ETV Bharat / bharat

హసన్​ సెక్స్‌ కుంభకోణంలో ఎన్నో దారుణాలు! తొలిసారి స్పందించిన ప్రజ్వల్​ - Prajwal Revanna Sex Scandal Case

author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 5:53 PM IST

Prajwal Revanna Sex Scandal Case
Prajwal Revanna Sex Scandal Case

Prajwal Revanna Sex Scandal Case : కర్ణాటకలో రాజకీయాల్లో హసన్‌ సెక్స్‌ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. 18 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఉద్యోగాలు, పదోన్నతుల కోసం వచ్చిన వందలాది మంది యువతులకు ఆశ చూపి ప్రజ్వల్‌, శారీరక వాంఛ తీర్చుకునేవాడని తెలిసింది. మహిళల మాంగల్యాల గురించి మాట్లాడే ప్రధాని మోదీ, తన మిత్రపక్షం MP ఒడిగట్టిన దారుణంపైనా మాట్లాడాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

Prajwal Revanna Sex Scandal Case : కర్ణాటకలో సంచలనం రేపుతోన్న హసన్‌ సెక్స్‌ రాకెట్​లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. నిజం గెలుస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. తాను ప్రసుత్తం బెంగళూరులో లేనని అందుకే విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఎక్స్‌లో తెలిపారు. తన న్యాయవాది ద్వారా బెంగళూరులోని CID సమాచారమిచ్చానని వెల్లడించారు. త్వరలోనే నిజం గెలుస్తుందని ప్రజ్వల్‌ రాసుకొచ్చారు.

దర్యాప్తు వేగవంతం
జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీ నుంచి ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను సస్పెండ్‌ చేసిన క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగం పుంజుకుంది. దర్యాప్తునకు 18 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. హొళెనరసీపుర ఠాణాలో ఫిర్యాదు చేసిన 47 ఏళ్ల బాధితురాలు వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది. కేసులో ఏ1గా ఉన్న హెచ్‌డీ రేవణ్ణకు సిట్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో విచారణకు హాజరు కావాలని సూచించింది.

కర్ణాటకలో ఆందోళనలు ఉద్ధృతం
మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, హాసన్​ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై చర్యలు తీసుకోవాలని కర్ణాటకలో ఆందోళనలు ఉద్ధృతమ‌య్యాయి. ప్రజ్వల్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌, NSUI, తదితర విద్యార్థి సంఘాలు బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కొన్ని చోట్ల విద్యార్థిణులు రేవణ్ణ దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ నిరసనలు తెలియజేశారు. ప్రజ్వల్‌ చేతిలో వందలాది మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వీడియోలు నాలుగేళ్ల కిందటివని హెచ్‌డీ రేవణ్ణ బుకాయించుకోవడం సిగ్గు చేటని కాంగ్రెస్‌ మండిపడింది.

దేశ రాజకీయాల్లోనూ ప్రకంపనలు
హాసన్​ సెక్స్‌ కుంభకోణం దేశ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీతో జేడీఎస్‌ పొత్తు ఉండటం వల్ల ఇది మరింత తీవ్రమైంది. మోదీ పరివార్‌లో భాగమైన నేరస్థులకు అరెస్ట్‌ల నుంచి రక్షణ లభిస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. సందేశ్‌ఖాలీ ఘటన గురించి ప్రసంగాలు చేసే మోదీ, హసన్‌ ఘటనపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజ్వల్‌పై ఆరోపణలు ఉన్నాయని ముందే తెలిసి కూడా ఆయన కోసం మోదీ ఎందుకు ప్రచారం చేశారని నిలదీశారు. బ్రిజ్‌భూషణ్‌, ఉన్నావ్‌, ఉత్తరాఖండ్‌ ఇప్పుడు హాసన ఘటన ఇలా ప్రతి విషయంలో ప్రధాని మౌనం వహించడం నేరస్థులకు మరింత ధైర్యాన్ని ఇస్తోందని ఆరోపించారు. హిందూ మహిళల మంగళసూత్రాలపై మాట్లాడే మోదీ ఈ దారుణ ఘటనకు కూడా సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రజ్వల్‌కు కేంద్ర ప్రభుత్వం సాయం
కేంద్రంలోని ఎన్​డీఏ ప్రభుత్వం సాయంతోనే ప్రజ్వల్‌ దేశం దాటినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ఇందుకు ప్రణాళిక రచించింది మాజీ ప్రధాని దేవెగౌడ అని వ్యాఖ్యానించారు. వీడియోలు బయటకు రాగానే దేశం విడిచి పారిపోయేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజ్వల్‌కు సాయం చేసిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ప్రజ్వల్‌ను చట్ట ప్రకారం విచారించాలంటే, అతడిని భారత్‌కు రప్పించాలనీ అందుకు ప్రజ్వల్‌ డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టును వెంటనే రద్దు చేయాలని మోదీకి సిద్ధరామయ్య లేఖ రాశారు. ఈ మేరకు హోంశాఖ, విదేశాంగశాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

