ETV Bharat / opinion

2024 లోక్​సభ పోల్స్​: ఎన్డీఏ Vs ఇండియా- మోదీ జోరును విపక్ష కూటమి ఆపేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 3:37 PM IST

2024 Lok Sabha Poll NDA vs INDIA: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార బీజేపీ సహా ప్రధాన పార్టీలన్నీ అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అధికార ఎన్డీఏను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ఇండియా కూటమితో ముందుకెళ్తున్నాయి. మరి మోదీ జోరును విపక్ష కూటమి ఆపేనా?

2024 Lok Sabha Poll NDA vs INDIA
2024 Lok Sabha Poll NDA vs INDIA

2024 Lok Sabha Poll NDA vs INDIA: సార్వత్రిక ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్నాయి. రాజకీయ రణక్షేత్రంలో మోదీ దూసుకుపోతుండగా కాంగ్రెస్ ఇంకా బాలరిస్టాలను ఎదుర్కొంటోంది. మోదీ ఇప్పటికే ఒక దశ ప్రచారాన్ని కూడా పూర్తి చేసుకుంటుండగా కాంగ్రెస్ ఇంకా ప్రారంభించలేదు.

టార్గెట్ 400+ సీట్లు
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ నినాదం "ఫిర్ ఏక్‌బార్ మోదీ సర్కార్". ఆ నినాదానికి తగ్గట్టుగానే దేశ ప్రజలు మోదీ సర్కార్‌కి రెండోసారి పట్టం కట్టారు. ఇప్పుడు మూడోసారి మోదీ 400 పైగా సీట్లు గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. ఈ ఐదేళ్లలో మొత్తం దేశ రూపురేఖల్నే మార్చేశామని చాలా గట్టిగానే ప్రచారం చేసుకుంటోంది బీజేపీ. అంతే కాదు తాము 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని తేల్చి చెబుతోంది. వీటితో పాటూ ఎన్డీఏ (NDA) కూటమిలో అందరూ ఒకే మాట మీద ఉండటం ఒక పద్ధతిగా అభ్యర్ధులను ప్రకటించడం వంటివి కూడా బీజేపీకి అనుకూల అంశాలుగా మారాయి. 2019 ఎన్నికల్లో విడిపోయిన పార్టీలను మళ్లీ తమ కూటమిలో కలుపుకుంటూ ఎన్డీఏ మరింత బలపడింది. అమిత్ షా చాణక్యంతో, నడ్డా మార్గనిర్దేశం 400 స్థానాలే లక్ష్యంగా దూసుకుపోతోంది.

ఇండియా కూటమికి బీటలు!
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీ ఇప్పుడు ఉనికి కాపాడుకునేందుకే ఆపసోపాలు పడుతోంది. ఈ మధ్యే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచి బీజేపీ బలంగా లేని దక్షిణాదిలో కాస్తో కూస్తో నిలబడగిలింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్​ ఉంది హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రమే. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా ఇండియా (INDIA) పేరుతో జట్టు కట్టిన ప్రతిపక్ష పార్టీలు ఆ తర్వాత ఒక్కొక్కటిగా విడిపోతూ వచ్చాయి. కూటమిలో కీలకమైన నితీశ్ కుమార్ ఏకంగా బీజేపీతో చేతులు కలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు.

అటు మమతా బెనర్జీకి కూడా కాంగ్రెస్‌తో విభేదాలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్‌తో మాత్రమే సఖ్యతగా ఉంది కాంగ్రెస్ పార్టీ. దిల్లీ, పంజాబ్, హరియాణాల్లో సీట్‌ షేరింగ్‌ ఓ కొలిక్కి తెచ్చుకోగలిగింది. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తానికి పేరు గొప్పగా మొదలైన కూటమి చివరికి ముక్కలైపోయింది. అన్ని పార్టీలూ స్వలాభం చూసుకున్నాయి. మిత్ర పక్షాలతో సంబంధం లేకుండా అభ్యర్ధులను ప్రకటించుకున్నాయి. కాంగ్రెస్ కూడా సీట్‌ షేరింగ్ విషయంలో మొండి పట్టుదల వీడలేదన్న అభిప్రాయముంది.

