తెలంగాణ

telangana

ఆర్డీఎస్ అవస్థలు.. ఆధునికీకరించాలని అన్నదాతల వేడుకోలు

By

Published : Jul 30, 2021, 3:10 PM IST

rds canal

ఆ కాలువ ద్వారా నీరు వస్తుందని రైతులు సంతోషించేలోపే గండి పడి పంట పొలాలు మునిగిపోతున్నాయి. ఆ కాలువ ద్వారా చివరి ఆయకట్టకు నీరు రాక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇంతకీ అది ఏ కాలువ అంటారా.. అదే ఆర్డీఎస్​ కాలువ.. ఈ కెనాల్​కు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.

గండ్లు పడుతున్న ఆర్డీఎస్ కాలువ.. ఆధునికరించాలని రైతుల విజ్ఞప్తి

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్ కాలువ ద్వారా పొలాలకు నీరు అందుతోంది. దీని కింద సుమారు 85 వేల 7 వందల ఎకరాల ఆయకట్టు ఉంది. గత కొన్నేళ్లుగా ఆర్డీఎస్ ప్రధాన కాలువకు అరకొర నీరు రావటంతో రైతులు చాలా ఇబ్బంది పడేవారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజోలి మండలం తుమ్మీళ్ల గ్రామం దగ్గర తుంగభద్ర నదిపై తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి ఆర్డీఎస్ ప్రధాన కాలువ 21 డిస్ట్రిబ్యూటర్ వద్ద అనుసంధానం చేశారు. ఆర్డీఎస్ ప్రధాన కాలువ ఐజ మండలం సింధనూర్ నుంచి ప్రారంభమై డీ40 అలంపూర్ చివరివరకు ఉంటుంది.

గండ్లు పడుతున్నాయి

కాలువలు పురాతనమైనవి కావటంతో ఆర్డీఎస్ ప్రధాన కాలువలో నీటి పారుదల ఉన్నప్పుడు ప్రతి ఏటా గండ్లు పడటం సర్వసాధారణంగా మారింది. కాలువ లైనింగ్ దెబ్బ తినటంతో పాటు ముళ్ల పొదలు, సిల్ట్ పేరుకుపోయి కాలువలు శిథిలావస్థకు చేరాయి. అంతేకాకుండా చాలాచోట్ల సెటర్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో కాలువలు కోతకు గురవుతున్నాయి. ప్రతి ఏడాది రైతులు వెళ్లి అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన కరవైందిని రైతలు చెబుతున్నారు. రెండు సంవత్సరాలుగా 63 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల కాలేదన్నారు.

రిజర్వాయర్లు పూర్థిస్థాయిలో నిర్మించాలి

గతేడాది సింధనూరు సమీపంలో కాలువకు గండి పడి సుమారు 100 ఎకరాల వరి పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. జూరాల నుంచి నీరు వదలటంతో ఆర్డీఎస్ డి34 డిస్ట్రిబ్యూటర్ వద్ద కాలువ పూర్తిగా దెబ్బతినటంతో గండి పడి పొలాల గుండా నీరు ప్రవహించి కోతకు గురైంది. దీంతో రైతులు చాల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం 2018 ఎన్నికల​ ముందు హడావుడిగా ఎత్తిపోతలను ప్రారంభించి నీటిని వదిలారని రైతులు చెబుతున్నారు. కాలువల ఆధునీకరణ చేపట్టకపోవడంతో నీటిని పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయామన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్లలాంటే కాలువలను ఆధునీకరించాలని రైతులు కోరుతున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిర్మించాలన్నారు. మల్లమ్మ గుంట, వల్లూరు జులకల్ రిజర్వాయర్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మూడు సంవత్సరాల క్రితం తుమ్మిళ్ల ద్వారా నీరు విడుదల చేశారు. కాలువ దెబ్బతినడం వల్ల చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. మూడు రిజర్వాయర్లు పూర్తి చేసి కాలువకు మరమ్మతులు చేస్తేనే చివరి ఆయకట్టుకు నీరు అందుతుంది.

రాముడు, మాజీ సర్పంచ్​

ఇదీ చదవండి:NagarjunaSagar : రెండు రోజుల్లో సాగర్‌ను తాకనున్న శ్రీశైలం జలాలు

ABOUT THE AUTHOR

...view details