ETV Bharat / bharat

'కాంగ్రెస్​తో పొత్తు లేదు- బైనాక్యులర్‌తో వెతికినా వారికి మూడో సీటు దొరకదు'

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 6:32 AM IST

Updated : Feb 24, 2024, 7:01 AM IST

TMC Congress Seats Distribution
TMC Congress Seats Distribution

TMC Congress Seats Distribution : బంగాల్​లో కాంగ్రెస్​తో సీట్ల సర్దుబాటు జరిగిందన్న వార్తలను టీఎంసీ ఖండించింది. మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. బైనాక్యులర్‌తో వెతికినా కాంగ్రెస్‌ కోసం మూడో సీటు దొరకలేదని వ్యాఖ్యానించింది.

TMC Congress Seats Distribution : బంగాల్‌లో ఐదు సీట్లను కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ అంగీకరించారన్న వార్తలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ తెరదించింది. మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. అసోంతోపాటు మేఘాలయలో కూడా పోటీ చేసే విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది.

ఉత్తర్​ప్రదేశ్​లో సమాజ్‌వాదీ పార్టీ, దిల్లీ, పంజాబ్‌, గుజరాత్‌, హరియాణా, గోవాల్లో ఆప్‌తో సీట్ల పంపకంపై అవగాహనకు వచ్చిన కాంగ్రెస్‌ మళ్లీ టీఎంసీతో చర్చలు ప్రారంభించింది. తొలుత బెహ్రంపుర్‌, దక్షిణ మాల్దా, ఉత్తర మాల్దా, రాయ్‌గంజ్‌, డార్జిలింగ్‌ నుంచి కాంగ్రెస్‌ పోటీ చేసేందుకు దీదీ సుముఖత వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

24 గంటలు గడవకముందే!
అయితే 24 గంటలు గడవకముందే ఒంటరిగా బరిలోకి దిగుతామని టీఎంసీ అధికార ప్రతినిధి డెరెక్‌ ఓబ్రెయిన్ వెల్లడించారు. బైనాక్యులర్‌తో వెతికినా కాంగ్రెస్‌ కోసం మూడో సీటు దొరకలేదని వ్యాఖ్యానించారు. "కొన్ని రోజుల క్రితం బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించినట్లుగా మొత్తం 42 సీట్లలో టీఎంసీ ఒంటరిగా పోరాడుతుంది. అసోంలో కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. మేఘాలయలోని తురా లోక్‌సభ సీటు కోసం బరిలో దిగుతుంది. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు" అని డెరెక్‌ ఓబ్రెయిన్ తెలిపారు.

'బీజేపీని ఒంటరిగా ఓడిస్తాం'
కొన్నిరోజుల క్రితం బంగాల్​లో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. దేశంలోని ఇతర స్థానాల్లో సీట్ల పంపకాల మాట ఎలా ఉన్నప్పటికీ, బంగాల్​లోని 42 సీట్లలో మాత్రం ఒంటరిగానే బీజేపీని తాము ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాతే పాన్‌ ఇండియా కూటమి గురించి ఆలోచిస్తామని తేల్చి చెప్పారు.

"కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి చర్చలు జరపలేదు. టీఎంసీ ఓ సెక్యులర్ పార్టీ. రాష్ట్రంలో ఒంటరిగానే బీజేపీని ఓడిస్తాం. వారికి(కాంగ్రెస్​) మేం చాలా ప్రతిపాదనలు చేశాం. కానీ తొలి నుంచి కూడా వారు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అందుకే మేం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం" అని మమత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఇస్తామని టీఎంసీ ప్రకటించగా, హస్తం పార్టీ అందుకు అంగీకరించలేదు. దీంతో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోరాటం చేస్తామని మమత స్పష్టం చేశారు.

'రాహుల్​ది కొత్త రకం ఫొటోషూట్- 2024లో కాంగ్రెస్​కు 40 సీట్లు కూడా రావు'

బీజేపీని బలోపేతం చేసేందుకే సీపీఐతో కాంగ్రెస్ దోస్తీ : మమత

Last Updated :Feb 24, 2024, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.