ETV Bharat / opinion

ముక్కోణపు పోరులో తమిళనాట గెలుపెవరిది? 2019 రిజల్ట్స్​ రిపీట్​ అవుతాయా? - Tamilnadu Election 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 8:45 AM IST

Tamilnadu Election 2024 : సార్వత్రిక ఎన్నికల సమరంలో విపక్ష ఇండియా కూటమి ఆశలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసిన ఇండియా కూటమి ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. పూర్వ వైభవం సాధించాలని అన్నాడీఎంకే, సత్తా చాటాలని బీజేపీ వ్యూహ రచన చేస్తున్నాయి. మరి తమిళనాట పార్టీల బలాబలాలు ఏంటి? మరోసారి 2019 ఫలితమే వస్తుందా? అన్నాడీఎంకేతో పొత్తు వీడిన బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపనుంది? ఈ కథనంలో చూద్దాం.

Tamil Nadu Political Map
Tamil Nadu Politics

Tamilnadu Election 2024 : 2019 సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే తమిళనాట పెను ప్రభంజనం సృష్టించింది. ఆ ఎన్నికల్లో తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో డీఎంకే కూటమి ఏకంగా 38 స్థానాలను కైవసం చేసుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డీఎంకే విజయదుందుభి మోగించింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల తొలి విడతలోనే తమిళనాడు, పుదుచ్చేరిలో అన్ని స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల ఫలితాన్నే పునరావృతం చేయాలని డీఎంకే పట్టుదలగా ఉంది. ఇప్పటికే మేనిఫెస్టోను, అభ్యర్థులను కూడా ప్రకటించింది.

డీఎంకేకు కలిసిరానున్న అంశాలు
విపక్ష ఇండియా కూటమిలో ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే కీలక భాగస్వామ్య పక్షంగా ఉంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అదే రోజున జరగనున్న ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పనకు భరోసా, పెట్టుబడుల ఆకర్షణ డీఎంకేకు కలిసిరానున్నాయి.

ముక్కుళతోర్ సామాజికవర్గానికి చెందిన పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేకు దూరంగా ఉండడం కూడా డీఎంకేకు వరంగా మారింది. పన్నీర్‌ సెల్వం పార్టీకి దూరంగా ఉండడం వల్ల ముఖ్యంగా దక్షిణాది జిల్లాల్లో అన్నాడీఎంకే బలం కొంతమేర తగ్గింది. పౌరసత్వ సవరణ చట్టం రద్దు, నీట్‌పై నిషేధం, ఉమ్మడి పౌరస్మృతిని తమిళనాడులో అమలు చేయబోమని చెప్పడం వంటి హామీలను డీఎంకే తాజాగా గుప్పించింది. బీజేపీ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న స్టాలిన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజాదరణ తగ్గకుండా చూసుకోవడంలో విజయం సాధించారు.

మాజీ సీఎంపై స్టాలిన్​ మండిపాటు
మరోవైపు సంస్థాగతంగానూ డీఎంకే చాలా బలంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో ప్రభంజనం సృష్టించిన డీఎంకే, అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే ఫలితాలు సాధించాలని చూస్తోంది. బీజేపీతో అన్నాడీఎంకే రహస్య పొత్తు పెట్టుకుందని డీఎంకే పదునైన విమర్శలు చేస్తోంది. సీఏఏకి మద్దతు పలికిన మాజీ సీఎం పళనిస్వామిపై స్టాలిన్‌ తీవ్రంగా మండిపడ్డారు.

కమల్​కు స్టాలిన్​ హామీ!
తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక స్థానం కలిపి మొత్తం 40 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థి తానేనని తనను చూసే ప్రజలు ఓట్లు వేయాలని స్టాలిన్ కోరారు. ఈ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 40 సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. డీఎంకే ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించింది. 2018లో మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీని స్థాపించిన కమల్ హాసన్ డీఎంకే కూటమి తరపున ప్రచారం చేయనున్నారు. 2025లో రాజ్యసభ సీటు ఇస్తామని స్టాలిన్​ కమల్‌హాసన్‌కు హామీ ఇచ్చారు.