మోదీ చరిష్మాతోనే
అధికార ఎన్డీఏను మోదీ చరిష్మా ముందుకు నడిపిస్తోంది. దీనితో పాటూ గత ఐదేళ్లలో ఎక్కడా అవినీతి దాఖలాలు పెద్దగా కనిపించకపోవడం బీజేపీ బలం. ఈ బలంతోనే ప్రతిసారీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు ప్రధాని మోదీ. గతంలో యూపీఏ (UPA) హయాంలో దేశం అంతా అవినీతిలో కూరుకుపోయిందని తేల్చి చెబుతున్నారు. పూర్తిగా అభివృద్ధి ప్రాజెక్ట్‌ల గురించే ప్రస్తావిస్తున్నారు. దీనికి తోడు 500 ఏళ్లుగా ఎన్నో న్యాయ చిక్కుల్ని దాటుకుని అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో కోట్లాది మంది హిందువుల కలని నెరవేర్చింది బీజేపీ.

రాహుల్ ఒక్కడే!
ఇటు కాంగ్రెస్ విషయానికి వస్తే పార్టీని ముందుండి నడిపించే వ్యక్తి రాహుల్ గాంధీ తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. ఆయనే పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు ప్రియాంక గాంధీ శ్రమిస్తున్నారు. కానీ, ఈ ప్లాన్‌లు ఏవీ పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ దాకా భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇది సాదాసీదాగా సాగిపోతున్న పార్టీలో ఒక్కసారిగా జోరు పెంచింది. క్యాడర్‌ను ఉత్తేజపరచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా చేసింది. అటు రాహుల్ చరిష్మా కూడా కొంత వరకూ పెరిగినట్టే కనిపించింది. మణిపుర్‌ అల్లర్ల విషయంలో రాహుల్ గట్టిగానే మాట్లాడారు. కానీ 2 గంటల స్పీచ్ లో మోదీ అదంతా సునాయాసంగా తిప్పి కొట్టేశారు. ఈశాన్య రాష్ట్రాలకు తమ ప్రాధాన్యత ఎప్పటికీ ఉంటుందని తేల్చి చెప్పారు. ఆ ప్రసంగంతో ఒక్కసారిగా కాంగ్రెస్ చల్లబడిపోయింది.

ఆ తర్వాత అదానీ వ్యవహారంలోనూ మోదీ ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. కానీ దాన్నీ ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయారు. ఒకానొక సమయంలో ప్రధాని మోదీ వరుసగా అభివృద్ధి ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తూ పర్యటనలు చేయగా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగించారు. కొన్నిచోట్ల నుంచి కాంగ్రెస్‌కు మద్దతు లభిస్తున్నప్పటికీ అది ఓట్ల రూపంలోకి మారుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే. పైగా ఈ సారి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలోనూ సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ పొత్తు లెక్కలు తేలకపోవడం వల్ల కాస్త తడబడింది. ఈ సారి ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సోనియా గాంధీ రాజ్యసభ తరపున ఎన్నికయ్యారు. ఆమెకి బదులుగా ప్రియాంక గాంధీ అమేఠీ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

సర్వేలన్నీ ఎన్డీఏ వేైపే!
ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని పలు మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఈ సర్వేల ప్రకారం రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) కీలక విజయం సాధించే దిశగా దూసుకుపోతోందని అంచనా. ఇది తమకు ఎదురు లేదని భావించే ఇండియా కూటమికి ఎదురుదెబ్బ . రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 300నుంచి 350 స్థానాలను కైవసం చేసుకుంటుందని సమాచారం. ఇతర NDA భాగస్వామ్యాలు 61 స్థానాలను కైవసం చేసుకుంటాయి. దీంతో కాంగ్రెస్ 49 సీట్లతో సహా దిగువ సభలో ఇండియా కూటమి కేవలం 105 సీట్లు మాత్రమే గెలుస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ ఈ అంచనాలు నిజమే అయితే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంటుంది!

నిరుద్యోగులే కాంగ్రెస్ టార్గెట్​​- రాహుల్​ 5హామీలపై హస్తం పార్టీ మెయిన్ ఫోకస్

కర్ణాటకపై BJP స్పెషల్ ఫోకస్​- మైసూర్​ యువరాజుకు టికెట్- 2019 సీన్​ రిపీట్​కు పక్కా ప్లాన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.