తెలంగాణ

telangana

Telangana Irrigation projects : నిండుకుండలా ప్రాజెక్టులు.. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం..

By

Published : Sep 6, 2021, 9:53 AM IST

Updated : Sep 6, 2021, 11:39 AM IST

నిండుకుండలా ప్రాజెక్టులు

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, చెరువులు పొంగుతున్నాయి. ప్రాజెక్టుల(Telangana Irrigation projects)న్నీ నీటితో కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో నీరు గరిష్ఠ మట్టానికి చేరువ కావడం వల్ల అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు.. భారీ వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు, ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు.

నిండుకుండలా ప్రాజెక్టులు

విరామం లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాజెక్టులు(Telangana Irrigation projects) జలకళను సంతరించుకున్నాయి. పలు ప్రాజెక్టుల్లో నీరు గరిష్ఠస్థాయికి చేరడం వల్ల గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. భారీ వరద ప్రవాహం ఉండటం వల్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Telangana Irrigation projects)కు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 63 వేల క్యూసెక్కుల పైగా వరద నీరు వచ్చి చేరుతుండటం వల్ల అధికారులు 27 గేట్లు తెరిచి నీటిని వదులుతున్నారు. దాదాపు 1,24,840 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీరాంసాగర్‌లో విద్యుదుత్పత్తి కోసం 7,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సరస్వతి కాల్వ ద్వారా 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.5 అడుగుల మేర నీరు చేరింది. శ్రీరాంసాగర్‌ ప్రస్తుత నీటినిల్వ 87.561 టీఎంసీలు ఉంది. భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

జూరాల జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 1.03 లక్షల క్యూసెక్కులుండగా.. 20 గేట్లు ఎత్తి 1.16 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లకుగాను.. ప్రస్తుత నీటిమట్టం 318.390 మీటర్లు ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలుండగా.. ప్రస్తుతం 9.39 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజ్(Telangana Irrigation projects)​లోకి గత 15రోజులుగా భారీ వరద నీరు చేరుతోంది. నీటి ప్రవాహం రోజురోజుకు పెరగడం వల్ల అధికారులు 60 గేట్లు ఎత్తి 1,32,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాజెక్టులు నిండుకుండలా మారడం వల్ల దిగువకు నీరు విడిచిపెడుతున్నారు. ఆ నీరు పార్వతీ బ్యారేజ్​లోకి చేరుతోంది. బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 8.83 టీఎంసీలకు.. ప్రస్తుతం 4.250 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు మంథని నియోజకవర్గంలోని గోదావరి పై నిర్మించిన లక్ష్మి, అన్నారం బ్యారేజ్​ల నుంచి కూడా నీటిని విడుదల చేస్తుండటం వల్ల గోదావరి తీరాన ఉన్న పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలకు చెందిన గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచించారు.

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 1,37,371 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం 873.50 అడుగుల మేర చేరింది. గరిష్ఠ నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 156.7696 టీఎంసీల నీరు జలాశయంలో ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా..19,076 క్యూసెక్కుల నీటిని సాగర్​కు వదులుతున్నారు.

Last Updated :Sep 6, 2021, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details