తెలంగాణ

telangana

కొడుకును చూసింది... అమ్మ మురిసింది..!

By

Published : Dec 25, 2020, 7:08 AM IST

చిన్నతనంలోనే అలిగి ఇల్లు వదిలిన బాలుడు.. రాష్ట్రం దాటి వచ్చాడు. పెరిగిపెద్దయి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ముప్పై ఏళ్ల తర్వాత సొంతూరుకు వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. కన్నబిడ్డ ఎప్పటికైనా తిరిగి వస్తాడనే నమ్మకం ఎట్టకేలకు నెరవేరిందని ఆ అమ్మ ఆనందబాష్పాలు రాల్చగా, తల్లిని చూసిన తన్మయత్వంలో కుమారుడు చిన్నపిల్లాడై ఆమె ఎదపై ఒదిగిపోయాడు. ఇది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని దొంతు రమేశ్‌ గాథ.

mother-and-son-met-after-long-time-at-chimapoodi-in-khammam-district
కొడుకును చూసింది... అమ్మ మురిసింది

పదేళ్ల వయసులో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు ఆ బాలుడు. రాష్ట్రం దాటి వచ్చి పెరిగి పెద్దయ్యాడు. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. చాలా ఏళ్ల తర్వాత కన్నతల్లికి చెంతకి చేరాడు. ముప్పై ఏళ్ల తర్వాత బిడ్డను చూసిన ఆ అమ్మ ఆనందబాష్పాలతో తడిసిముద్దయింది. ప్రస్తుతం నలభై ఏళ్ల వయసున్న రమేశ్‌... సుమారు పదేళ్ల వయసులో కుటుంబ సభ్యులపై అలిగి రైలెక్కాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయంలో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పాపటపల్లి రైల్వేస్టేషన్‌లో దిగాడు. అక్కడ బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్న రమేశ్‌ను చిమ్మపూడి గ్రామానికి చెందిన దొంతు సత్యం, నాగమణి దంపతులు చేరదీశారు. అక్కడే పెరిగిపెద్దయిన అతను ప్రస్తుతం గీత వృత్తితోపాటు, గ్రానైట్ పరిశ్రమలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. మండలంలోని మల్లేపల్లికి చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వారికి 14 ఏళ్ల రాజేశ్‌, పదేళ్ల నందిని సంతానం. తల్లిదండ్రులను కలుసుకునేందుకు రెండు,మూడు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు.

కొడుకును చూసింది... అమ్మ మురిసింది

ఇటీవల తాను పనిచేసే గ్రానైట్ పరిశ్రమ యజమాని కుమారుడికి స్నేహితుడైన తమిళనాడుకు చెందిన వ్యక్తిని కలిసిన రమేశ్‌, తన పుట్టుపూర్వోత్తరాలు వివరించాడు. అతని సాయంతో గత శనివారం స్వగ్రామం తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా అబ్బూరు తాలూకా కథవాలెంలోని ఇంటికి వెళ్లాడు. తల్లి మునియమ్మను గుర్తించాడు. ముప్పై ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కుమారుడుని చూసి ఆ తల్లి ఆనందబాష్పాలతో తడిసిముద్దయింది. తల్లి, చెల్లెలు నళిని, బావతో కలిసి రమేశ్‌ బుధవారం రాత్రి చిమ్మపూడికి చేరుకున్నాడు. తాము పెంచుకున్న కుమారుడు ఎట్టకేలకు కన్నవాళ్లను కలవడం తమకూ సంతోషమేనని సత్యం, నాగమణి దంపతులు తెలిపారు.

ఇదీ చదవండి:పండుగలు ఇంట్లోనే జరుపుకోండి: ఈటల

ABOUT THE AUTHOR

...view details