ETV Bharat / business

స్విగ్గీలో కొత్త స్కామ్ - నమ్మి ఆ కాల్ అటెండ్ చేస్తే రూ.లక్షలు స్వాహా - బీ అలర్ట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 12:39 PM IST

Criminals Hacking Swiggy Accounts : మీరు తరచూ స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్​ ద్వారా ఫుడ్, గ్రోసరీస్​ ఆర్డర్స్​ చేస్తుంటారా? అయితే జర జాగ్రత్త! నేరగాళ్లు చాలా ఈజీగా స్విగ్గీ లాంటి ఫుడ్​ డెలివరీ యాప్స్​ను హ్యాక్​ చేసి, కస్టమర్ల డబ్బులు కొట్టేస్తున్నారు. ఇటీవల ఓ అమ్మాయిని మోసం చేసి, ఆమె స్విగ్గీ అకౌంట్​ నుంచి సుమారు లక్ష రూపాయలు కొట్టేశారు. పూర్తి వివరాలు మీ కోసం.

Woman's Swiggy account hacked
Criminals Hacking Swiggy Accounts

Criminals Hacking Swiggy Accounts : స్విగ్గీ, జొమాటోల్లో పనిచేసి, మానేసిన ఇద్దరు డెలివరీ బాయ్స్, ఒక అమ్మాయికి చెందిన స్విగ్గీ అకౌంట్​ను హ్యాక్​ చేసి, సుమారు లక్ష రూపాయలు కాజేసిన ఘటన కలకలం సృష్టిస్తోంది. బాధితురాలు కంప్లైంట్​ ఇచ్చింది కనుక ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో చెప్పలేని పరిస్థితి!

స్విగ్గీ అకౌంట్ హ్యాక్​
హరియాణాలోని గురుగ్రామ్​కు చెందిన అనికేత్​ కల్రా, హిమాన్షు కుమార్ అనే ఇద్దరు సామాన్యమైన డెలివరీ బాయ్స్​ ఏకంగా ఐవీఆర్ సిస్టమ్​నే హ్యాక్ చేయగలిగారు. సుల్తాన్​పుర్​కు చెందిన బాధితురాలి స్విగ్గీ ఖాతా వివరాలు అన్నీ తెలుసుకున్నారు. ఆమె అకౌంట్​కు నకిలీ ఫోన్​ నంబర్లను కూడా లింక్ చేశారు. అంతేకాదు ఆమె యూపీఐ ఐడీ వివరాలు తెలుసుకుని, ఆమె ఖాతా ద్వారా నకిలీ ఆర్డర్లు ఇచ్చారు. పోలీసులు దీనిని గుర్తించకుండా ఉండడానికి, గురుగ్రామ్​లోని వివిధ చిరునామాల ద్వారా ఆర్డర్లు ఇచ్చేవారు. ఇలా వచ్చిన కిరాణా సామానులను, తక్కువ ధరకే మార్కెట్లో అమ్మేసేవారు. ఈ విధంగా వారు అక్రమంగా చాలా డబ్బులే సంపాదించారు.

ఇలా తప్పుడు మార్గంలో సంపాదిస్తున్న డబ్బును, చట్టబద్ధమైన లావాదేవీలుగా మార్చడానికి హిమాన్షు కుమార్ అతితెలివిని ప్రదర్శించాడు. గురుగ్రామ్​లోని ఒక మెడికల్ షాప్​లో పని చేస్తూ, తమ షాపునకు వచ్చిన వివిధ వ్యక్తులకు డబ్బులు ఇచ్చి, వాటిని వారి యూపీఐ ఐడీల ద్వారా తమ ఖాతాలో పడేటట్లు చేసుకున్నాడు. ఈ విధంగా నిందితులు ఇద్దరూ బాధితురాలి నుంచి ఏకంగా రూ.97,197 వరకు కాజేశారు.

పోలీసుల అదుపులో నిందితులు
తన అకౌంట్​ నుంచి భారీగా డబ్బులు కట్ అయినట్లు గుర్తించిన సుల్తాన్​పుర్​కు చెందిన బాధితురాలు, దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు, కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేసి, నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఐవీఆర్ సిస్టమ్​నే హ్యాక్ చేశారు!
బిజినెస్ సెంటర్లు, కాల్ సెంటర్లు, సేల్స్ టీమ్స్​, ఆన్​లైన్ ఫుడ్​ డెలివరీ యాప్స్ లాంటివన్నీ తమ కస్టమర్ల నుంచి వచ్చే ఫోన్లను హ్యాండిల్ చేయడానికి ఐవీఆర్ సిస్టమ్​ను ఉపయోగిస్తుంటాయి. దీని వల్ల కస్టమర్లు చేసే ఫోన్లు నేరుగా కస్టమర్ రిప్రజంటేటివ్​కు కాకుండా, ఇంటిరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్​కు బదిలీ అవుతాయి. అవి కస్టమర్ల ప్రశ్నలకు ఆటోమేటిక్ రెస్పాన్స్​లు ఇస్తుంటాయి.

