తెలంగాణ

telangana

Cm KCR Districts tour: జిల్లాల పర్యటనలకు సీఎం.. పలు అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశం

By

Published : Dec 16, 2021, 5:02 AM IST

Cm KCR Districts tour:అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా పార్టీ శ్రేణుల్లో స్తబ్ధత తొలగించి ఉత్సాహాన్ని నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులను సమాయత్తం చేస్తున్నారు. వనపర్తితో ప్రారంభమయ్యే జిల్లా పర్యటనలు జనగాం, నాగర్ కర్నూల్, జగిత్యాల, నిజామాబాద్, యాదాద్రి, వికారాబాద్‌లోనూ జరగనున్నాయి.

Cm KCR Districts tour
ఆదివారం నుంచి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్న సీఎం

Cm KCR Districts tour:ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస కార్యక్రమాలు, జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన నేపథ్యంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొననున్నారు. శుక్రవారం తెరాస ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్ల సంయుక్త సమావేశం జరగనుంది. డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ల ఛైర్మన్లు, తెరాస రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా సంయుక్త సమావేశంలో పాల్గొననున్నారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ ఆలోచనలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు వివరించనున్నారు.


కలెక్టర్లతో సమావేశం

CM meet with collectors: శనివారం జిల్లా కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. ప్రగతిభవన్‌లో జరగనున్న భేటీలో మంత్రులు, సీనియర్ అధికారులు, కలెక్టర్లు పాల్గొంటారు. దళితబంధు పథకంతో పాటు ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. హుజూరాబాద్ సహా ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల్లో దళితబంధు అమలవుతోంది. ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాకు నగదు కూడా బదిలీ చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మార్చిలోపు అమలు చేయాలని గతంలో నిర్ణయించారు. ఈ విషయమై కలెక్టర్ల సమావేశంలో చర్చిస్తారు. పోడు భూముల దరఖాస్తులు, పరిష్కారం, ధాన్యం సేకరణ, యాసంగి పంటల సాగు, పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం, ధరణి సంబంధిత అంశాలు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు సహా వివిధ అంశాలపై కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.

ఆదివారం నుంచి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్న సీఎం

ఈనెల 19న ప్రారంభం

CM KCR tour start: ఈ నెల 19వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గతంలో నాలుగు జిల్లాల్లో పర్యటించిన సీఎం.. మళ్లీ వనపర్తి నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు. ఆదివారం వనపర్తి జిల్లాలో కర్నెతండా ఎత్తిపోతల పథకం, వైద్య కళాశాల, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్ రిజిస్ట్రార్, నీటిపారుదల శాఖ సీఈ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. జిల్లా కొత్త కలెక్టరేట్, రెండు పడకల ఇళ్లు సహా చిట్యాలలో నూతన మార్కెట్ యార్డులు ప్రారంభిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రదేశాలను కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో పాటు అధికారులు పరిశీలించారు.


జనగామ కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం

collectorate opening: ఈ నెల 20వ తేదీన జనగామ జిల్లాలో కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిగతా జిల్లాల్లోనూ సీఎం పర్యటనలకు సంబంధించి తేదీలు త్వరలోనే ఖరారు కానున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం, జలాశయానికి శంకుస్థాపన చేయడంతో పాటు వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోనూ పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కలెక్టరేట్లను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details