Side Effects of Watching Cartoons for a Long Time: చిన్న పిల్లలకు కార్టూన్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఒకప్పుడు ఇది అంతగా ప్రాచుర్యంలో లేదు. కానీ ప్రసుత్తం పరిస్థితి మారింది. తినాలంటే కార్టూన్లు, నిద్రపోవాలంటే కార్టూన్లు, చెప్పిన మాట వినాలంటే కార్టూన్లు.. ఇలా ఏ పని చేయాలన్న ఇవి ఉండాల్సిందే. ఇవి లేకుండా జీవితం లేదన్నట్టుగా పిల్లల మైండ్‌సైట్ తయారయింది. అయితే తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. పిల్లలు మారం చేస్తే కార్టూన్లు పెట్టి వాళ్ల పనులు పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఇది అస్సలు మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు. కార్టూన్లు పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. కార్టూన్లు చూడటం వల్ల పిల్లలపై కలిగే చెడు ప్రభావాల గురించి కచ్చితంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలని అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
హింస: హింసను ప్రేరేపించే కార్టూన్లను చూడటం వలన పిల్లలు నిజ జీవితంలో కూడా హింసలో పాల్గొనేలా ఆలోచిస్తారని నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. అందులోని గన్స్, బాంబుల వాడకం పిల్లలను వేరే విధంగా ఆలోచించేలా చేస్తాయని.. అందుకే కొందరు పిల్లలు నిన్ను కాల్చేస్తా.. అది.. ఇది అంటూ మాట్లాడుతారని నిపుణులు అంటున్నారు.
చెడు ప్రవర్తన: ఉపాధ్యాయులు, పెద్దల పట్ల అసభ్యంగా లేదా మర్యాద లేకుండా ప్రవర్తించే కార్టూన్‌లు బోలెడు ఉన్నాయి. అయితే పిల్లలు ఇలాంటి కార్టూన్లు చూస్తున్నప్పుడు అందులోని ప్రవర్తనను అనుకరిస్తూ చెడుగా ఎదిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.
అభివృద్ధి లోపాలు: అతిగా కార్టూన్లు చూడటం వల్ల పిల్లల భాషా నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు, ఆలోచనా శక్తి అభివృద్ధి చెందకపోవచ్చని అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలని అంటున్నారు.
క్యారెక్టర్ అనుకరణ: పిల్లలు సాధారణంగా వారికి ఇష్టమైన కార్టూన్ పాత్రలను అనుకరిస్తారు. ఎందుకంటే వారు వాటిని ఇష్టపడతారు. నిజ జీవితంలో వారిలా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇది పిల్లలను తప్పుడు మార్గంలో నడిపిస్తుందని.. ఎక్కువగా చెడుకు ఆకర్శితులవుతారని అంటున్నారు.
ఆరోగ్య సమస్యలు: టీవీ లేదా మొబైల్లో కార్టూన్లు చూడటం వల్ల నిశ్చల జీవనశైలి కారణంగా పిల్లలలో ఊబకాయం, దృష్టి లోపం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. 2008లో 'ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఓబెసిటీ'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ కార్టూన్లు చూసే 5 నుంచి 7 సంవత్సరాల వయసు గల పిల్లలలో అధిక బరువు సమస్య కనిపించే అవకాశం 60% ఎక్కువని కనుగొన్నారు. ఈ పరిశోధనలో క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ Dr. Mark S. Tremblay పాల్గొన్నారు. గంటల తరబడి కార్టూన్లు చూడటం వల్ల శారీరక శ్రమ ఉండదని తద్వారా బరువు పెరిగే అవకాశం ఉంటుందని కనుగొన్నారు.
నిద్రలేమి: కార్టూన్లు అధికంగా చూడటం వల్ల పిల్లలు నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడతారని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వారు చూసిన కార్టూన్లు కలల రూపంలో వచ్చి నిద్రను దూరం చేస్తుందని చెబుతున్నారు. 2009 "పిడియాట్రిక్స్ జర్నల్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రాత్రి పూట కార్టూన్లు చూడటం పిల్లల నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కనుగొన్నారు.
పిల్లలు కార్టూన్ల వైపు ఆకర్షితులవకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు:
- పిల్లలను రోజుకు ఒక గంట కంటే ఎక్కువ సమయం కార్టూన్లు చూడనివ్వకండి.
- పిల్లలకు ఏ కార్టూన్లు చూపిస్తున్నారో గమనించండి. హింసాత్మక కార్టూన్లను నివారించండి.
- కార్టూన్లు చూసే సమయంలో పిల్లలతో కూర్చుని మాట్లాడండి. కథ గురించి వారి అభిప్రాయాలను అడగండి.
- కార్టూన్లకు బదులుగా పిల్లలతో ఆటలు ఆడటం, పుస్తకాలు చదవించడం, బయటకు తీసుకెళ్లడం వంటి పనులు చేయమని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కాబట్టి గమనించగలరు..
పిల్లల ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త అంటున్న నిపుణులు! - parents not to do these things
అలర్ట్ : మీ పిల్లలు ఆన్‌లైన్‌కు బానిసవుతున్నారా? - ఈ టిప్స్‌తో మీ దారిలోకి తెచ్చుకోండి!