తెలంగాణ

telangana

ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలంగాణ యువతి

By

Published : May 17, 2022, 12:14 PM IST

Updated : May 17, 2022, 4:23 PM IST

Anvitha reddy:
Anvitha reddy:

Anvitha reddy: రాష్ట్రానికి చెందిన అన్వితా రెడ్డి పర్వతారోహణలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. గతంలో రష్యా, ఆఫ్రికాలోని పర్వతాలు అధిరోహించిన అన్వితారెడ్డి సముద్ర మట్టానికి 8,848.86 మీటర్ల ఎత్తులోని ఎవరెస్టును బేస్‌ క్యాంపు నుంచి ఐదు రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు.

ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలంగాణ యువతి

Anvitha reddy: ఆమె 24 ఏళ్ల యువతి.. తన విజయపరంపరలో మరో కీలకమైన మైలు రాయిని దాటారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం యర్రంబల్లికి చెందిన పడమటి అన్వితారెడ్ఢి సముద్ర మట్టానికి 8,848.86 మీ. ఎత్తులోని ఎవరెస్టును బేస్‌ క్యాంపు నుంచి ఐదు రోజుల్లో అధిరోహించారు. అన్విత ప్రయత్నానికి హైదరాబాద్‌లోని ట్రాన్సెన్డ్‌ అడ్వెంచర్స్‌ సంస్థ అధినేత శేఖర్‌బాబు బాచినేపల్లి శిక్షణతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.

లక్ష్యాన్ని అధిరోహించారిలా...: హైదరాబాద్‌ నుంచి ఏప్రిల్‌ 2న నేపాల్‌కు బయలుదేరి వెళ్లారు అన్విత. నాలుగో తేదీన నేపాల్‌కు చేరుకున్నారు. డాక్యుమెంట్లు పూర్తిచేసి ఖాట్మాండ్‌లో కొన్ని రోజులు గడిపారు. అక్కడి నుంచి లుక్లాకు వెళ్లారు. 9 రోజులు కాలినడకన ఏప్రిల్‌ 17న 5300 మీ. ఎత్తులో ఉన్న మౌంట్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపునకు చేరుకున్నారు. కొన్ని రోజులు పర్వతంపైకి రొటేషన్స్‌ పూర్తి చేశారు. ఒక భ్రమణంలో ఎత్తైన శిఖరాలకు 7,100 మీ ఎక్కి తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. అన్విత అనుభవజ్ఞులైన ఇద్దరు షెర్పాల(గైడ్స్‌)తో బేస్‌ క్యాంపు వరకు పలుమార్లు వాతావరణాన్ని, ఆక్సిజన్‌ హెచ్చు తగ్గులు పరిశీలించారు. మే 12న సాహస యాత్రను ప్రారంభించి వివిధ ఎత్తులతో నాలుగు పర్వతాలు దాటి ఈ నెల 16న ఉదయం 9 గంటలకు సమ్మిట్‌ పూర్తి చేశారు. ఈ నెల 18న కిందకు బేస్‌క్యాంప్‌నకు చేరుతారని శేఖర్‌బాబు తెలిపారు. నేపాల్‌లో ఈమె సమ్మిట్‌కు సంబంధించి రికార్డులు పూర్తి చేసుకొని, ఈ నెలాఖరు వరకు హైదరాబాద్‌ చేరుకుంటారని ఆయన వివరించారు.

ప్రస్తుతం భువనగిరిలోని రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌లో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. ఎంతో మంది ఔత్సాహిక యువతీయువకులకు మెలకువలు నేర్పిస్తూనే... అడ్వాన్స్‌డ్‌ కోర్సులను పూర్తి చేశారు. ఈ స్కూల్‌లో మొదటి మహిళా శిక్షకురాలిగానే కాకుండా రాష్ట్రంలోనే పర్వతారోహణలో మొదటి ప్రొఫెషనల్ మహిళా కోచ్‌గా గుర్తింపు పొందారు. అన్విత గతంలో సిక్కింలోని రీనాక్‌, సిక్కింలోని మరో పర్వతం బీసీ రాయ్‌, కిలీమంజారో, లదాక్‌లోని కడే, ఎల్బ్రూస్‌ పర్వతాలు అధిరోహించారు.

"పర్వతారోహణ చేయాలంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎముకలు కొరికే చలి, సామగ్రి, ఆహారపదార్థాలు మోసుకెళ్లటం లాంటి సవాళ్లను తట్టుకోవాలి. స్పాన్సర్లు దొరికితే 7 ఖండాల్లో 7 ఎతైన శిఖరాలు అధిరోహించాలనేది మా కుమార్తె ఆశయం. అందులో 3 పూర్తయ్యాయి. మిగిలినవి కూడా పూర్తి చేసి తన కల నెరవేర్చుకుంటుంది. దీనికి స్పాన్సర్ల సాయం కావాలి. అన్విత ఎంతటి సాహసాన్నైనా పూర్తి చేస్తుందని నమ్మకం ఉంది. ఓ సందర్భంలో నాలుగు రోజులు అందుబాటులోకి రాలేదు. మాకు భయమేసింది. ఆ సమయంలో శేఖర్‌బాబుకు ఫోన్‌ చేసిన తర్వాత ధైర్యం వచ్చింది." - పడమటి చంద్రకళ, మధుసూదన్ రెడ్డి, అన్విత తల్లిదండ్రులు

"అమ్మాయిలు, మహిళలు ఎక్కువ సంఖ్యలో భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్‌కి ర్యాప్లింగ్, క్లైంబింగ్ చేయడానికి వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం అన్వితారెడ్డి ఉండటమే. ఆమె సాధించిన విజయాలు.. ఆమె ఏర్పరుచుకున్న ఆశయాలు ప్రతి ఆడపిల్లకు ఆదర్శం. అన్విత సాహసాలు ఎందరికో మార్గనిర్దేశం చేస్తున్నాయి." - అనిల్ కుమార్, యర్రంబల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి

ఇవీ చూడండి:'గుండెల మీద పెట్టుకుని పెంచితే.. గూడు లేకుండా చేశారయ్యా'

కుడివైపు ఉర్దూ, ఎడమవైపు హిందీ.. ఒకే బోర్డుపై రెండు తరగతులకు పాఠాలు!

Last Updated :May 17, 2022, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details