తెలంగాణ

telangana

Bodhan Fake Challan Scam Update : బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణంలో సీఐడీ ఛార్జ్​షీట్

By

Published : Jul 18, 2023, 4:46 PM IST

Updated : Jul 18, 2023, 7:32 PM IST

CID on Bodhan Fake Challans Scam : వాణిజ్య పన్నుల నకిలీ చలాన్ల కుంభకోణంలో సీఐడీ అధికారులు అభియోగపత్రం దాఖలు చేశారు. 231కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సీఐడీ తేల్చింది. మొత్తం 34మందిని అరెస్ట్ చేయగా... అందులో 23మంది వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అధికారులే ఉండటం గమనార్హం. కమర్షియల్ టాక్స్ కన్సల్టెంట్ సింహాద్రి లక్ష్మిశివరాజ్, ఆయన కుమారుడు వెంకట సునీల్ సూత్రధారులుగా కుంభకోణానికి పాల్పడినట్లు సీఐడీ అధికారులు అభియోగపత్రంలో పేర్కొన్నారు.

Bodhan Fake Challan Scam
Bodhan Fake Challan Scam

CID Chargesheet in Bodhan Fake Challans Scam : ఆరేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వాణిజ్య పన్నుల శాఖ నకిలీ చలాన్ల కుంభకోణం వ్యవహారంలో సీఐడీ అధికారులు సుదీర్ఘ దర్యాప్తు నిర్వహించారు. ఆరేళ్ల పాటు కొనసాగిన ఈ దర్యాప్తులో సీఐడీ అధికారులు 34మందిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ పట్టణంలో కమర్షియల్ టాక్స్ కన్సల్టెంట్​గా కొనసాగిన సింహాద్రి లక్ష్మిశివరాజు, తన కుమారుడు వెంకట సునీల్​తో కలిసి నకిలీ చలాన్ల కుంభకోణానికి తెరలేపినట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది.

Bodhan Fake Challans Scam Latest Update : 2012 నుంచి 2017 వరకు నకిలీ చలాన్లతో విలువ ఆధారిత పన్ను చెల్లించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం 231 కోట్ల 22లక్షల రూపాయలకు పైగా ఉన్నట్లు ధృవీకరించారు. 5,500కు పైగా నకిలీ చలాన్లు సృష్టించి.. పన్ను చెల్లించినట్లు చూపి మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. దీనికి బోధన్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది సహకరించినట్లు గుర్తించారు. రైస్ మిల్లర్లు, ఇతర వ్యాపారులు విలువ ఆధారిత పన్ను చెల్లించడానికి టాక్స్ కన్సల్టెంట్ అయిన లక్ష్మిశివరాజ్​ను సంప్రదించారు. ఒక చలాన్ తీసుకొని దాని పేరు మీదే వందల మంది వ్యాపారుల పేరుతో పన్నులు చెల్లించినట్లు వ్యాపారులను నమ్మించారు. దీనిని సరిచేయాల్సిన బోధన్ వాణిజ్య పన్నుల శాఖాధికారులు సైతం నిందితులతో చేతులు కలిపి మోసానికి సహకరించారు. వచ్చిన డబ్బులో అధికారులు, సిబ్బంది సైతం వాటాలు పంచుకున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం : బోధన్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం నుంచి జమ అవుతున్న మొత్తంలో తేడా గమనించిన ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కార్యాలయానికి వచ్చిన దస్త్రాలు, జమ అయిన మొత్తంలో ఏమాత్రం పొంతన లేకపోవడంతో అంతర్గతంగా ఆడిట్ నిర్వహించిన అధికారులు.. కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అప్పటి సీటీఓ విజయేందర్ 2017 ఫిబ్రవరి 2వ తేదీన బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత పోలీస్ ఉన్నతాధికారులు కేసు తీవ్రత దృష్ట్యా సీఐడీకి బదిలీ చేశారు. సీఐడీ ఉన్నతాధికారులు నిజామాబాద్​లోని శివరాజ్​కు చెందిన కార్యాలయంతో పాటు... బోధన్​లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లతో పాటు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్​లు, ఆడిటింగ్ రిపోర్టులను స్వాధీనం చేసుకున్నారు.

123 మందిని సాక్షులుగా చేర్చిన సీఐడీ అధికారులు : శివారాజ్ కార్యాలయంలో 5500కు పైగా నకిలీ చలాన్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చలాన్లు అసలైనవా లేక నకిలీవా అని తేల్చడానికి సైతం వాణిజ్య పన్నుల శాఖాధికారులు సహకరించకుండా చేతులెత్తేయడంతో... సీఐడీ అధికారులుఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరికి పంపి నిర్ధారించుకున్నారు. వ్యాపారులతో పాటు, పలువురు అధికారులు, సిబ్బంది నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అన్నింటిని పరిశీలించిన తర్వాత భారీగా మోసానికి పాల్పడినట్లు తేల్చారు. సీఐడీ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రంలో 123మందిని సాక్ష్యులుగా పేర్కొన్నారు. 68 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్​లు, 143 కీలక పత్రాలు, 3 ఆడిట్ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించిన సీఐడీ అధికారులు అందులోని అంశాలన్నింటినీ అభియోగపత్రంలో పొందుపర్చారు.

కరీంనగర్​లోని అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో సీఐడీ అధికారులు అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ ప్రారంభమైన తర్వాత సాక్ష్యులందరినీ కోర్టులో ప్రవేశపెట్టి నేరం రుజువు చేయడంతో పాటు... నిందితులకు శిక్షపడేలా సీఐడీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated :Jul 18, 2023, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details