ETV Bharat / opinion

వారణాసి టు వయనాడ్​​- రసవత్తర పోరుకు అంతా రె'ఢీ'- లోక్‌సభ హాట్​ సీట్లు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 5:25 PM IST

Lok Sabha Key Seats 2024
Lok Sabha Key Seats 2024

Lok Sabha Key Seats 2024 : సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దేశంలోని కొన్ని లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల మధ్య హైఓల్టేజ్​ పోటీకి రంగం సిద్ధమైంది. ఇంకొన్ని సీట్లలో దేశంలోని ప్రఖ్యాత నేతలు బరిలో ఉండటం వల్ల అందరి చూపు వాటిపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి కేరళలోని వయనాడ్‌​ దాకా రసవత్తర పోటీకి నెలవుగా మారిన కొన్ని లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఆసక్తికర వివరాలను ఇప్పుడు చూద్దాం.

Lok Sabha Key Seats 2024 : 2024 లోక్‌సభ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో అన్నీ రాజకీయ పార్టీలు ఇక ప్రచార శంఖారావాన్ని మోగించనున్నాయి. ప్రముఖ నాయకులు సభలు, ర్యాలీలతో జనంతో మమేకం కానున్నారు. తమ తమ పార్టీల మ్యానిఫెస్టోలను వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నారు. ఇదిలా ఉంటే కొన్ని లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల మధ్య హైఓల్టేజ్ పోటీ జరిగేందుకు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని సీట్లలో దేశంలోని బడా నేతలు బరిలో ఉండటం వల్ల అందరి చూపు వాటిపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి కేరళలోని వయనాడ్​ దాకా రసవత్తర పోటీకి నెలవుగా మారిన కొన్ని లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వారణాసి
ఉత్తర్​ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తుండటం ఇది మూడోసారి. 2014లో ఈ స్థానం నుంచి మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ పోటీచేసి ఓడిపోయారు. 2019లో ప్రధాని మోదీపై సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు షాలినీ యాదవ్​ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అయితే ఇంతటి కీలకమైన స్థానానికి కాంగ్రెస్​ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రియాంకను ఏదైనా సేఫ్​ సీటు నుంచి బరిలోకి దింపడం మంచిదని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందుకే ఆమెను ఉత్తర్​ప్రదేశ్‌లోనే ఉన్న రాయ్​బరేలీ నుంచి పోటీకి దింపాలని నిర్ణయించింది. దీంతో ప్రధాని మోదీకి కనీసం బలమైన పోటీని ఇవ్వగల అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది. ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసి త్వరలోనే వారణాసి స్థానానికి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. 2019లో వారణాసి నుంచి కాంగ్రెస్​ తరఫున అజయ్​ రాయ్​ పోటీ చేశారు. 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ అభ్యర్థిని నిలిపింది. ప్రధాని మోదీ కంటే ముందు వారణాసి స్థానం నుంచి లోక్‌సభకు బీజేపీ దిగ్గజ నేత మురళీ మనోహర్​ జోషీ ఎన్నికయ్యారు.

వయనాడ్​
కేరళలోని వయనాడ్​ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ పోటీ చేస్తుండటం ఇది రెండోసారి. ఈ స్థానంలో సీపీఐ నేత అన్నీ రాజా, రాహుల్​ గాంధీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. అన్నీ రాజా మహిళా హక్కుల కార్యకర్త. వయనాడ్‌లో కాంగ్రెస్, సీపీఐ పోటీపడటం ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే ఇవే రెండు పార్టీలు జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్​ గాంధీకి వ్యతిరేకంగా సీపీఐ సర్వశక్తులు ఒడ్డుతుందా? అక్కడి పూర్వ ఫలితాన్ని తిరగరాస్తుందా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్​ స్థానంలో సీపీఐకు చెందిన పీపీ సునీర్‌ను 4.31 లక్షల ఓట్ల తేడాతో రాహుల్​ గాంధీ ఓడించారు. ఈ చేదు అనుభవంతో కంగుతిన్న సీపీఐ ఈసారి తమ అభ్యర్థిని మార్చేసి పార్టీ నేషనల్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఉమెన్​ జనరల్​ సెక్రటరీ అన్నీ రాజాకు అవకాశం ఇచ్చింది.

అమేఠీ
ఉత్తర్​ప్రదేశ్‌లోని అమేఠీ ఒకప్పుడు కాంగ్రెస్​ పార్టీకి కంచుకోట. సంజయ్​ గాంధీ, రాజీవ్​ గాంధీ, సోనియా గాంధీ వంటి దిగ్గజ నేతలు ఈ స్థానం నుంచి గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. 2004 నుంచి 2014 వరకు రాహుల్​ గాంధీ అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. 2014 నుంచే ఈ సీటులో హోరాహోరీ పోటీ మొదలైంది. 2014 ఎన్నికల్లో అమేఠీ నుంచి తొలిసారి పోటీచేసిన స్మృతి ఇరానీ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీనే విజయం వరించింది. అయితే 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ గెలిచారు. ఇప్పుడు వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని ఆమె పరీక్షించుకోబోతున్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్​ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. రాహుల్​ గాంధీ వయనాడ్​ నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే స్పష్టత వచ్చింది. అయితే ఆయన ఈసారి కూడా రెండో స్థానంగా అమేఠీ నుంచి బరిలోకి దిగుతారా? లేదా? అనేదానిపై కొన్ని రోజుల్లోనే పార్టీ క్లారిటీ ఇవ్వనుంది.

