ETV Bharat / bharat

ఓవైపు రాజీ కోసం సంప్రదింపులు- మరోవైపు గొర్రెలంటూ ప్రకటనలు: హిమాచల్ రెబల్ ఎమ్మెల్యేలు

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 8:00 AM IST

Himachal Pradesh Political Crisis
Himachal Pradesh Political Crisis

Himachal Pradesh Political Crisis : హిమాచల్ ​ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుపై కీలక వ్యాఖ్యలు చేశారు రెబల్ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు కారణం ఎవరనే విషయాన్ని గుర్తించాలని కోరారు. ఓవైపు రాజీ కోసం సంప్రదింపులు చేస్తూనే మరోవైపు గొర్రెలు, నల్లపాములంటూ ప్రకటనలు చేస్తున్నారన్నారు. మరోవైపు ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఆరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.

Himachal Pradesh Political Crisis : హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులకు కారణం ఎవరనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్​ను కోరారు రెబల్ ఎమ్మెల్యేలు. ఈ విషయంపై సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి అనర్హతకు గురైన కాంగ్రెస్ ఆరుగురు ఎమ్మెల్యేలు సహా ముగ్గురు స్వతంత్రులు హితవుపలికారు. ఆత్మగౌరవం కోసం తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఓవైపు రాజీ కోసం సంప్రదింపులు చేస్తూనే, మరోవైపు గొర్రెలు, నల్లపాములంటూ ప్రకటనలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనా విధానం ఏంటని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై అసహనం
అంతేకాకుండా చండీగఢ్‌లో అధికారిక పర్యటనకు వచ్చినప్పుడు హిమాచల్‌ భవన్‌లో కాకుండా ఫైవ్ స్టార్​ హోటల్‌లో బస చేయడంపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్​ సుఖు సమాధానం చెప్పాలన్నారు. ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారని, ఒకచోట నుంచి మరో చోటికి గొర్రెల మాదిరిగా వెళ్తున్నారని ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ ఇటీవల ఓ సమావేశంలో చేసిన ప్రకటన నేపథ్యంలో రెబల్‌ ఎమ్మెల్యేలు ఈ విధంగా స్పందించారు.

ఆరుగురు సభ్యులతో సమన్వయ కమిటీ
హిమాచల్​ప్రదేశ్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఉపముఖ్యమంత్రి ముఖేశ్ అగ్నిహోత్రి, HPCC చీఫ్ ప్రతిభా సింగ్, కాంగ్రెస్ నేతలు కౌల్ సింగ్ ఠాకూర్, ధనిరామ్ శాండిల్, రామ్ లాల్ ఠాకూర్ సభ్యులుగా ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

అనర్హత పిటిషన్​పై విచారణ
తమపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టులో మార్చి 12న విచారణ జరగనుంది. జస్టిస్​ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్​ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అనర్హత పిటిషన్​పై విచారణ జరపనుంది.

రెబల్​ ఎమ్మెల్యే తండ్రిపై కేసు
హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో మరో పరిణామం జరిగింది. స్వతంత్ర ఎమ్మెల్యే ఆశిష్‌ శర్మ, కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యే చేతన్య శర్మ తండ్రి, విశ్రాంత అధికారి రాకేశ్‌ శర్మతోపాటు మరికొందరిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో వారు అక్రమాలకు పాల్పడినట్లు ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య చేపట్టారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలకు రాకేశ్‌ శర్మ రవాణా సదుపాయం కల్పించారని, దానికి బీజేపీ ఆర్థిక సాయం అందించిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంజయ్‌ అవస్థి, భువనేశ్వర్‌ గౌర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అక్రమాల వ్యవహారంలో దర్యాప్తు చేపట్టాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

'బీజేపీ టికెట్​పై అరుణ్​ గోయెల్ పోటీ?'- ఎన్నికల కమిషనర్ రాజీనామాపై విపక్షాలు ఫైర్

విపక్షాలపై రాజ్యసభ ఎన్నికల ఎఫెక్ట్!- హిమాచల్​, యూపీలో పరిస్థితులు మారేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.