తెలంగాణ

telangana

విమెన్స్​ డే స్పెషల్: ఆమె సేవలకు సలాం... జాతీయ పురస్కారం సైతం గులాం...

By

Published : Mar 8, 2021, 11:00 AM IST

విధి నిర్వహణలో తనకు ఉన్న చిత్తశుద్ధే... ఆమెను జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక చేసింది. క్లిష్టసమయంలో విధులు నిర్వహించినందుకు గాను తగిన గుర్తింపు దక్కింది. పారిశుద్ధ్యంలో తాను చేసిన సేవలను గుర్తించి జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 ఏళ్లలో ఒక్క రోజు కూడా గైర్హాజరు అవ్వకుండా విధులు నిర్వహించిన సూర్యాపేట పురపాలక సంఘం ఉద్యోగి మోరిగ మారతమ్మను కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారంతో సత్కరించింది.

SURYAPET SANITATION WORKER MARATHAMMA GOT COVID NATIONAL AWARD
SURYAPET SANITATION WORKER MARATHAMMA GOT COVID NATIONAL AWARD


పారిశుద్ధ్య నిర్వహణలో సూర్యాపేట మున్సిపాలిటీ దేశంలోనే మంచి గుర్తింపు పొందింది. సూర్యాపేట పురపాలక సంఘం ఆచరణ దేశంలోని అనేక పురపాలక సంఘాలకు స్ఫూర్తిగా నిలిచింది. చిత్తశుద్ధి కలిగిన సిబ్బంది కారణంగానే ఇదంతా సాధ్యమైంది. అంతా సవ్యంగా ఉన్నప్పుడు విధులు నిర్వహించడమే కాదు... కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా సూర్యాపేట పురపాలక సంఘంలో అనేక మంది పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో సూర్యాపేటకు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

సూర్యాపేట నుంచి దిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన ఓ వ్యక్తి ద్వారా సూర్యాపేటలో వందల మందికి కరోనా వ్యాపించింది. ఇదే ప్రాంతంలో చాలామంది పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కజేయకుండా విధులు నిర్వహించారు. ఇటువంటి ప్రదేశంలో కూడా మెరుగు మారతమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలు ఒక్క రోజు కూడా సెలవు లేకుండా విధులు నిర్వహించారు. మారతమ్మ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది.

సెలవే తీసుకోని కార్మికురాలు...

సూర్యాపేట పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెరుగు మారతమ్మ... పదహారేళ్లుగా విధులు నిర్వహిస్తోంది. భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఇద్దరు కుమారులు. పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తూనే పిల్లలను పోషిస్తోంది. పదహారేళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్క సెలవు కూడా తీసుకోలేదంటే... వృత్తిపట్ల ఎంత నిబద్ధతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వంటి కష్ట కాలంలో కూడా ఒక్క రోజు కూడా విధులకు గైర్హాజరు కాలేదు. సూర్యాపేట కరోనా కేంద్రంగా వ్యాపించిన కూరగాయల మార్కెట్ వీధిలోనే ఆమె విధులు నిర్వహించింది. ఇటువంటి ప్రమాద ప్రాంతంలో కూడా ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వహించింది. తోటి పారిశుద్ధ్య కార్మికులు భయంతో రోజుల తరబడి సెలవులు తీసుకుంటే... ఆమె మాత్రం మొక్కవోని ధైర్యంతో పని చేసింది.

సేవలకు గుర్తింపు...

కరోనా సమయంలో ఉత్తమంగా విధులు నిర్వహించిన మహిళల వివరాలను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆయా రాష్ట్రాల నుంచి తెప్పించుకుంది. తెలంగాణ నుంచి పురపాలక శాఖ కమిషనర్ సూర్యాపేటకు చెందిన మారతమ్మ అనే మహిళను ఎంపిక చేసి కేంద్రానికి పంపించారు. ఉత్తమ సేవలందించినందుకు గాను మారతమ్మను కేంద్ర ప్రభుత్వం పురస్కారానికి ఎంపిక చేసింది. దిల్లీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆమెను అవార్డుతో సత్కరించారు.

ఇదీ చూడండి: అక్కడి మహిళల సౌందర్య సాధనం ఏంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details