తెలంగాణ

telangana

మృత్యు మార్గాలుగా ధాన్యం కుప్పలు పోసిన దారులు

By

Published : Nov 10, 2022, 7:10 PM IST

Updated : Nov 10, 2022, 7:24 PM IST

Farmers pouring crop on roads: రోడ్లన్నీ క‌ల్లాలను త‌ల‌పిస్తున్నాయి. ధాన్యం కుప్పలే మృత్యుమార్గాలు అవుతున్నాయి. సగం రోడ్డును వడ్ల కుప్పలే ఆక్రమిస్తుండ‌టంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. జాతీయ ర‌హ‌దారులు, గ్రామీణ దారులన్నీ ధాన్యం కుప్పలతో దర్శనమిస్తున్నాయి. ధాన్యం రాశులు కనిపించక... ప్రాణాలు పోతున్నాయని వాహ‌న‌దారులు వాపోతుంటే.. తమకు ప్రత్యామ్నయం లేకనే రహదారులపై పోయాల్సి వస్తుందని రైతులు ఆవేదనగా చెబుతున్నారు. పరిష్కారం చూపించాల్సిన యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించడం... మృత్యు ఘంటికలను మోగిస్తోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Farmers pouring crop on roads
Farmers pouring crop on roads

మృత్యు మార్గాలుగా ధాన్యం కుప్పలు పోసిన దారులు

Farmers pouring crop on roads: రోడ్డు ప‌క్కన వడ్ల కుప్పలు త‌ప్పించ‌బోయి... వాహనాలు బోల్తా కొడుతున్నాయి. రహదారి మ‌ధ్య వ‌ర‌కు ఇలా వ‌రి ధాన్యం ఆర‌బోయడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యాంపై వాహనాలు వెళ్లకుండా పెద్దపెద్ద బండ రాళ్లు పెట్టడం.. అది గమనించని వాహనదారులు వాటిని ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు.

పంటలో తేమను తగ్గించుకొనేందుకు అన్నదాతలు రహదారులకు ఇరుపక్కల ధాన్యం ఆరబెట్టడం వాహనదారుల పాలిట యమగండంగా మారింది. స‌గం రోడ్డు వడ్ల కుప్పల‌తో నిండిపోవ‌డంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకోవాల్సి వ‌స్తోంది. చాలా మంది రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పొడంతో పాటు గాయాలపాలవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ తరహాలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పొతున్న ఘటనలు ఏటా జరుగుతూనే ఉన్నాయి.

సీజ‌న్ రాగానే కర్షకులు రోడ్లపైకి ధాన్యం తేవడం వల్ల దారులన్నీ క‌ల్లాలుగా మారుతున్నాయి. క‌ల్లాలు లేక‌పోవడం, క‌ల్లాల ద‌గ్గర వాహ‌న స‌దుపాయం లేక‌పోవ‌డం వల్లే రోడ్లపై ఆరబోస్తున్నామ‌ని సాగుదారులు చెబుతున్నారు. అధికారులు కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నందునే రోజుల తరబడి రోడ్లపై పడిగాపులు కాస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. రాత్రి పూట వ‌చ్చే వాహ‌న‌దారుల‌తోపాటు రోజంతా ప్రయాణించేవారు ఎదురొచ్చే వాహ‌నాల‌ు త‌ప్పించ‌బోయి రాళ్లకు ఢీకొడుతున్నారు.

రోడ్డుకు ఇరు వైపులా పోయ‌డంతోపాటుగా రహదారి సగం వ‌ర‌కు ధాన్యం రాశులు నిండిపోవ‌డంతో.. వాహ‌న‌దారులకు ప్రాణసంకటంగా మారింది. ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనదారులు భయంతో ప్రయాణించాల్సి వ‌స్తుంద‌ని వాపోతున్నారు. వేల కల్లాల నిర్మాణం కోసం అధికారులు అనుమతులు ఇచ్చారు. అధికారులు అవగాహన కల్పించినా ఎక్కువమంది రైతులు ముందుకు రాకపోవడం వల్ల సగం మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి వాహనదారులు, రైతులకు నష్టం జరగకుండా పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 10, 2022, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details