ఉదాహరణకు మనం బ్యాంక్​ కస్టమర్ నంబర్​కు ఫోన్ చేశామని అనుకోండి. మీకు బ్యాంకు వివరాలు కావాలంటే 1 నొక్కండి. బిల్లింగ్ వివరాల కోసం 2 నొక్కండి. కస్టమర్ సర్వీస్​ కోసం 3 నొక్కండి. మీరు కనుక మా రిప్రజంటేటివ్​తో మాట్లాడాలని అనుకుంటే 9 నొక్కండి. ఇలాంటి ప్రీ రికార్డెడ్​ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఈ విధానం వల్ల ఉద్యోగులపై చాలా వరకు ఒత్తిడిని తగ్గుతుంది. పైగా కస్టమర్ల చిన్నచిన్న సమస్యలు కూడా సులువుగా పరిష్కారం అవుతాయి. 1970ల్లో ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ, ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్​ఎల్​పీ) కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంటెలిజెన్స్ వాయిస్​ రికగ్నిషన్ సాఫ్ట్​వేర్​ సాయంతో కంప్యూటరే నేరుగా కస్టమర్లతో మాట్లాడుతుంది. వారి సమస్యను అర్థం చేసుకుని, ఒక లెవల్ వరకు పరిష్కారం కూడా చూపగలుగుతుంది. అయితే దీనిలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని హ్యాకర్లు, కస్టమర్ల బ్యాంకింగ్ వివరాలను తెలుసుకోగలుగుతున్నారు. అది ఎలా అంటే?

ఉదాహరణకు గురుగ్రామ్​లో జరిగిన స్విగ్గీ అకౌంట్ హ్యాకింగ్ ఘటననే తీసుకుందాం. నిందితులు హిమాన్షు కుమార్, అనికేత్ కల్రా సుల్తాన్​పుర్​కు చెందిన బాధితురాలికి ఆటోమేటిక్ టెలిఫోనీ ఐవీఆర్ సిస్టమ్ ద్వారా ఫోన్ చేశారు. తాము స్విగ్గీ ప్రతినిధులమని, ఆమె ఖాతా హ్యాంకింగ్​కు గురైందని, మాయమాటలు చెప్పి నమ్మించారు. అకౌంట్​ను సంరక్షించడానికి పలు వివరాలు కావాలని కోరారు. దీనితో ఆమె తన స్విగ్గీ అకౌంట్ నంబర్​, యూపీఐ ఐడీ నంబర్​, ఫోన్ నంబర్ సహా పలు సున్నితమైన వివరాలు అన్నీ చెప్పేసింది. ఈ వివరాలు అన్నీ సేకరించుకున్న నిందితులు, ఆమె స్విగ్గీ అకౌంట్​కు నకిలీ ఫోన్​ నంబర్లను యాడ్ చేశారు. తరువాత ఆమె అకౌంట్​ నుంచే స్విగ్గీలో కిరాణా సామగ్రిని ఆర్డర్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, గురుగ్రామ్​లోని వివిధ చిరునామాల నుంచి ఆర్డర్లు ఇచ్చేవారు. ఈ విధంగా తమ దగ్గరకు వచ్చిన సామానులను దగ్గరల్లోని మార్కెట్లో చాలా తక్కువ ధరకే అమ్మేశారు. ఈ విధంగా వారు అక్రమ మార్గంలో బాగా డబ్బు సంపాదించారు.

మీరు కూడా మోసపోవచ్చు - జర జాగ్రత్త!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఐవీఆర్​ సిస్టమ్​లో కస్టమర్లు ఇచ్చిన వాయిస్​ ప్రతిస్పందనలు అన్నీ రికార్డ్ అవుతాయి. వాటిని ఉపయోగించి, వారి ఖాతా వివరాలు, ఫోన్ నంబర్ సహా అన్ని వివరాలు తెలుసుకోవడానికి వీలవుతుంది. వీటిని దొంగతనంగా యాక్సెస్ చేసి, కస్టమర్ల డబ్బులు కాజేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక స్విగ్గీ, జొమాటో లాంటి వాటిల్లో వాయిస్ ఆర్డర్లు ఇచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అప్రమత్తమైన స్విగ్గీ
తాజా ఘటనతో స్విగ్గీ అప్రమత్తం అయ్యింది. కస్టమర్లు తమ స్విగ్గీ అకౌంట్ నుంచి యూపీఐ వాలెట్లు, ఫోన్​ నంబర్లను ఆటోమేటిక్​గా డీలింక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు ఇలాంటి మోసాలను నిరోధించడానికి న్యూ డివైజ్ లాగిన్​, 2-ఫ్యాక్టర్ అథంటికేషన్​ సహా, ఇతర భద్రతా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

సైబర్‌ మోసానికి గురయ్యారా? సింపుల్​గా కంప్లైంట్​ చేయండిలా!

సైబర్​ నేరాల్లో డబ్బులు కోల్పోతున్న బాధితులు - కొత్త విధానంతో సొమ్మును రికవరీ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.