తెలంగాణ

telangana

రూపాయి నాణేలతో ఆప్​ అభ్యర్థి నామినేషన్​.. ఆయన ఆస్తి రూ.1,609 కోట్లు!

By

Published : Apr 18, 2023, 10:15 AM IST

రూ 10000 నాణేలను డిపాజిట్ చేసిన ఆప్​ అభ్యర్థి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి.. 10 వేల రూపాయల నాణేలతో నామినేషన్​ దాఖలు చేశారు. ఆమ్​ ఆద్మీ పార్టీకి చెందిన ఆ వ్యక్తి.. డిపాజిట్​ సొమ్మును నాణేల రూపంలో చెల్లించారు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు.. వాటిని లెక్కించేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇందుకోసం కోసం బ్యాంక్ సిబ్బంది సహాయం కూడా తీసుకున్నారు. హనుమంతప్ప కబ్బారా అనే అభ్యర్థి.. ఇలా వినూత్నంగా తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.  

హనుమంతప్ప కబ్బారా హవేరి జిల్లాలోని రాణేబెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్​ ఆద్మీ పార్టీ తరుపున ఆయన బరిలోకి దిగుతున్నారు. సోమవారం హనుమంతప్ప నామినేషన్​ పత్రాలు దాఖలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ.10 వేలు డిపాజిట్​ చేయాల్సి ఉండగా.. అందుకు రూ.10 వేలు విలువైన నాణేలను అధికారులకు చెల్లించారు. దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం అధికారులు.. ఎలాగోలా నాణేలను లెక్కించారు. చివరకు హనుమంతప్ప నామినేషన్ వేసేందుకు అనుమతినిచ్చారు.

భాజపా అభ్యర్థి పేరిట రూ.1,609 కోట్ల ఆస్థులు..
కర్ణాటక రాష్ట్ర మంత్రి ఎం.టి.బి.నాగరాజు.. తన పేరిట రూ.1,609 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. భార్య పేరిట 536 కోట్ల రూపాయల చరాస్తులు, 1,073 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. వీరిద్దరికీ రూ.98.36 కోట్ల రుణాలున్నాయని పేర్కొన్నారు. తాను దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లడించారు. హొసకోటె నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. సోమవారం నామినేషన్లు సమర్పించారు. భాజపా అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి గెలిచిన ఆయన.. అప్పట్లో రూ.1,120 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. గెలిచిన తరువాత పార్టీ మారారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 2023 ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 20 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. ఏప్రిల్ 21 నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు.. ఏప్రిల్ 24 ముగియనుంది. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడతాయి. కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ 224 నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్​ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details