"దేవరాజేగౌడ మొదటగా ఎవరిని కలిశారు? నాకు తెలిసి ముందుగా కుమారస్వామికి, ఆ తర్వాత పలువురు బీజేపీ నాయకులకు పెన్​డ్రైవ్​లు ఇచ్చారు. ఒకవేళ మాకు అంది ఉంటే మేము వాటిని మరో విధంగా ఉపయోగించేవాళ్లం. కానీ మాకు ఇలాంటి ఎత్తుగడలు రావు. మహిళలను గౌరవిస్తానని చెప్పే కుమారస్వామి, వెంటనే బాధితురాళ్లను కలిసి ఓదార్చాలి."

--డీకే శివకుమార్​, ఉపముఖ్యమంత్రి

భారత్​కు రప్పించేందుకు చర్యలు
ప్రజ్వల్​ రేవణ్ణను భారత్​కు తిరిగి రప్పించేందుకు సిట్​ చర్యలు చేపడుతుందని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్​ తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు కుమారస్వామితో పాటు అనేక మంది బీజేపీ నాయకులకు పెన్​డ్రైవ్​ విషయం ముందే తెలుసని ఎంపీ డీకే సురేశ్​ ఆరోపించారు. ఈ కేసును తప్పుదారి పట్టించేందుకే కాంగ్రెస్​, డీకే శివకుమార్​కు దీంతో సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తున్నట్లు చెప్పారు.

వీడియోలు ఎలా బయటకు వచ్చాయి?
వందల మంది మహిళలు, యువతులను లైంగికంగా ప్రజ్వల్‌ రేవణ్ణ వేధించిన వీడియోలు బయటకు ఎలా వచ్చాయన్నది ఆసక్తిగా మారింది. ప్రజ్వల్‌ డ్రైవర్‌గా పనిచేసిన కార్తిక్‌ ద్వారా ఈ వీడియోలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. HD రేవణ్ణ కుటుంబానికి ఆ యువకుడు ఒకప్పుడు బినామీగా ఉండేవాడన్న అనుమానం ఉంది. కార్తిక్‌కు సంబంధించిన స్థలాన్ని రేవణ్ణ కుటుంబం లాక్కోవడం వల్ల కక్ష పెంచుకున్నట్లు తెలిసింది. డ్రైవర్‌గా పనిచేసిన సమయంలో ప్రజ్వల్‌ మొబైల్​లోని వీడియోలను కార్తిక్‌ సంపాదించాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దేవరాజే గౌడ, హెచ్‌డీ రేవణ్ణ చేతిలో ఓడిపోయారు. తనకు దేవరాజే గౌడ మాత్రమే సాయం చేయగలరన్న ఆశతో ప్రజ్వల్‌ వీడియోలను బీజేపీ అభ్యర్థికి పంపించారు. దేవరాజేగౌడ వాటిని మరికొందరు బీజేపీ నాయకులకు పంపారు. అయితే తన నుంచి వీడియోలు బయటకు రాలేదని దేవరాజే గౌడ చెబుతున్నారు. కార్తిక్‌ ఆ వీడియోలను తనతో పాటు కాంగ్రెస్‌ నేతలకు కూడా ఇచ్చి ఉండొచ్చని దేవరాజే గౌడ అనుమానిస్తున్నారు.

ప్రమోషన్​, బదిలీ కోసం వచ్చిన యువతులే అధికం
అశ్లీల వీడియోల్లో ప్రజ్వల్‌తో కనిపించిన వారిలో ఎక్కువ మంది, ఉద్యోగాలు, బదిలీలు, పదోన్నతుల కోసం వచ్చిన యువతులే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వారి నుంచి తన శారీరక వాంఛలను ప్రజ్వల్‌ తీర్చుకున్నాడని సిట్ అనుమానిస్తోంది. కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ ఉండడం వల్ల బాధిత మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. తమ విషయం బయటపడితే సంసారాలు వీధిన పడతాయని భయపడుతున్నారు. ప్రజ్వల్‌ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్ర వివరాలు ఇవ్వాలని కర్ణాటక DGPకి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. సైబర్‌ క్రైం నిపుణుల సాయంతో వీడియోలు వైరల్‌ కాకుండా అడ్డుకోవాలని, వాటిని షేర్‌ చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

హాసన్​ సెక్స్ రాకెట్​లో షాకింగ్ నిజాలు- ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్నపై వేటు! - Prajwal Revanna Suspension From JDS

జేడీఎస్​ నుంచి ప్రజ్వల్‌ రేవణ్ణ సస్పెండ్- 'ప్రధాని మోదీకి ఎలాంటి సంబంధం లేదు' - Prajwal Revanna Sex Scandal Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.