తిరువనంతపురం
కేరళలోని తిరువనంతపురం నుంచి సిట్టింగ్​ ఎంపీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత శశిథరూర్​ వరుసగా నాలుగోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేరళలో బీజేపీ ఖాతా తెరవాలనే పట్టుదలతో బీజేపీ నేత, కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్‌ ఉన్నారు. ఇక్కడి నుంచి పోటీలో ఉన్న మరో ప్రముఖ నాయకుడు పన్నయన్​ రవీంద్రన్​. 2005 సంవత్సరంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ట్రాక్​ రికార్డు రవీంద్రన్‌కు ఉంది. ఈయన ప్రస్తుతం ఎల్​డీఎఫ్​ పార్టీ నుంచి బరిలోకి దిగనున్నారు.

బెహరాంపుర్​
ఈసారి అందరి చూపు బంగాల్‌లోని బెహరాంపుర్​ లోక్‌సభ స్థానంపైనా ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మాజీ క్రికెటర్​ యూసుఫ్​ పఠాన్‌ పోటీ చేస్తున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయనకు తృణమూల్​ కాంగ్రెస్‌ (టీఎంసీ) లోక్‌సభ టికెట్​ ఇచ్చింది. గుజరాత్‌లోని వడోదరా ప్రాంతానికి చెందిన యూసుఫ్​ పఠాన్‌కు ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉండే బెహరాంపుర్​ నుంచి పోటీకి నిలపడం గమనార్హం. ఈ స్థానం కాంగ్రెస్​కు కంచుకోట. ఇక్కడి నుంచి ప్రస్తుతం అధీర్‌ రంజన్‌ చౌదరి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్​ లోక్‌సభా పక్ష నేతగానూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. బంగాల్​ రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడిగా కూడా అధీర్‌ రంజన్‌ చౌదరి ఉన్నారు. ఈ నేపథ్యంలో అధీర్‌కు చెక్​ పెట్టే వ్యూహంతోనే యూసుఫ్ పఠాన్‌ను మమతా బెనర్జీ బరిలోకి దింపారని తెలుస్తోంది. 1999 నుంచి ఇప్పటివరకు వరుసగా ఐదుసార్లు బెహరాంపుర్​ నుంచి అధీర్‌ గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు వరుసగా ఆరోసారి కూడా ఆయన పోటీ చేయనున్నారు.

న్యూదిల్లీ
దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్​ కుమార్తె బన్సురీ స్వరాజ్​ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమెను బీజేపీ న్యూదిల్లీ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి బరిలోకి దింపుతోంది. వరుసగా గత రెండు ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ విజయం సాధించారు. ఈసారి మాత్రం ఇక్కడి నుంచి బీజేపీ తరపున బన్సురీ స్వరాజ్​ పోటీ చేయనున్నారు. ఆమెను ఆమ్​ ఆద్మీ పార్టీ నాయకుడు సోమనాథ్​ భారతి ఢీకొననున్నారు. ఇక్కడ ఆప్​, బీజేపీ మధ్య టఫ్​ ఫైట్​ జరగనుంది. సోమనాథ్​ భారతి ప్రస్తుతం మాలవ్య నగర్​ ఎమ్మెల్యేగా ఉన్నారు.

రాజ్‌నంద్‌గావ్​
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్​ లోక్‌సభ స్థానం దాదాపు మూడు దశాబ్దాల పాటు బీజేపీకి కంచుకోట. ఈసారి ఇక్కడి నుంచి కాంగ్రెస్​ పార్టీ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ను పోటీకి దింపింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ సంతోష్​ పాండే, భూపేశ్‌ బఘేల్‌ మధ్య ఈసారి గట్టీ పోటీ జరగనుంది. 2009 నుంచి ఎన్నడూ ఈ స్థానంలో బీజేపీకి ఓటమి ఎదురుకాలేదు. ఈదఫా ఎలాగైనా రాజ్‌నంద్‌గావ్‌ను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్​ తన వ్యూహాలతో రెడీగా ఉంది. అయితే ఫలితం ఎలా వస్తుందో వేచి చూడాలి.

చురు
రాజస్థాన్‌లోని చురులో రసవత్తర పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి రెండుసార్లు ఎంపీగా నిలిచిన రాహుల్​ కస్వాన్‌కు కాంగ్రెస్​ టికెట్ ఇచ్చింది. రాహుల్​ కస్వాన్‌ గత వారమే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో పారాలింపిక్‌ ఛాంపియన్​ దేవేంద్ర ఝఝరియాను బీజేపీ బరిలోకి దింపింది. జావెలిన్​ త్రోయర్ ఝఝరియాకు గతంలో పద్మభూషణ్​ వచ్చింది. రెండుసార్లు పారాలింపిక్​ బంగారు పతకాన్ని ఝఝరియా గెల్చుకున్నారు.