అన్నాడీఎంకే ముఖచిత్రం!
మరోవైపు తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే కూడా ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవాలని పట్టుదలగా ఉంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిస్వామి 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. కుటుంబ, వారసత్వ పాలనకు డీఎంకే కేంద్రంగా మారిందని అన్నాడీఎంకే, బీజేపీ తరచుగా విమర్శిస్తున్నాయి.

డీఎంకే మంత్రులపై అవినీతి ఆరోపణలు ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది. కావేరి జల వివాదం కూడా డీఎంకేకు ప్రతికూలంగా మారింది. డీఎంకే హయాంలో కావేరి జలాల్లో తమిళనాడు న్యాయమైన హక్కులను పొందలేదని అన్నాడీఎంకే పదేపదే ఆరోపిస్తోంది. సంస్థాగతంగా కూడా పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే పశ్చిమ ప్రాంతాల్లో డీఎంకేపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎన్నికల హామీలపై డీఎంకేను లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు సంధిస్తోంది.

అన్నాడీఎంకేలో రెండు కీలక పరిణామాల తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులను పార్టీ నుంచి బహిష్కరించడం, ఇంకోటి బీజేపీతో సంబంధాలను తెంచుకోవడం. ఎంపీ సీట్లు గెలుచుకోవడం ద్వారా అన్నాడీఎంకేకు నిజమైన మాస్​ లీడర్ తానేనని నిరూపించుకోవాలని పళనిస్వామి ఆసక్తిగా ఉన్నారు.

బీజేపీ గేమ్​ ప్లాన్​!
ఇక భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుండటం వల్ల తమిళనాడులో ముక్కోణపు పోరు నెలకొంది. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన అన్నాడీఎంకే, బీజేపీ ఈసారి వేర్వేరుగా బరిలోకి దిగుతున్నాయి. తమిళనాడులో బీజేపీకి గత ఎన్నికల్లో సానుకూల ఫలితాలేవీ రాలేదు. ఈసారి మాత్రం ఆ ధోరణిని అధిగమించి చెప్పుకోదగ్గ స్థానాలు దక్కించుకోవాలని కమలం పార్టీ చూస్తోంది. ప్రత్యేకించి బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కొన్ని సీట్లు గెలుచుకుని ఓట్ల శాతాన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నారు.

ఆ ఇద్దరి నేతల సేవలు కీలకం!
తమిళనాట విజయం కోసం మురుగన్, తమిళిసై సేవలు వినియోగించుకోనుంది బీజేపీ. నా మట్టి నా ప్రజలు పేరుతో అన్నామలై ప్రచారం సాగుతోంది. ప్రధాని మోదీ ఈ ఏడాది ఇప్పటికే ఐదుసార్లు తమిళనాడులో పర్యటించారు. చెన్నై, తిరునెల్వేలి, కోయంబత్తూర్‌, తిరువూర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మురుగన్​ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అన్నాడీఎంకే నేతలు దివంగత జయలలిత, రామచంద్రన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే అధికార డీఎంకేను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మ మక్కల్​ మున్నేట్ర కజగం పార్టీ పన్నీర్‌సెల్వం నేతృత్వంలోని ఏఐఏడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ బీజేపీతో కలిసి ఉన్నాయి. దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ ఇంతవరకు తన వైఖరిని ప్రకటించలేదు.

తమిళనాట కాంగ్రెస్​కు ఊరట!
కాంగ్రెస్‌ మాత్రం డీఎంకేతో పొత్తుతోనే బరిలోకి దిగుతోంది. గత ఎన్నికల్లో తమిళనాడులో పోటీ చేసిన 9 సీట్లలో 8 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌ ఈసారి కూడా అవే ఫలితాలు రాబట్టాలని చూస్తోంది. ఇటీవల వెల్లడైన కొన్ని ఒపీనియన్‌ పోల్స్‌ తమిళనాడులో డీఎంకే సత్తా చాటుతుందని, బీజేపీ రెండంకెల ఓట్ల శాతంతో పాటు కొన్ని సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశాయి.

2024 లోక్​సభ పోల్స్​: ఎన్డీఏ Vs ఇండియా- మోదీ జోరును విపక్ష కూటమి ఆపేనా?

మోదీ గ్యారంటీ Vs కాంగ్రెస్ న్యాయ్ గ్యారెంటీ- 2024 యుద్ధం షురూ- టాప్ 10 ప్రచార అస్త్రాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.