తెలంగాణ

telangana

Mahabubnagar cheruvu: అభివృద్ధి సరే.. మరి అక్రమాల సంగతేంటి..?

By

Published : Apr 23, 2023, 11:04 AM IST

Mahbubnagar pedda cheruvu Modernization Works: మహబూబ్‌నగర్‌లోని పెద్దచెరువు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. జూన్ నాటికల్లా పనులు పూర్తి చేసి చెరువును మంచినీటితో నింపాలని నీటి పారుదల శాఖ పనుల వేగాన్ని పెంచింది. కానీ అభివృద్ధి పేరుతో అక్రమాలను సైతం ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Mahabubnagar cheruvu
Mahabubnagar cheruvu

Mahabubnagar pedda cheruvu Modernization Works: మహబూబ్‌నగర్‌లోని పెద్ద చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు పనులు వేగవంతం చేశారు. జూన్ నాటికి పనులు పూర్తి చేసి మంచి నీటితో పెద్ద చెరువును నింపాలనే ప్రణాళికతో నీటి పారుదల శాఖ అధికారులు ముందుకెళ్తున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం నిత్యం పెద్ద చెరువు పనులను పర్యవేక్షిస్తున్నారు. రూ.24 కోట్ల 52 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా పెద్ద చెరువు ఆనకట్ట విస్తీర్ణాన్ని మరో 10 మీటర్ల వెడల్పు పెంచనున్నారు. నెక్లెస్ రోడ్డుగా దీన్ని మార్చేందుకు కృషి చేస్తున్నారు. చెరువు మధ్య ఐలాండ్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

అక్రమ కబ్జాలు.. పెద్ద చెరువులో ఆక్రమణలు తొలగించకుండానే అభివృద్ధి పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మాణాలు తొలగించకుండా అభివృద్ధి చేసినా ఫలితం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో చెరువు 96 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుతం 56 ఎకరాలకు కుచించుకుపోయింది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 64, బఫర్‌ జోన్‌లో 70కు పైగా ఆక్రమణలున్నట్లు అధికారులు గుర్తించి.. హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. అక్రమార్కులకు తాఖీదులిచ్చి అధికార యంత్రాంగం వదిలేసింది. వీటిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మట్టి దందా.. ఇక మహబూబ్‌నగర్‌ పెద్ద చెరువు అభివృద్ధి పేరుతో ఒండ్రుమట్టి దందా జోరుగా సాగుతోంది. రైతులకు ఉచితంగా మట్టి ఇస్తున్నామని చెబుతూ ఇట్టుక బట్టీలకు, పాలమూరు రంగారెడ్డి పనుల కోసం మట్టిని తరలిస్తున్నారు. నిత్యం 40 టిప్పర్లలో 9 వేల 600 క్యూబిక్‌ మీటర్ల నల్లమట్టి తరలుతోంది. బయట మార్కెట్‌లో క్యూబిక్‌ మీటర్‌ మట్టి ధర రూ.వెయ్యి పలుకుతోంది. ఈ లెక్కన నిత్యం లక్షల్లో గుత్తేదారులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులు మాత్రం రైతులకు ఉచితంగా మట్టి ఇస్తున్నట్లు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కర్షకులకు లబ్ధి జరగడం లేదు.

నీటి పారుదల శాఖ అధికారులు దృష్టి సారించి ఆక్రమణలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుని చెరువు అభివృద్ధి కోసం వినియోగించాలని జనం కోరుతున్నారు. పెద్ద చెరువును మంచినీటితో నింపాలన్న ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పట్టణ మరుగుతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

"రైతులకు, పాలమూరు-రంగారెడ్డి పనులకు సహా కట్ట నిర్మాణం కోసం నల్లమట్టిని వినియోగిస్తున్నాము. ఒండ్రు తీయడం వల్ల చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, భూగర్భ జలాలు సైతం పెరుగుతాయి. చెరువు ఆక్రమణలను సైతం గుర్తించి నోటీసులు జారీ చేశాం".- మనోహర్, డీఈఈ, మహబూబ్ నగర్

"పెద్ద చెరువు అభివృద్ధి పేరుతో ఒండ్రుమట్టి దందా జోరుగా సాగుతోంది. రైతులకు ఉచితంగా మట్టి ఇస్తున్నామని చెబుతూ ఇటుక బట్టీలకు, పాలమూరు రంగారెడ్డి పనుల కోసం మట్టిని తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు." - స్థానికుడు

అక్రమ కబ్జాలపై చర్యలేకుండానే.. ఆధునీకీకరణ పనులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details