తెలంగాణ

telangana

Bhadrakali Lake Damage : భద్రకాళీ తాగునీటి జలాశయానికి గండి.. స్థానికుల్లో టెన్షన్ టెన్షన్

By

Published : Jul 29, 2023, 12:49 PM IST

Updated : Jul 29, 2023, 6:21 PM IST

Bhadrakali Lake Damage Warangal 2023 : వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వరంగల్‌ను.. భద్రకాళీ చెరువుకు గండి ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. వర్షాలకు భారీగా వరద పోటెత్తడంతో పోతననగర్‌ వైపు గండిపడింది. అప్రమత్తమైన అధికారులు మరమ్మతులు చేపట్టి.. దిగువ కాలనీలు ఖాళీ చేయించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని.. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు.

Bhadrakali Reservoir Breached
Bhadrakali Reservoir Breached

Bhadrakali Lake Damage : భద్రకాళి తాగునీటి జలాశయానికి గండి.. స్థానికుల్లో టెన్షన్ టెన్షన్

Bhadrakali Lake Damage : వరద సృష్టించిన బీభత్సం కళ్ల ముందు కదులుతుండగానే.. ఓరుగల్లులో భద్రకాళీ చెరువు పరివాహక ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో భద్రకాళీ చెరువుకు గండిపడిందన్న వార్తతో ఆందోళనకు గురయ్యారు. చెరువుకు పోటెత్తిన వరదతో.. పోతననగర్ వైపు ఉన్న చెరువు కట్టకు గండి పడింది. దీంతో అక్కడి నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తింది.

Bhadrakali temple Pond Damage : నీళ్లు దిగువ కాలనీలను చుట్టుముట్టక ముందే అప్రమత్తమైన అధికారులు.. దిగువ ప్రాంత కాలనీ వాసులను ఖాళీ చేయించారు. పోతననగర్, సరస్వతీనగర్, కాపువాడ కాలనీ ప్రజలతో పాటు రంగపేటవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరంగల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ గుండు సుధారాణి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్, పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలిని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు.

చెరువుకు గండిపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసి మరమ్మతులు చేపట్టారు. జేసీబీలతో భద్రకాళీ బండ్‌ నిర్మాణంలో భాగంగా నిర్మించిన కాల్వలోకి నీటిని మళ్లించారు. చెరువు గండిపడిన ప్రాంతానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్రమణల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మరోవైపు.. భద్రకాళీ చెరువు కట్ట పరిస్థితిని బీజేపీ, కాంగ్రెస్​ నేతలు సైతం పరిశీలించారు.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఉమ్మడి వరంగల్..: రాష్ట్రంలో భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిన ఉమ్మడి వరంగల్​ జిల్లా.. వానలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కోలుకుంటోంది. శుక్రవారం నుంచి వరుణుడు కరుణించినా.. వరద కొనసాగుతుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి. నాలాల నుంచి కొట్టుకొచ్చిన చెత్తా-చెదారంతో వీధులన్నీ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. హనుమకొండ, మహబూబాబాద్​లలోనూ పరిస్థితులు ఇలాగే ఉండగా.. ఇళ్లలోకి చేరిన బురదతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఇక ములుగు జిల్లాలోని మోరంచపల్లిలో ఏ ఇంట చూసినా.. వరద నింపిన విషాదమే కనిపిస్తోంది. ఊరిని ముంచెత్తిన భారీ వరదల నుంచి ప్రాణాలతో బయటపడిన గ్రామస్థులు.. తమ ఇళ్ల ప్రస్తుత పరిస్థితులు చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్న కాస్త గూడూ వరదల ధాటికి దెబ్బతినడంతో 'ఎట్లా బతికేదీ' అంటూ ఆందోళన చెందుతున్నారు. బాధితులను పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శించి ధైర్యం చెప్పినా.. వరద తాలూకు భయానక దృశ్యాల నుంచి వారింకా బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు.. ఆవాసం కోల్పోయిన బాధితులకు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మెడికల్ కిట్లు, మంచి నీరు అందిస్తున్నా.. గతేడాది అనుభవాలతో ప్రభుత్వం ముందుగానే స్పందించి ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వాతావరణ శాఖ ముందస్తుగానే అప్రమత్తం చేసినా.. ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ మండిపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమంటూ ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి..:

Warangal Floods 2023 : వాన తగ్గినా వీడని వరద కష్టాలు.. జలదిగ్బంధంలోనే పలు గ్రామాలు

Warangal Floods News : ఓరు'ఘొల్లు'.. ఆ హృదయ విదారక దృశ్యాలు అన్నీ ఇన్నీ కావు.. చూస్తే గుండె బరువెక్కాల్సిందే..

Last Updated : Jul 29, 2023, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details