ETV Bharat / bharat

ఇండియా కూటమికి నీతీశ్ గుడ్​బై! సోనియా, ఖర్గేతో మాట్లాడేందుకు నో!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 4:25 PM IST

Updated : Jan 27, 2024, 4:57 PM IST

Bihar Political Crisis : బిహార్​లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఆర్జేడీ, బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీల నేతలు విడివిడిగా సమావేశమయ్యారు. ఆర్జేడీ సమావేశంలో బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అంటే తనకు గౌరవమని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, నీతీశ్​ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు గానీ, కూటమి నుంచి వైదొలగుతున్నట్టు గానీ స్పష్టమైన సమాచారం లేదన్నారు కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే.

Bihar Political Crisis
Bihar Political Crisis

Bihar Political Crisis : జేడీయూ అధినేత, బిహార్​ సీఎం నీతీశ్‌కుమార్‌ మహాకూటమికి గుడ్‌బై చెప్పటంగా ఖాయంగా కనిపిస్తోంది. ఆయన మరోసారి భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ లేకుండా కేవలం ఆర్జేడీ మంత్రుల స్థానంలో తమ ఎమ్మెల్యేలను నియమించాలని కమలం పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్జేడీ, బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీల నేతలు విడివిడిగా సమావేశమయ్యారు.

మరోవైపు, పట్నాలోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ నివాసంలో ఆ పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. ఈ సమావేశంలో లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అంటే తనకు గౌరవమని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 'చాలా నిర్ణయాలు నీతీశ్ నియంత్రణలో లేవు. 'మహాఘటబంధన్​'లోని ఆర్జేడీ మిత్రపక్షాలు ఎప్పుడూ ముఖ్యమంత్రిని గౌరవించేవి. సీఎం నీతీశ్​ నాతో పాటు వేదికపై కూర్చొని '2005కి ముందు బిహార్‌లో ఏముంది?' అని అడిగేవారు. నేనెప్పుడూ ఆ వ్యాఖ్యలపై స్పందించలేదు. రెండు దశాబ్దాలుగా కల్పించలేని ఉద్యోగాలు, కులగణన, రిజర్వేషన్ల పెంపు మొదలైనవాటిని మహాఘట్​బంధన్ సర్కార్ పూర్తి చేసింది.' అని తేజస్వీ యాదవ్ పార్టీ సమావేశంలో అన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.

  • During the RJD meeting in Patna, Bihar, Deputy Chief Minister and party leader Tejashwi Yadav told the party leaders that CM Nitish Kumar was and is respectable. Many things are not under his (Nitish Kumar) control. RJD's allies in the 'Mahagathbandhan' always respected the Chief…

    — ANI (@ANI) January 27, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇండియా కూటమిపై జేడీయూ ఫైర్​
బిహార్​లో ఇండియా కూటమి పతనం అంచున ఉందని, కాంగ్రెస్ పదేపదే నీతీశ్ కుమార్​ను అవమానించిందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ఆరోపించారు. కూటమిలో అగ్రస్థానం కోసం నీతీశ్​ కుమార్​ ఎప్పుడూ ఆశపడలేదని చెప్పారు. 'ఇండియా కూటమి పతనం అంచున ఉంది. పంజాబ్, బంగాల్, బిహార్‌లో ఇండియా కూటమి దాదాపుగా ముగిసింది. బిహార్ సీఎం పట్నాలో సమావేశం ఏర్పాటు చేసి పలు ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఉమ్మడి ఎజెండా, సీట్ల సర్దుబాటుపై ఎటువంటి సమావేశాలు లేవు.' అని కేసీ త్యాగి తెలిపారు.

