ETV Bharat / international

ఒక ఇంక్యుబేటర్​లో ముగ్గురు శిశువులు- డేంజర్​లో 50వేల మంది గర్భిణీలు- శాపంగా మారిన యుద్ధం!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 3:22 PM IST

Israel Gaza War : గర్భిణీలు, శిశువుల పాలిట గాజాలో ఎడతెగకుండా సాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం శాపంగా మారింది. ఐడీఎఫ్‌ బలగాల దాడులతో గాజాలో ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలి వేలాది శిశుమరణాలు సంభవిస్తున్నాయి. 50వేలమంది గర్భిణీలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిసింది. గర్భస్రావాలు, అకాల శిశుజనాలు, మరణాల సంఖ్య భారీగా పెరిగినట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది.

Israel Gaza War Latest Updates
Israel Gaza War Latest Updates

Israel Gaza War : గాజాలో గర్భిణీల పరిస్థితి హృదయవిదారకంగా మారింది. చాలా ఆస్పత్రులు మూతపడటం, ఉన్న కొన్ని వైద్యాలయాలల్లోనూ మందుల కొరత వేధిస్తుండటం వల్ల గర్భిణీలు, నవజాత శిశువులు ప్రమాదపు అంచుల్లో కాలం వెల్లదీస్తున్నారు. సుమారు 50వేల మంది గర్భిణీలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. గాజాలో గర్భస్రావాలు వందలాదిగా నమోదవుతున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. విపరీతమైన ఒత్తిడి, ఇతర కారణాల వల్ల పూర్తిగా పిండం అభివృద్ధి చెందక ముందే ప్రసవాలు జరుగుతున్నాయని పేర్కొంది.

గాజాలోని అల్‌ హెలాల్‌ అల్‌ ఎమిరటి ప్రసూతి ఆస్పత్రిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఒక్కో ఇంక్యుబేటర్‌లో ఇద్దరు నుంచి ముగ్గురు శిశువులను పెడుతున్న దృశ్యాలు మనసును కలచివేస్తున్నాయి. ఆ ఆస్పత్రిలో మొత్తం 20 ఇంక్యుబేటర్‌లు ఉండగా వాటిలో ఏకంగా 65 మంది శిశువులను ఉంచడం అక్కడి హృదయ విదారక పరిస్థితికి అద్దం పడుతోంది. గర్భిణీలకు అందాల్సిన కనీస ఆహారం కూడా అందుబాటులో లేకపోవడం వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నవజాత శిశువుల కోసం తల్లికి పాలు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లో ఊగిసలాడుతున్న పసిప్రాణాలకు మెకానికల్‌ వెంటిలేషన్‌, ఇతర వైద్యసదుపాయాలు లేక ఆస్పత్రి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజాలో ఒక లక్షా 55 వేల మంది గర్భిణీ లేదా పాలిచ్చే మహిళలకు పోషకాహార సేవల అంతరాయం ఏర్పడినట్లు యూనిసెఫ్‌ వెల్లడించింది.

ఇజ్రాయెల్​-గాజా పరస్పర దాడులు!
ఇటీవలే గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 150 మంది మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరో 313 మంది గాయపడ్డారని తెలిపింది. దీంతో ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీయనియన్ల సంఖ్య 26,900కు చేరినందని పేర్కొంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని వివరించింది.

21 మంది జవాన్లు మృతి!
మరోవైపు ఇటీవల సెంట్రల్ గాజాలో ఓ మిలిటెంట్ చేసిన దాడిలో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. యుద్ధం మొదలైన తర్వాత జరిగిన దాడుల్లో అత్యధిక మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ వెల్లడించారు. ఈ వార్త పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక అమెరికా వీసా మరింత భారం- హెచ్​1బీ సహా ఐదు కేటగిరీల ఫీజులు పెంపు

భారత బలగాల్లోకి అమెరికా డ్రోన్లు- రూ.33 వేల కోట్ల ఒప్పందానికి అగ్రరాజ్యం పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.