తెలంగాణ

telangana

Medaram Jatara: భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి: సీఎస్​

By

Published : Feb 11, 2022, 12:37 PM IST

Medaram Maha Jatara 2022: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా.. వసతులు కల్పించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 16 నుంచి 19 వరకు జరిగే.. మహాజాతరకు సమారు కోటి మంది భక్తులు వస్తారని రాష్ట్రప్రభుత్వం అంచనావేస్తోంది.

medaram maha jatara
మేడారం మహా జాతర

Medaram Maha Jatara 2022: తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర సమీపిస్తుండటంతో.. ఏర్పాట్లపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ, గిరిజన, సంక్షేమ, దేవాదాయ, వైద్యారోగ్య, పురపాలక, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, విద్యుత్, పశుసంవర్ధక శాఖ, ఆర్​అండ్​బీ, నీటిపారుదల, ఆర్టీసీ తదితర విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్న సీఎం కేసీఆర్​ ఆదేశాలకు అనుగుణంగా.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సీఎస్ స్పష్టం చేశారు. ఈ నెల 16 నుంచి 19 వరకు.. మేడారం మహా జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. ఉదయం జంపన్న వాగులోకి నీటిని విడుదల చేశామని... దేవాదాయ, ఇంజనీరింగ్ విభాగాల పనులన్నీ దాదాపుగా పూర్తి కావొచ్చాయని వివరించారు. మేడారం పూజారులు, ట్రస్టు బోర్డు సభ్యులతో కలసి పనిచేయాలని సూచించారు.

హెల్త్​ క్యాంపులు

ఆర్టీసీ ద్వారా 3,850 బస్సులు నడిపి 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్​ తెలిపారు. మేడారంలో ప్రధాన ఆస్పత్రితో పాటు మరో 35 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఫుడ్ సేఫ్టీ అ‍ధికారులను నియమించినట్లు తెలిపారు. ఆర్​అండ్​బీ శాఖ ద్వారా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు పూర్తయ్యాయని... 327 ప్రాంతాల్లో 6,700 టాయిలెట్లు నిర్మించినట్లు వెల్లడించారు. స్నాన ఘట్టాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని... అంటువ్యాధులు, నీటి కాలుష్యం ప్రబలకుండా నిరంతరం క్లోరినేషన్ చేపట్టనున్నట్లు సీఎస్ వివరించారు. నిరంతర విధ్యుత్ సరఫరా ఉండేలా అదనపు సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జాతర ప్రాంగణంలో 18 ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లల క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శానిటేషన్ పర్యవేక్షణ కోసం 19 జిల్లాల పంచాయతీ రాజ్ అధికారులతో పాటు ఆ శాఖ నుంచి 5,000 మంది సిబ్బందిని నియమించినట్లు సీఎస్​ వివరించారు.

ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తకుండా..

సమ్మక్క- సారలమ్మ జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ నుంచి విస్తృత ఏర్పాట్లు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. భారీ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా.. అనుభవం ఉన్న పోలీసు అధికారులను విధుల్లో నియమించినట్లు వివరించారు. దాదాపు 9,000 మంది పోలీసు అధికారులను విధుల్లో నియమించామన్న డీజీపీ... ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

ఇదీ చదవండి:Medaram Invitation Card: మేడారం జాతర ప్రత్యేకతను తెలిపేలా ఆహ్వాన పత్రిక

pattu vastralu samarpana: వన దేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించిన చంద వంశస్థులు

ABOUT THE AUTHOR

...view details