తెలంగాణ

telangana

కాంగ్రెస్‌లో మరోసారి బయటపడిన వర్గవిభేదాలు.. రేవంత్​ సమావేశమే కారణం..!

By

Published : Apr 27, 2022, 5:32 AM IST

కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి కాక పుట్టిస్తున్నాయి. వరంగల్‌లో మే 6న రాహుల్‌గాంధీ సభ ఉండగా.... జనసమీకరణకు సబంధించిన సన్నాహక కార్యక్రమాలపై సీనియర్‌ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు పర్యటించాల్సిన అవసరంలేదని ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంటుండగా...సన్నాహక సమావేశం నిర్వహించాలని రేవంత్‌రెడ్డి వర్గం డిమాండ్‌ చేస్తోంది.

differences Knowing out in Congress party for revanth reeddy nalgonda meeting
differences Knowing out in Congress party for revanth reeddy nalgonda meeting

కాంగ్రెస్‌లో మరోసారి బయటపడిన వర్గవిభేదాలు.. రేవంత్​ సమావేశమే కారణం..!

రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పే కాంగ్రెస్ నేతల మాటలు నోటికే పరిమితమవుతున్నాయి. సమయం వచ్చినప్పుడల్లా పార్టీలో వర్గవిభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. పీసీసీ అధ్యక్షునికి సహకారం అందిస్తామంటున్న సీనియర్ నేతలు... పరిస్థితులు మారినప్పుడల్లా ఎదురుతిరుగుతున్నారు. మే 6న కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాహుల్‌గాంధీ వరంగల్‌ సభకు సంబంధించి... పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండలో రేవంత్‌ సమావేశం ఏర్పాటు చేయడంపై... నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

వరంగల్‌ సభకు జనసమీకరణకు తామే ఏర్పాట్లు చేసుకుంటామని... పీసీసీ నుంచి ఎవరు రావాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు.. నల్గొండలో సమావేశం ఏర్పాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ను పీసీసీ ఆదేశించింది. సీనియర్‌ నేతలు ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డిని.. పీసీసీ స్థాయిలోనే ఆహ్వానించాలని శంకర్‌నాయక్‌ కోరినట్లు తెలిసింది. తాను ఆహ్వానిస్తే వారు సమావేశానికి రారని పీసీసీకి చెప్పినట్లు సమాచారం. దీంతో నల్గొండలో రేవంత్‌రెడ్డి సమావేశం ఉంటుందా...? లేదా...? అనే అంశంపై పార్టీవర్గాల్లో సందిగ్ధత నెలకొంది.

మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ నల్గొండలో పీసీసీ అధ్యక్షుడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్‌ వర్గీయులు చెబుతున్నారు. చౌటుప్పల్‌లో వందమందికిపైగా నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. వీరంతా రేవంత్‌ పర్యటనను విజయవంతం చేయాలంటూ నినాదాలు చేశారు. సీనియర్‌ నేతలే పార్టీకి గుదిబండగా మారారని... కొత్తగా పార్టీలోకి వస్తున్న యువతను వీరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడి పరిణామాలపై త్వరలోనే ఏఐసీసీకి లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సన్నాహక సమావేశాలకే.. పార్టీలో నేతల పరిస్థితి ఇలా ఉంటే... ఇక రాహుల్‌గాంధీ సభ నాటికి... ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనే భావన కాంగ్రెస్‌ వర్గాల్లో వినిస్తోంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details