందర్ రెడ్డి కలిపితే ఆ సంఖ్య ఐదుకి చేరింది. అయితే ఆ ఇద్దరిపై ఇప్పటికే గులాబీ పార్టీ అనర్హతా పిటిషన్ దాఖలు చేసింది.

బీఆర్​ఎస్​కు పెద్దల సభలో 28 మంది సభ్యులున్నారు. అందులో ఇద్దరు హస్తం పార్టీ వైపు వెళ్లారు. నామినేటెడ్ కోటాలో రెండు, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థలో కోటా ఒకటి, వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల స్థానం, మొత్తం 4 ఖాళీలున్నాయి. తొలి సమావేశాల్లో కొంతమేర ఆ దిశగా సంకేతాలు వెలువడ్డాయి. గవర్నర్ ప్రసంగానికి సవరణలు చేయాలంటూ బీఆర్​ఎస్​ సవరణ తీర్మానాన్ని ప్రతిపాదించింది. ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ తర్వాత ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చాక, ఆ విషయమై సభలో కొంతసేపు చర్చ జరిగింది.

కాంగ్రెస్‌కు కలిసొచ్చిన పరిణామాలు : తొలి సమావేశం కావడం వల్ల ప్రభుత్వానికి సహకరిస్తామన్న బీఆర్​ఎస్​ ఓటింగ్‌పై తీర్మానానికి పట్టుపట్టకపోవడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. మండలి, ఎమ్మెల్సీలని ఉద్దేశించి మీడియాలో సీఎం వ్యాఖ్యలపై హక్కుల ఉల్లంఘన కింద బీఆర్​ఎస్​ ఫిర్యాదు చేసింది. బీఆర్​ఎస్​ నుంచి ఎన్నికైన గుత్తా సుఖేందర్, బండాప్రకాశ్‌ మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌గా ఉండగా పెద్దల సభలో ఆ పార్టీని ఎదుర్కోవడం అధికార పక్షానికి కొంత ఇబ్బందికరమన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆ విషయాన్ని అధిగమించేందుకు వీలుగా కొందరు ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటారన్న వాదన వినిపించింది.

లోక్‌సభ ఎన్నికల వేళ జరిగిన పరిణామాలు కాంగ్రెస్‌కు కలసి వచ్చాయని చెప్పుకోవచ్చు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన కుమారుడిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని తొలుత భావించారు. అందుకనుగుణంగా బీఆర్​ఎస్​ నాయకత్వంతో చర్చలు జరిపారు. నల్గొండ లేదా భువనగిరిలో అవకాశమిస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. ఆనంతరం పరిణామాలతో లోక్‌సభ బరి నుంచి తప్పుకుంటున్నట్లు అమిత్‌రెడ్డి ప్రకటించారు.

ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్‌రెడ్డితో గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీ, పలువురు నేతలు గుత్తా నివాసానికి వెళ్లి అమిత్​రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత అమిత్‌రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అమిత్‌రెడ్డిని ఆహ్వానించిన సందర్భంలో కాంగ్రెస్ నేతలు, సుఖేందర్‌రెడ్డితో సమావేశమైనట్లు సమాచారం. అనంతరం ఇక నుంచి తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు.

బీఆర్​ఎస్​కు మరో షాక్ - కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్​ రెడ్డి - GUTHA AMIT REDDY JOINS CONGRESS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.