ETV Bharat / state

Warangal Floods News : ఓరు'ఘొల్లు'.. ఆ హృదయ విదారక దృశ్యాలు అన్నీ ఇన్నీ కావు.. చూస్తే గుండె బరువెక్కాల్సిందే..

author img

By

Published : Jul 28, 2023, 7:44 PM IST

Updated : Jul 28, 2023, 8:27 PM IST

Heavy Floods In Warangal District : కనుచూపు మేరల్లో కల్లోలం.. ఊహకందని నష్టం.. మాటలకందని విషాదం. గూడు చెదిరి కొందరు.. గుండె పగిలి మరికొందరు. బతుకుజీవుడా అంటూ.. ప్రాణాలరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో చెట్టుకు, పుట్టకు చేరిన దైన్యం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరుణ విలయానికి వరద గుప్పిట్లో చిక్కుకున్న అనేక ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు, కరెంటు స్తంభించి.. అంధకారంలోనే మగ్గుతుండగా.. అతికష్టం మీద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Warangal Floods News
Warangal Floods News

ఓరు'ఘొల్లు'.. ఆ హృదయ విదారక దృశ్యాలు అన్నీ ఇన్నీ కావు.. చూస్తే గుండె బరువెక్కాల్సిందే..

Flood Flow Stuck In Warangal District : వరుణుడు శాంతించడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వరదలో కొట్టుకుపోయి పంట పొలాల్లో విగతజీవుల్లాగా కొందరు పడిపోగా.. కరెంటు తీగలకు వేలాడుతూ ఒకరు.. మురికి కాల్వలో పడిపోయి ఇంకొకరు కనిపించిన దృశ్యాలు కన్నీరు పెట్టించాయి. ప్రవాహానికి గల్లంతై రెండ్రోజులవుతున్నా.. ఆచూకీ దొరకని వారు ఇప్పటికీ దొరక్కపోవటం ప్రకృతి తాండవానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.

వరుణుడి విలయానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లా భారీగా నష్టపోగా.. అందులోనూ ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో మాత్రం భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వర్షం తగ్గిపోయినా.. ముంచెత్తిన ప్రవాహం తగ్గకపోవటంతో అనేక గ్రామాలు వరద గుప్పిట్లోనే విలవిల్లాడుతున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో నెలకొన్న దయనీయ పరిస్థితులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బుధవారం రాత్రి నుంచి జంపన్న వాగు ఉద్ధృతికి కొండాయి, దొడ్ల, మల్యాల గ్రామాలు జలదిగ్బంధం కాగా.. దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. పొంగుతున్న వాగుల మధ్య, అంధకారంలో చిక్కుకుని బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవటంతో అక్కడి ప్రజల పరిస్థితి అరణ్య రోదనైంది. ఈ తరుణంలోనే వాగు దాటుతుండగా 8 మంది గ్రామస్థులు వరదల్లో కొట్టుకుపోయారు. క్లిష్ట పరిస్థితుల్లో గాలించగా.. ఉదయం ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది మిగిలిన ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.

NDRP Forces Rescue Operation : మూడు గ్రామాలకు విద్యుత్‌, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కొండాయితో పాటు దొడ్ల, మల్యాల గ్రామాల ప్రజలను పునరావాసానికి తరలించేందుకు చర్యలు చేపట్టినా.. జంపన్నవాగు ఉద్ధృతికి సహాయక చర్యలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. చుట్టూ వరద నీటి వల్ల పునరావాస కేంద్రానికి తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది, అధికారులు బోట్ల ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నారు. ఏటూరు నాగారం మండలం చినబోయినపల్లి వద్ద పునరావాస కేంద్రం ఏర్పాటుచేసి, జంపన్న వాగు అవతల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వరద పరిస్థితులను డ్రోన్‌ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. వరద ప్రభావిత గ్రామాలకు వెళ్లే మార్గం లేక ములుగు నుంచే మంత్రి సత్యవతి రాథోడ్‌ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

మేడారం చరిత్రలోనే ఎన్నడూ లేని వరద : మేడారం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జంపన్నవాగు వరదనీరు దేవతల గద్దెలను చేరిన పరిస్థితుల్లో గురువారం వరదల్లో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ఉదయం విద్యుత్ వైర్లకు మృతదేహం వేలాడుతూ కనిపించిన దృశ్యాలు స్థానికుల గుండెల్ని పిండేసింది. వరంగల్ 29వ డివిజన్‌లోని రామన్నపేటలో ఇదే తరహాలో మరో మృతదేహం లభ్యమైంది. వరదలో ఎస్సీ కాలనీలోకి కొట్టుకొచ్చిన మృతదేహాన్ని మురుగుకాల్వలో స్థానికులు గుర్తించారు. మృతుడు నరంశెట్టి శ్రీనుగా గుర్తించారు. వరంగల్ నగరంలోనూ పలు కాలనీలు ఇంకా వరద ముంపులోనే కొనసాగుతున్నాయి.

ఇంకా తేరుకొని మోరంచపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కకావికలమైన మోరాంచపల్లి గ్రామస్థులు విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వరదలో కొట్టుకుపోగా.. ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. గ్రామానికి వెళ్లే మార్గం పూర్తిగా ధ్వంసం కాగా.. అనేక ఇళ్లు పూర్తిగా వరదలో మునిగిపోయాయి. పునరావాసాల్లో ఉన్న మోరంచపల్లి బాధితులను స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి దంపతులు పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని.. అధైర్యపడొద్దని వారు ఓదార్చారు.

Heavy Rains In Warangal : ములుగు, భూపాలపల్లి జిల్లాలతో పాటు భద్రాద్రి జిల్లాలో వరద గుప్పిట్లో విలవిల్లాడుతున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి 2 హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు, నీరు, ఔషధాలను అందజేస్తున్నారు. వరద ముంపులో ఉన్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. వరద సాయంపై దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 28, 2023, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.