ఇక 2014 ఎన్నికల్లో బహుజన్​ సమాజ్ పార్టీకి చెందిన అభినేశ్​ మహర్షిని 2.94 లక్షల ఓట్ల తేడాతో ఓడించడం ద్వారా రాహుల్​ కస్వాన్​ 37 సంవత్సరాల అతి పిన్న వయసులో లోక్‌సభ సభ్యుడు అయ్యారు. ఆయన తండ్రి రామ్​ సింగ్​ కస్వాన్​ నాలుగు పర్యాయాలు ఇదే స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

పశ్చిమ దిల్లీ
పశ్చిమ దిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్​ నాయకుడు, మాజీ ఎంపీ మహాబల్​ మిశ్రా మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ఈసారి పోటీ చేస్తున్నది మాత్రం ఆప్ తరఫున. ఎందుకంటే సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం ఆప్‌నకు దక్కింది. 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్​ తరఫున పోటీ చేసి బీజేపీకి చెందిన జగదీశ్​ ముఖిని ఓడించిన చరిత్ర మహాబల్​ మిశ్రాకు ఉంది. ఇక బీజేపీ పశ్చిమ దిల్లీ సిట్టింగ్​ ఎంపీ ప్రవేశ్​ వర్మ స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించింది. దక్షిణ దిల్లీ మాజీ మేయర్​ కమల్జీత్​ సెహ్రావత్‌ను ఇక్కడి నుంచి పోటీకి నిలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 5.78 లక్షల ఓట్ల మెజారిటీతో ఇక్కడి నుంచి గెలిచిన ప్రవేశ్ వర్మకు బీజేపీ టికెట్​ ఇవ్వకపోవడం గమనార్హం.

చింద్వారా
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నుంచి కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్​ కుమారుడు నకుల్​ నాథ్​ మరోసారి పోటీ చేస్తున్నారు. గతంలో తొమ్మిది సార్లు ఇదే స్థానం నుంచి కమల్‌నాథ్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. దీన్ని బట్టి ఈ సీటు కాంగ్రెస్‌కు కంచుకోట అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడి నుంచి మరోసారి బీజేపీ తరఫున వివేక్​ బంటీ సాహూ పోటీ చేయనున్నారు.

త్రిస్సూర్​
కేరళలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేరళ మాజీ సీఎం కె.కరుణాకరన్​ కుమారుడు కే.మురళీధరన్​ ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయితే ఆయన కుమార్తె పద్మజ ఇటీవల బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని త్రిస్సూర్​ లోక్‌సభ సీటు నుంచి ప్రముఖ నటుడు సురేశ్​ గోపీని బీజేపీ అభ్యర్థిగా నిలిపింది. దీంతో వ్యూహం మార్చుకున్న కాంగ్రెస్ అక్కడి నుంచి తమ అభ్యర్థిగా కే.మురళీధరన్​ పేరును ప్రకటించింది. వాస్తవానికి ప్రస్తుతం ఈయన కేరళలోని వటకర స్థానం నుంచి సిట్టింగ్​ ఎంపీగా ఉన్నారు. సురేశ్​ గోపీకి ఎలాగైనా చెక్​ పెట్టాలని కాంగ్రెస్​ భావిస్తోంది. త్రిస్సూర్​ స్థానం నుంచి సీపీఐ నేత, మాజీ మంత్రి వీఎస్​ సునీల్ కుమార్​ బరిలోకి దిగనున్నారు.

శివమొగ్గ
కర్ణాటకలోని శివమొగ్గ లోక్‌సభ స్థానంలో ఇద్దరు మాజీ సీఎంల కుటుంబాలు తలపడుతున్నాయి. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప కుమారుడు బీ.వై రాఘవేంద్ర బీజేపీ తరఫున బరిలోకి దిగారు. కాంగ్రెస్​ తరఫున దివంగత మాజీ సీఎం ఎస్. బంగారప్ప కుమార్తె గీతా శివరాజ్​ కుమార్​ పోటీ చేస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్​ కుమార్​ను గీత పెళ్లి చేసుకున్నారు. ఇక బీజేపీ సీనియర్​ నేత కేఎస్​ ఈశ్వరప్ప కుమారుడు కే.ఈ కాంతేశ్​కు హవేరీ లోక్‌సభ టిక్కెట్టు ఇచ్చేందుకు పార్టీ నో చెప్పింది. యడియూరప్ప కుమారుడికి మాత్రం టికెట్​ లభించింది. దీనికి నిరసనగా యడియూరప్ప కుమారుడు బీ.వై రాఘవేంద్రపై స్వతంత్ర అభ్యర్థిగా కేఎస్​ ఈశ్వరప్ప పోటీ చేస్తున్నారు.

2024 లోక్​సభ పోల్స్​: ఎన్డీఏ Vs ఇండియా- మోదీ జోరును విపక్ష కూటమి ఆపేనా?

మోదీ గ్యారంటీ Vs కాంగ్రెస్ న్యాయ్ గ్యారెంటీ- 2024 యుద్ధం షురూ- టాప్ 10 ప్రచార అస్త్రాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.