నీతీశ్​కు లేఖ రాసిన ఖర్గే
బిహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, జేడీయూ అధినేత, సీఎం నీతీశ్‌కుమార్‌ మళ్లీ బీజేపీతో చేతులు కలుపుతారన్న వార్తలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు గానీ, కూటమి నుంచి వైదొలగుతున్నట్టు గానీ స్పష్టమైన సమాచారం లేదన్నారు. ఇప్పటికీ ప్రతిపక్ష 'ఇండియా కూటమి'లో జేడీయూ బలమైన పార్టీయేనని చెప్పారు. గత రెండు, మూడు రోజులుగా వస్తున్న వార్తలపై నీతీశ్​కు లేఖ రాశానని, ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించానని ఖర్గే తెలిపారు. నీతీశ్‌ మనసులో ఏముందో తెలియడం లేదన్నారు. ఆదివారం దిల్లీ వెళ్తున్నట్లు చెప్పిన ఖర్గే బిహార్‌లో జరుగుతున్న పరిణామాలపై పూర్తి సమాచారం సేకరించి, స్పష్టత వచ్చిన తర్వాత మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు.

సోనియా గాంధీ, ఖర్గేతో మాట్లాడేందుకు నీతీశ్ నో!
బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ బీజేపీతో చేతులు కలపనున్నారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేతలతో మాట్లాడేందుకు నీతీశ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ నీతీశ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదని సమాచారం. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర జనవరి 30న బిహార్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనాలని ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ నీతీశ్‌కు ఆహ్వానం పంపింది. ఇదే విషయమై మాట్లాడేందుకు సోనియా శుక్రవారం ఫోన్‌ చేసినప్పటికీ నీతీశ్‌ విముఖత చూపినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో మహాకూటమి ప్రభుత్వం కూలిపోనుందనే ఊహాగానాలకు దీంతో మరింత బలం ఏర్పడింది.

గవర్నర్​ను కలిసిన బీజేపీ నేత
మరోవైపు, బిహార్​లో రాజకీయ పరిస్థితులపై వార్తల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత రాధామోహన్ సింగ్, బిహార్ గవర్నర్​ రాజేంద్ర ఆర్లేకర్​ను శనివారం కలిశారు. ఈ క్రమంలో ఆయనను మీడియా ఎన్​డీఏలో చేరికపై ప్రశ్నించగా, తన లోక్​సభ నియోజకవర్గం తూర్పు చంపారణ్​లో జరిగే ఓ కార్యక్రమానికి గవర్నర్​ను ఆహ్వానించేందుకే రాజ్‌భవన్‌కు వెళ్లానని బదులిచ్చారు.

నీతీశ్ ఇంటికి నేతలు క్యూ
ఇండియా కూటమిని వీడి ఎన్​డీఏలో జేడీయూ చేరుతుందన్న వార్తల నేపథ్యంలో సీఎం నీతీశ్ కుమార్ ఇంటికి పార్టీ అగ్రనేతలు చేరుకున్నారు. జేడీయూ నేతలు రాజీవ్ రంజన్ సింగ్, సంజయ్ కుమార్ ఝా, దేవేశ్ చంద్ర ఠాకుర్ నీతీశ్​తో శనివారం సమావేశమయ్యారు.

అమిత్ షా, నడ్డాతో పాసవాన్ భేటీ
బిహార్‌ రాజకీయ పరిణామాల నేపథ్యంలోలోక్‌ జనశక్తి- రామ్‌ విలాస్‌ వర్గం నేత చిరాగ్‌ పాసవాన్​ బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. తన పార్టీ ఆందోళనలను ఆయన గట్టిగా వినిపించి వారి నుంచి హామీ పొందినట్లు తెలుస్తోంది. జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ బీజేపీతో చేతులు కలుపుతారో లేదో చూసిన తర్వాతనే తమ పార్టీ ఓ నిర్ణయానికి వస్తుందని చిరాగ్‌ పాసవాన్​ తెలిపారు. బిహార్‌ రాజకీయ పరిణామాలపై అమిత్‌ షా, నడ్డా ఏంచెప్పారో ఆయన మీడియాకు వెల్లడించలేదు. అయితే కొంతకాలంగా బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్న తనకు బిహార్‌లో రాజకీయ పునరేకీకరణకు సంబంధించిన ప్రచారంలో కొంత నిజముందని తెలుసుకున్నట్లు చిరాగ్‌ పాసవాన్​ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై మరికొద్ది రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని షాతో సమావేశం అనంతరం చిరాగ్ మీడియాతో చెప్పారు.

Last Updated :Jan 27, 2024, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.